ఆహార తెలంగాణ

ABN , First Publish Date - 2020-05-28T08:31:04+05:30 IST

తెలంగాణ ఓ ధాన్యాగారమైంది. మొత్తం దేశానికే అన్నపూర్ణగా అవతరించింది. దేశవ్యాప్తంగా సేకరించిన యాసంగి ధాన్యంలో 63శాతం మన రాష్ట్రం నుంచే వచ్చింది. ఈ మేరకు సాక్షాత్తు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ప్రకటించింది. దేశానికి కావాల్సిన ఆహారం అందించడంలో తెలంగాణ నంబర్‌ వన్‌

ఆహార తెలంగాణ

  • దేశ ఆహార అవసరాలు తీర్చడంలో రాష్ట్రం నంబర్‌ వన్‌
  • ఎఫ్‌సీఐ సేకరించింది 83 లక్షల టన్నులు
  • అందులో 52 లక్షలు తెలంగాణ నుంచే
  • యాసంగిలో 63 శాతం వాటా రాష్ట్రానిదే
  • మిగతా రాష్ట్రాల వాటా 37శాతమే: ఎఫ్‌సీఐ
  • దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగాం
  • రైతులను అభినందించిన సీఎం కేసీఆర్‌
  • రైతులకు గర్వకారణం: మంత్రి కేటీఆర్‌


హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఓ ధాన్యాగారమైంది. మొత్తం దేశానికే అన్నపూర్ణగా అవతరించింది. దేశవ్యాప్తంగా సేకరించిన యాసంగి ధాన్యంలో 63శాతం మన రాష్ట్రం నుంచే వచ్చింది. ఈ మేరకు సాక్షాత్తు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ప్రకటించింది. దేశానికి కావాల్సిన ఆహారం అందించడంలో తెలంగాణ నంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలిచిందని ఎఫ్‌సీఐ సీఎండీ డీవీ ప్రసాద్‌ ప్రకటించారు. దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణ అవతరించిందని అభినందించారు. 2020 యాసంగిలో ఎఫ్‌సీఐ సేకరించిన మొత్తం ధాన్యంలో 63 శాతం తెలంగాణ  నుంచి, మిగతా అన్ని రాష్ర్టాల నుంచి కలిపి 37 శాతం సేకరించినట్లు డీవీ ప్రసాద్‌  ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఎఫ్‌సీఐ ఈ యాసంగిలో ఇప్పటిదాకా 83.01 లక్షల టన్నులు సేకరించగా,  తెలంగాణ నుంచే 52.23 లక్షల టన్నులు సేకరించినట్లు పేర్కొన్నారు. ఈసారి ఎఫ్‌సీఐ 91.07 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, అందులో సగానికి పైగా ఇప్పటికే తెలంగాణ సమకూర్చిందని అభినందించారు. తెలంగాణలో ఈ యాసంగిలో ఎక్కువ వరి పంట పండినందున అది, దేశ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడనుందని ఎఫ్‌సీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. 

లాక్‌డౌన్‌లోనూ కొనుగోళ్లు

ధాన్యం కొనుగోళ్లు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన విధానాన్ని వివరిస్తూ సీఎంవో బుధవారం ప్రకటన విడుదలచేసింది. కోవిడ్‌- 19 లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైతులు పండించిన మొత్తం ధాన్యం  కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో గ్రామాల్లోనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. మొత్తం 6,386 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ఇప్పటి వరకు 55.52 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది.  రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సీఎం కేసీఆర్‌ సాగునీటి రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేసి, సాగునీరు అందించింది. చెరువులను పునరుద్థరించడం వల్ల నీటి నిల్వ, భూగర్భ జలమట్టం పెరిగింది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తోంది. ప్రాజెక్టులు, చెరువుల ద్వారా, బోర్ల ద్వారా నీరు వాడుకోవడం సాధ్యమైంది. గత యాసంగిలో రాష్ట్రంలో 17 లక్షల ఎకరాల్లో వరి సాగైతే ఈసారి 39.5 లక్షల ఎకరాల్లో సాగైంది. 

 రైతులకు సీఎం అభినందన

దేశానికే తిండి పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదగడం గర్వంగా ఉందని  సీఎం కేసీఆర్‌ అన్నారు. ఎఫ్‌సీఐ  ేసకరించిన ధాన్యంలో తెలంగాణ నుంచి ేసకరించిందే అత్యధిక భాగమని ఎఫ్‌సీఐ ప్రకటించిన నేపథ్యంలో రైతులకు కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో పెరిగిన సాగునీటి లభ్యతను, ఉచిత విద్యుత్తును సమర్థవంతంగా వినియోగించుకున్న తెలంగాణ రైతులు తమ వృత్తి నైపుణ్యంతో పంటలు పండించారని అభింనందించారు. యాసంగిలో ధాన్యం సేకరణలో తెలంగాణ అగ్రగామిగా నిలవడం రాష్ట్ర రైతులకు గర్వకారణమని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి  కేటీఆర్‌ అన్నారు.


చినజీయర్‌ను కలిసిన సీఎం 

శంషాబాద్‌ రూరల్‌, మే27: ప్రభుత్వం తలపెట్టిన కొండపోచమ్మ సాగర్‌ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి చినజీయర్‌ స్వామిని సీఎం కేసీఆర్‌ ఆహ్వానించారు. కొండపోచమ్మ ఆలయవద్ద, పంపు హౌజ్‌ వద్ద శుక్రవారం నిర్వహించే చండీ, సుదర్శన యాగ కార్యక్రమాలకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.  ఆహ్వాన పత్రికలను జీయర్‌ స్వామికి అందచేశారు. బుధవారం రాత్రి 8:29 నిమిషాలకు ఆశ్రమానికి విచ్చేసిన సీఎం దాదాపు 50 నిమిషాలపాటు అక్కడే గడిపారు.

Updated Date - 2020-05-28T08:31:04+05:30 IST