డ్రగ్స్‌ రహిత సమాజం కోసమే...

ABN , First Publish Date - 2022-07-20T06:42:24+05:30 IST

‘‘సినిమాల్లో హీరోలు స్టయిల్‌గా సిగరెట్‌, మద్యపానం తాగడం చూస్తున్నాం. దీనివల్ల యువత పెడదారి పడుతోంది.

డ్రగ్స్‌ రహిత సమాజం కోసమే...

 స్త్రీని దేవతగా కొలిచే మనదేశంలో ‘ఆమె’కు అన్ని దిక్కులనుంచీ కష్టాలే. స్పై కెమరాలు,  డ్రగ్స్‌ వల్ల మహిళలకు రక్షణే కరువైంది. ఇలాంటి తరుణంలో మహిళల కోసం నేనున్నానంటూ పోరాటం చేస్తున్నారు.. ‘హెవెన్‌ హోమ్స్‌ సొసైటీ’ ఫౌండర్‌ వరలక్ష్మి. ‘సమాజం బావుండాలన్నదే నా లక్ష్యం. సామాజిక అవగాహనే నా బాధ్యత’ అంటున్న వరలక్ష్మిని ‘నవ్య’ పలకరిస్తే ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారిలా..


‘‘సినిమాల్లో హీరోలు స్టయిల్‌గా సిగరెట్‌, మద్యపానం తాగడం చూస్తున్నాం. దీనివల్ల యువత పెడదారి పడుతోంది. ప్రస్తుతం ‘డ్రగ్స్‌’ అనే మాట మనం ఎక్కువగా వింటున్నాం. గుట్కా, తంబాకు, గంజాయి, కొకైన్‌, ఎల్‌ఎ్‌సడీ.. ఇలా పలురకాల మత్తు పదార్థాలకు యువత బానిసలవుతున్నారు. ఇటీవల ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్తే ఐదో తరగతి పిల్లలు ఇలాంటి డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారనే విషయం తెల్సింది. ఇంతకంటే దారుణం మరొకటి లేదు. అయితే డ్రగ్స్‌ విషయంలో ఏ ప్రభుత్వమూ సీరియ్‌సగా తీసుకోవటం లేదు. అక్రమంగా దేశంలోకి డ్రగ్స్‌ వస్తూనే ఉన్నాయి. తెలిసో తెలియకో డ్రగ్స్‌కు కొందరు బానిసలవుతున్నారు. ఆ తర్వాత బయటకి రాలేకపోతున్నారు. 


అవగాహనే ముఖ్యం.. 

మా ఎన్జీవో తరఫున ప్రజల్లో డ్రగ్స్‌ గురించి అవగాహన తీసుకువస్తున్నా. ముఖ్యంగా యువత వీటి బారిన పడుతోంది కాబట్టి కాలేజీలకు వెళ్లి డ్రగ్స్‌ దుష్పరిణామాలను తెలియజేస్తున్నా. తెలంగాణ శిశు సంక్షేమశాఖ సహకారంతో ప్రతి కాలేజీలో ఉమెన్‌ సెక్యూరిటీ అవగాహనతో పాటు కౌన్సెలింగ్‌ సెక్షన్‌ కూడా ఏర్పాటు చేస్తున్నాం. కౌన్సెలింగ్‌, ట్రీట్‌మెంట్‌ ఇవ్వటానికి డాక్టరు అందుబాటులో ఉంటారు. యువతకు అవగాహన కల్పిస్తేనే భావితరం బాగుపడుతుంది. అందుకే అవగాహన కల్పించటమే మా ప్రధానమైన ఉద్దేశం. అటువైపే అడుగులేస్తున్నాం.


ఇలా ఏనాడూ ఊహించలేదు.. 

‘హెవెన్‌ హోమ్స్‌ సొసైటీ’ని మహిళా సాధికారత కోసం స్థాపించా. మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించాలనే వచ్చా కానీ.. ఆ తర్వాత అంతకంటే ఘోరమైన సమస్యలు మహిళలను చుట్టుముట్టాయని అర్థమైంది. ముఖ్యంగా ఈ రోజుల్లో మహిళలను అధికంగా వేధించేది.. కొందరు రహస్యంగా తీసే వీడియోలే. దీంతో ‘స్పై కెమెరా’ల గురించి తెలుసుకోవాలని.. ఎనిమిది నెలలు తిరిగి ఎన్నో కేస్‌స్టడీస్‌ తీసుకున్నా. చాక్లెట్లలా స్పై కెమెరాలను కొన్ని షాపుల్లో అమ్ముతున్నారు. దీంతో హాస్టల్స్‌, షాపింగ్‌ మాల్స్‌, హోటల్స్‌లో.. రహస్యంగా మహిళల వీడియోలు తీస్తూనే ఉన్నారు. ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు. బెడ్‌రూమ్‌లోని వీడయోల నుంచి బయటి హోటల్స్‌ వరకూ స్పై కెమెరాలతో తీసిన కొన్ని లక్షల వీడియోలు ఇంటర్నెట్‌లో ఉన్నాయి. స్పై కెమెరాలకు నియంత్రణ లేదు. రహస్యంగా వీడియోలు తీస్తే శిక్షించే చట్టాలు లేవు. అంతెందుకూ.. దుస్తులను అమ్మే షాపు యజమానులు స్పై కెమెరాలు దొరికితే ‘మాకు తెలీదు. ఇది మైనర్ల పని’ అంటున్నారు. అందుకే ‘యాంటీ రెడ్‌ ఐ’ పేరుతో ఏడేళ్లనుంచి స్పై కెమెరాల మీద ఉద్యమమే చేస్తున్నా. ఫోన్లు చేసి భయపెట్టినా.. నా ప్రయాణం ఆపలేదు. రెట్టింపు శక్తితో పని చేస్తున్నా. 


