14 రోజుల తర్వాతే రాష్ట్రంలోకి

ABN , First Publish Date - 2020-03-29T09:19:42+05:30 IST

‘‘ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నవారికి సరిహద్దుల్లోనే భోజనం, వసతి ఏర్పాటుచేయాలి. 14రోజుల క్వారంటైన్‌కు సిద్ధపడేవారికి మాత్రమే అనుమతి ఇవ్వాలి.’’ అని సీఎం జగన్‌ ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై...

14 రోజుల తర్వాతే రాష్ట్రంలోకి

  • ఎవరైనా క్వారంటైన్‌లో ఉండాల్సిందే: సీఎం
  • విదేశాల నుంచి వచ్చిన ప్రతి పదిమందికి ఓ వైద్యుడు
  • నిత్యావసరాలపై ప్రజలు సంతృప్తి చెందాలి
  • ఆ తర్వాతే సమయాన్ని కుదించే ఆలోచన 
  • కరోనా టెస్టింగ్‌ ల్యాబ్‌ల సామర్థ్యం పెంచాలి
  • డాక్టర్లు, స్పెషలిస్టుల మధ్య వీడియో లింక్‌ 
  • నిత్యావసరాల వాహనాలూ నిలిపేస్తున్నారు
  • దీనిపై డీజీపీ దృష్టి పెట్టాలి: సీఎం ఆదేశాలు

అమరావతి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ‘‘ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నవారికి సరిహద్దుల్లోనే భోజనం, వసతి ఏర్పాటుచేయాలి. 14రోజుల క్వారంటైన్‌కు సిద్ధపడేవారికి మాత్రమే అనుమతి ఇవ్వాలి.’’ అని సీఎం జగన్‌ ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై శనివారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్వారంటైన్‌ క్యాంపుల పర్యవేక్షణకు ఒక రెసిడెంట్‌ అధికారిని నియమించాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఏపీకి చెందిన కూలీలు, కార్మికుల స్థితిగతులను తెలుసుకుని ఎప్పటికప్పుడు స్పందించడానికి రాష్ట్రస్థాయిలో ఒక ఐఏఎస్‌ అధికారికి బాధ్యతలు అప్పగించాలన్నారు.


సరిహద్దుల్లో చేసిన ఏర్పాట్లు, క్వారంటైన్‌లో ఉన్నవారికి భోజన, వసతి సదుపాయాలను మరో ఐఏఎస్‌ అధికారి పర్యవేక్షించాలని సూచించారు. పొరుగు రాష్ట్రాల కలెక్టర్లతో కూడా వీరు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలన్నారు. సరిహద్దుల్లో అందుబాటులో ఉన్న కల్యాణ మండపాలు, హోటళ్లు తదితరాలను గుర్తించి, శానిటైజ్‌ చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఉదయం 6నుంచి మఽధ్యాహ్నం 1గంట వరకూ ఉన్న వెసులుబాటు సమయాన్ని తగ్గించాలన్న అంశంపై అధికారులు ప్రస్తావించారు. నగరాలు, పట్ణణాల్లో ప్రజల సంఖ్యకు తగినట్టుగా రైతుబజార్లు, నిత్యావసరాల దుకాణాలు ఉన్నాయో, లేదో పరిశీలన చేయాలని జగన్‌ సూచించారు. శాస్త్రీయంగా పరిశీలించి, మ్యాపింగ్‌ చేయాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, ఏర్పాట్లపై వారు సంతృప్తి వ్యక్తం చేసిన తర్వాతే సమయాన్ని తగ్గించే ఆలోచన చేయాలని సీఎం స్పష్టం చేశారు. జిల్లాల్లో కరోనా నివారణ చర్యల కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చే వైద్యులను గుర్తించి వారి సేవలు ఉపయోగించుకోవాలని ఆదేశించారు.


వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు తమ సర్వే ద్వారా గుర్తించిన వారిని వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. నిర్దేశిత ప్రొటోకాల్‌ ప్రకారం వారికి వైద్యం అందించాలన్నారు. ప్రతి 10 పాజిటివ్‌ కేసుల్లో 9 అర్బన్‌లో, ఒకటి రూరల్‌లో నమోదవుతున్న నేపథ్యంలో అర్బన్‌ ప్రాంతాలపై మరింత దృష్టి పెట్టాలన్నారు. విశాఖపట్నం,విజయవాడ, గుంటూరుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు చెప్పారు. కరోనా నివారణ చర్యల కోసం హౌస్‌సర్జన్ల సేవలు వినియోగించుకోవడం, విదేశాల నుంచి వచ్చిన ప్రతి పదిమందికి ఒక వైద్యుడిని కేటాయించడం, వీరిపైన స్పెషలిస్ట్‌ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. డాక్టర్లు, స్పెషలిస్టుల మధ్య వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం కల్పించాలని సీఎం ఆదేశించారు. ప్రతి 50ఇళ్ల తాలూకు పరిస్థితులను ఎప్పటికప్పుడు వలంటీర్లు నమోదు చేయాలన్నారు. వలంటీర్లు, ఆశావర్కర్లు, వైద్యులకు రక్షణ పరికరాలు అందించాలని ఆదేశించారు. కరోనా టెస్టింగ్‌ సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టిపెట్టాలన్నారు. గూడ్స్‌, నిత్యావసరాల వాహనాలు నిలిపేస్తున్నారంటూ ఫీడ్‌బ్యాక్‌ వస్తోందని, దీనిపై దృష్టి పెట్టాలని డీజీపీని ఆదేశించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, ఆక్వారంగంలో సమస్యలు పరిష్కరించచాలన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం కచ్చితంగా పాటించేలా చూడాలని సీఎం ఆదేశించారు. 


Updated Date - 2020-03-29T09:19:42+05:30 IST