Abn logo
Aug 4 2021 @ 00:31AM

నా హాకీ కిట్‌ కోసం...నాన్న మోటార్‌ బైక్‌ అమ్మారు!

ది చరిత్ర పుటల్లో నిలిచిపోయే గోల్‌...’భారతదేశ అధికారిక ‘టోక్యో ఒలింపిక్స్‌’ ట్విట్టర్‌ ఖాతా ‘అద్వితీయం’ అంటూ అభివర్ణించిన ఆ గోల్‌ సాధించి...తొలిసారి భారత మహిళా హాకీ జట్టు ఒలింపిక్స్‌ సెమీస్‌లో చేరడానికి దోహదం చేసిన క్రీడాకారిణి గుర్జీత్‌ కౌర్‌.పంజాబ్‌కు చెందిన ఈ పాతికేళ్ళ అమ్మాయి తన డిఫెన్స్‌, డ్రాగ్‌ ఫ్లిక్స్‌ నైపుణ్యంతో మహిళా హాకీ జట్టుకు వెన్నెముకగా నిలుస్తోంది.చదువు తప్ప మరేదీ పట్టని గుర్జీత్‌ హాకీలో సంచలనాలు సృష్టించడం వెనుక ఉన్న కథ... ఆమె మాటల్లోనే...


‘‘దేశానికి ప్రాతినిధ్యం వహించడం అంటే కోట్లాది ప్రజల కలల్ని మోస్తున్నట్టు! ఆటగాళ్ళు భావోద్వేగాలకు గురికావడం, ఒత్తిడికి లోనవడం మామూలే. అందులోనూ... ఆస్ట్రేలియా లాంటి బలమైన ప్రత్యర్థి ఎదురైనప్పుడు వాటన్నిటినీ నియంత్రించుకుంటూ... మెరుగ్గా ఆడడానికి ప్రయత్నించాలి. ఎలాంటి పొరపాటుకూ తావివ్వకూడదు. అందివచ్చిన అవకాశాలను చేజారనివ్వకూడదు. మొన్న క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఇవన్నీ మేము దృష్టిలో ఉంచుకున్నాం. ఒలింపిక్స్‌ చరిత్రలోనే మొదటిసారి భారత మహిళా హాకీ జట్టు సెమీస్‌లో అడుగుపెట్టడానికి నేను చేసిన ఏకైక గోల్‌ కారణం కావడం... నేను ఎన్నటికీ మరచిపోలేని అనుభూతి. మా జట్టునూ, నన్నూ ఎందరో ప్రశంసిస్తూ ఉంటే... సంతోషంతో నోట మాట రావడం లేదు. హాకీ క్రీడ కారణంగానే ఈ రోజు నాకు ఈ గుర్తింపు వచ్చింది. అయితే, క్రీడాకారిణి అవుతానని కానీ, ఈ రంగంలో రాణిస్తానని కానీ అనుకోలేదు. 

13 కిలోమీటర్లు సైకిల్‌ మీద...

మాది పంజాబ్‌లోని అమృతసర్‌ జిల్లా మియాది కలాన్‌ గ్రామం. మా నాన్న సత్నామ్‌ సింగ్‌ రైతు. అమ్మ హర్జీందర్‌ సింగ్‌ గృహిణి. మా అక్క ప్రదీప్‌ కౌర్‌, నేనూ... ఇద్దరమే బిడ్డలం. మమ్మల్ని బాగా చదివించాలని అమ్మా, నాన్నా ఎంతో తపన పడేవారు. మా గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాల ఉన్నప్పటికీ, మంచి చదువుల కోసం పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అజ్నాలాలో, ఒక పైవ్రేట్‌ స్కూల్లో చేర్పించారు. ప్రతి రోజూ మా ఇద్దరినీ నాన్న సైకిల్‌ మీద బడిలోదిగబెట్టేవారు. తరగతులు పూర్తయ్యాక తిరిగి తీసుకొచ్చేవారు. చాలాసార్లు మా ఫీజులు కట్టడం కూడా కష్టమైపోయేది. చివరికి, నాకు పదకొండేళ్ళ వయసున్నప్పుడు... మా ఊరికి డెబ్భై కిలోమీటర్లకి పైగా దూరంలో ఉన్న కైరోం బోర్డింగ్‌ స్కూల్లో మమ్మల్ని చేర్చారు. ‘అమ్మనూ, నాన్ననూ బాగా చూసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితంలో స్థిరపడాలి...’ ఇవే మా ఆలోచనలు. అందుకే శ్రద్ధగా చదివేవాళ్ళం. ఖాళీ సమయాల్లో మైదానానికి వెళ్ళి... తోటి స్టూడెంట్స్‌ ప్రాక్టీస్‌ చేస్తూంటే చూసేదాన్ని. మహిళా హాకీలో జాతీయ స్థాయిలో కైరోంకు మంచి పేరుంది. ఎక్కువమంది హాకీ ఆడేవాళ్ళు. కాలక్షేపంగా చూడడమే తప్ప మొదట్లో దీన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. అప్పట్లో హాకీ గురించి నాకేం తెలీదు కూడా. నా ధ్యాస ఎప్పుడూ చదువు మీదే ఉండేది. ఆ తరువాత సరదాకి హాకీ ఆడడం మొదలుపెట్టాను. త్వరలోనే అది నా రోజువారీ కార్యక్రమంలో భాగమైపోయింది. ఆడుతున్న కొద్దీ ఆసక్తి పెరుగుతూ వచ్చింది. గ్రాడ్యుయేషన్‌ కోసం జలంధర్‌లోని కాలేజీలో చేరిన తరువాత, కూడా కొనసాగించాను. అయితే ఇది అంత సులువుగా జరిగిపోలేదు. నా కుటుంబం ఎన్నో త్యాగాలు చేయాల్సి వచ్చింది. నాకు మంచి హాకీ కిట్‌ కొనడం కోసం మా నాన్న తన మోటార్‌ సైకిల్‌ అమ్ముకోవాల్సి వచ్చింది. 