ఎక్కడున్నా బాధ్యత మర్చిపోను...

ఎన్జీవో స్థాపించాక.. హెచ్‌ఐవీపై అవగాహన కల్పించడానికి నల్లగొండ జిల్లాలో తిరిగా. ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశా. తెలుగు రాష్ర్టాలకు స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ఇంచార్జిగా పని చేశా. ఆ తర్వాత ‘నిమ్‌సే’ సంస్థ ఆధ్వర్వంలో స్కిల్‌ డెవల్‌పమెంట్స్‌ కార్యక్రమాలు చేశా. అనుకోకుండా సెన్సార్‌ బోర్డు మెంబరు అయ్యా. ఇలా జీవితం మలుపులు తిరిగినా.. ప్రతిచోటా నా వంతు సామాజిక బాధ్యత నిర్వర్తించా. సెన్సార్‌బోర్డు మెంబర్‌గా పని చేసిన సమయంలో తెలుగు యాక్టర్స్‌తో స్పై కెమెరాల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లా.


అదే నా ఆశయం..

 ప్లాస్టిక్‌ కవర్‌లను తయారు చేసే సంస్థలను నిషేధించాలని ఉద్యమం చేశా. సినిమాలకు సెన్సార్‌ చేయటం కంటే.. బూతు తీయకూడదు అని రూల్స్‌ పెడితే సరిపోతుంది కదా! ‘ఏ’ సర్టిఫికేట్‌ తీసేయమని కేంద్రానికి సూచించా. యూట్యూబ్‌పై ఎలాంటి నియంత్రణ లేకపోవటం బాధాకరం. ప్రతి ఎఫ్‌బీ అకౌంట్‌కు ఆధార్‌ కార్డు ఉండాలి. అప్పుడు ఫేక్‌ అకౌంట్స్‌ ఉండవు. గన్‌కి రూల్స్‌ రెగ్యులేషన్‌లాగానే స్పై కెమెరా కొనాలంటే అలాంటి రూల్స్‌ ఉండాలి. ఎవరైనా ఒక అమ్మాయికి సంబంధించిన  అభ్యంతకరమైన ఫొటో లేదా వీడియో షేర్‌ చేస్తే నిర్భయ కేసు నమోదు చేయాలి. ఈ విషయాలన్నీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లా. నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ అనేక రాష్ర్టాల్లో వ్యాపించి ఉంది. కేంద్రప్రభుత్వం తక్షణమే స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌, స్పెషల్‌ జ్యుడిషియల్‌ ట్రయల్‌ కోర్టు ఏర్పాటు చేయాలి. మహిళలపై వేధింపులు లేకుండా సరైన రక్షణా వ్యవస్థ ఉండాలి. డ్రగ్స్‌ లేని సమాజం ఉండాలన్నదే నా ఆశయం. ఎవరైనా వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేసినప్పుడు.. డ్రగ్స్‌ బారిన పడిన వాళ్లకు సలహాలు, సూచనలు కావాలంటే.. ‘హెవెన్‌ హోమ్స్‌ సొసైటీ’ ఆఫీస్‌ నంబర్‌ (9912196832)కు ఫోన్‌ చేయవచ్చు. 

రాళ్లపల్లి రాజావలి 


మాది ఖమ్మం జిల్లా. డిగ్రీ చదివా. కొత్తగూడెం, భద్రాచలం జిల్లాలో ‘ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ ట్రైనింగ్‌’ సెంటర్‌ నడిపా. టైలరింగ్‌, బ్యూటీపార్లర్‌, సాఫ్ట్‌వేర్‌, పెయింటింగ్‌.లో శిక్షణనిచ్చేదాన్ని. పదేళ్ల క్రితం హైదరాబాద్‌కి వచ్చాక ఉద్యోగాలు చేశా. ఎన్నో కష్టాలు చవిచూశా. ఈ ప్రయాణంలో సమాజం కోసం ఏదైనా చేయాలనుకున్నా. ముఖ్యంగా గృహమే కదా స్వర్గసీమ. ఇంటిని ఎలా చూస్తామో.. సమాజాన్ని కూడా అలా చూడాలనే ఆలోచనతోనే 2012లో ‘సెవెన్‌ హోమ్స్‌ సొసైటీ’ స్థాపించా. మా సంస్థ క్యాప్షన్‌ ‘సేవా బృందావనం’.

Updated Date - 2022-07-20T06:42:24+05:30 IST