మూడేళ్ళు ఎదురు చూశాను...

2012లో, నేను ఇంటర్‌ చదువుతున్నప్పుడు, ఇండియన్‌ జూనియర్‌ టీమ్‌ క్యాంప్‌కు సెలక్ట్‌ అయ్యాను. రెండేళ్ళ తరువాత సీనియర్‌ క్యాంప్‌కి ఎంపికయ్యాను. కానీ ఆడే అవకాశానికి మూడేళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది. దేశం తరఫున ఆడాలన్నది నా కల. 2014లో సీనియర్‌ నేషనల్‌ క్యాంప్‌ నుంచి పిలుపు వచ్చింది. కానీ తుది జట్టులో స్థానం దొరకలేదు. ఆ తరువాత కూడా జట్టులోకి రావడం, పోవడం... ఎప్పటికైనా జట్టులో స్థిరమైన స్థానం సంపాదించాలని కష్టపడ్డాను. లోపాలను సరి చేసుకుంటూ వచ్చాను. ఎందుకిలా అవుతోందని ఆలోచించినప్పుడు... నాదైన ప్రత్యేకత ఏదైనా ఉండాలనిపించింది. ‘భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే నాకున్న ప్రత్యేకత ఏమిటి?’ అని ప్రశ్నించుకున్నాను.


డ్రాగ్‌ ఫ్లిక్స్‌ మీద మరింత దృష్టి పెడితే బాగుంటుందనుకున్నాను. అదృష్టవశాత్తూ నెదర్లాండ్స్‌లో డ్రాగ్‌ ఫ్లిక్స్‌ నిపుణుడు టూన్‌ సీప్‌మేన్‌తో పని చేసే అవకాశం వచ్చింది. కొన్ని వారాలు ఆయన దగ్గర మెళకువలు నేర్చుకున్నాను. 2017 నుంచీ జట్టులో స్థిరంగా కొనసాగుతున్నాను. అదే ఏడాది కెనడాతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో, హాకీ వరల్డ్‌ లీగ్‌లో ఆడాను. అయితే నాకు తొలిసారి గుర్తింపు దక్కింది మాత్రం ఆ ఏడాది జరిగిన ఆసియాకప్‌లో. ఉపఖండం ఛాంపియన్‌గా భారత జట్టు ఆవిర్భవించింది. 2018లో లండన్లో జరిగిన హాకీ వరల్డ్‌ కప్‌కు జట్టు క్వాలిఫై అయింది. ఆ టోర్నమెంట్‌లో నేను ఎనిమిది గోల్స్‌ చేశాను. మూడవ అత్యధిక గోల్‌ స్కోరర్‌గా నిలిచాను. వాటిలో ఏడు పెనాల్టీ కార్నర్స్‌ ద్వారా వచ్చినవే. హిరోషిమాలో జరిగిన ఎఫ్‌ఐహెచ్‌ ఫైనల్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాను. ఆ టోర్నమెంట్‌లో పదకొండు గోల్స్‌ చేశాను. 


అదే మమ్మల్ని కలిపి ఉంచుతోంది...

నేను అన్ని స్థానాల్లో ఆగడలను. క్యాంప్‌లో ఉన్నప్పుడు, అన్ని స్థానాల్లో ఆటగాళ్ళ నైపుణ్యాల్ని పరీక్షిస్తారు. మనం ఒక స్థానంలో బాగా రాణిస్తున్నట్టు కోచ్‌లు గమనిస్తే, అదే స్థానంలో ప్రోత్సహిస్తారు. నేను డిఫెన్స్‌ బాగా చెయ్యగలనని కోచ్‌లు గుర్తించడంతో, డిఫెండర్‌గా మారాను. మిగిలిన జట్లలో పెనాల్టీ కార్నర్‌ స్పెషలిస్ట్‌లు ఒకరికన్నా ఎక్కువ మందే ఉన్నారు. కానీ చాలాకాలంగా భారత జట్టులో ఆ విభాగంలో స్పెషలిస్ట్‌గా నేను మాత్రమే కొనసాగుతున్నాను. మా టీమ్‌లో సభ్యులందరం ఒక కుటుంబంలా ఉంటాం. ఒకరికి ఒకరు సాయపడతాం, సలహాలు ఇచ్చుకుంటాం. ఏవైనా సమస్యలుంటే తీర్చడానికి ప్రయత్నిస్తాం. అదే మమ్మల్ని కలిపి ఉంచుతోంది. ఇది మా కష్టానికి ఫలితం. ఈ రోజుకోసం మా టీమ్‌లో ప్రతి ఒక్కరూ రేయింబవళ్ళు శ్రమించారు. నా గోల్‌తో మా టీమ్‌ సెమీస్‌కు చేరినందుకు నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఇవి గర్వకారకమైన క్షణాలు. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచినవారికీ, మా గెలుపు కోసం ప్రార్థనలు చేసిన భారతీయులందరికీ ధన్యవాదాలు. అయితే, మా పోరాటం ఇంకా అయిపోలేదు. సెమీస్‌ దాటి, ఫైనల్స్‌లో బంగారు పతకం సాధించడం మీదే ఇప్పుడు మా దృష్టంతా.’’