Abn logo
Apr 5 2021 @ 00:45AM

‘జనపదం థియేటర్‌ రిపర్టరి’: ఒక సాంస్కృతిక ఉద్యమం

నాటక కళ ఎంతో ప్రాచీనమైన ప్పటికీ ఎప్పటికప్పుడు పునరు జ్జీవనం పొందుతూ వున్నది. సమకాలీన సమాజం నాటకంలో ప్రతి బింబించినప్పుడే దాని ప్రయోజనం నెర వేరుతుంది. ఎప్పటికప్పుడు సమకాలీన తను, కాలానుగుణమైన ఆధునికత లేదా ఆధునికానంతరతలను జోడించాల్సి ఉంటుంది. ఇందుకు అంకిత భావంతో పని చేసే నాటక సంస్థతో పాటు సమాజాన్ని, మనుషులను నిత్యం అధ్యయనం చేస్తూ తన మేధో సృజన శక్తులను వినియోగించే దర్శకుడి అవసరం వున్నది. అలాంటి దర్శకుడు శ్రీనివాస్‌ దెంచనాల, సంస్థ జనపదం నాటక రిపర్టరి. సాహిత్య, నాటక, జానపద రంగాల అభివృద్ధి; ప్రజలను సామాజికంగా, సాంస్కృతికంగా, చారిత్రికంగా, రాజకీయంగా చైతన్యవంతులను చెయ్యడమే లక్ష్యంగా 1984లో శ్రీనివాస్‌ ఖమ్మం జిల్లా యిల్లందులో దీనిని స్థాపించాడు. అత్యాధునిక నాటక ప్రయోగశాల అయిన ఈ ‘జనపదం నాటక రిపర్టరి’ శ్రీనివాస్‌ దెంచనాల ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకుంది. గత నాలుగు దశాబ్దాల కళాతపస్సులో భాగంగా జనపదం నాటక రిపర్టరి 58 నాటకాలను, 1500 పైన ప్రదర్శనలు ఇచ్చింది. 3000 మందికి పైగా విభిన్నగ్రూపులకు, సమూహాలకు సాహిత్య, నాటక రంగాల్లో శిక్షణ ఇచ్చింది. అటు గిరీష్‌ కర్నాడ్‌, లోర్కా, బాదల్‌ సర్కార్‌, హబీబ్‌ తన్వీర్‌ మొదలైన వారి క్లాసికల్‌ నాటకాలను ప్రదర్శిస్తూనే ఇటు దళిత, బహుజన, ఆదివాసీ, స్త్రీ, భూమి మొదలైన సమస్యల మీద కూడా నాటకాలు తయారు చేసి ప్రదర్శిస్తున్నది. ఇక శిల్ప పరంగా శ్రినివాస్‌ దెంచనాల అటు అత్యాధునిక నాటక అంశాలను అన్నీ వాడుకుంటూనే స్థానిక జానపద, ఆదివాసీ, శాస్ర్తీయ అంశాలను కూడా వాడడం ద్వారా జాతీయ స్థాయిలో తనదైన ప్రత్యేక శైలిని సాధించాడు.

శ్రీనివాస్‌ దెంచనాల కొన్ని రోజులు నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరులో వుండి అక్కడి చుట్టుప్రక్కల గ్రామాల చిందు యక్షగాన కళాకారులను పోగుచేసి శిక్షణ శిబిరం నిర్వహించి 23 మార్చ్‌ నాడు ఒక మహాద్భుతమైన ‘చెంచు లక్ష్మి’ నాటకాన్ని ప్రదర్శించాడు. ఇదివరకు ఆయన పునరుద్ధరణ (rejuvenation) చేసినట్టే వాళ్ళ అడుగులను విస్తృత పరచడం, రాగతాళాలను సమన్వయ పరచడం, భాష - సంభాషణలను శుద్ధి చేయడం, అవసరమయిన చోట నటన దృశ్యాలను సృష్టించడం, నటీ నటుల నాట్య - నటనల రంగ కదలికలను మెరుగుపరచడం, రవీంద్రభారతి 40్ఠ40 అడుగుల నట స్థలానికి యక్షగానాన్ని స్థలాంతరం చెందించడం... మొదలైన సృజనాత్మక కర్మలు చేసి రవీంద్రభారతిలో అంగరంగ వైభవంగా ప్రదర్శించాడు. ఒక్క రవీంద్ర భారతి మైకులు మధ్యలో చేసిన కూని రాగాల హమ్మింగ్స్‌ మినహాయిస్తే- 200 మందిని దెంచనాల తన నాటక బృందంతో కలిపి ఒక మహేంద్రజాల లోకం లోకి తీసుకొనిపొయ్యాడు. సాధారణ వెలుగులో రెగ్యులర్‌గా ప్రదర్శించే చిందు యక్షగానాన్ని తన కాంతి పరికల్పన నైపుణ్యంతో పసుపు, నీలం, ఎరుపు, ఆకుపచ్చ, గాఢ పసుపు రంగులతో వారి పాత్రలకు, పాత్రల భిన్న వర్ణాల ముఖాలకు, వారి మహా వస్త్ర విన్యాసాలకు ఒక సరికొత్త దృశ్య వర్ణాన్ని సృష్టించి మనకు రససిద్ధి గావించాడు. పైకి నర్సింహస్వామి చెంచులక్ష్మిల ప్రేమ కథలో భాగమైనప్పటికీ దెంచనాల వ్యాఖ్యానంలో మనకు ఇది స్త్రీ పురుషుల సంఘర్షణలాగ, ఆదివాసీ ఆదివాసేతర సంఘర్షణ లాగా, ఆదివాసీ సాంస్కృతిక పోరాటం లాగా కూడా కనిపిస్తుంది.  


ఈ నాటకానుభవాన్ని దెంచనాల ఇలా పంచుకున్నారు: ‘‘ఈ కరోనా మరణ మాయా కాలంలో సుమారు 200కు పైగా ప్రేక్షకులు రవీంద్ర భారతికి రావడం గొప్ప ఘన విజయం. నాటకాల కవిత్వాల సృష్టితో జీవితాన్ని కొలుచుకునే వాడిని కనుక ఆస్తులు కూడపెట్టుకొనలేని అల్పసంతోషిని కనుక. ‘జనపదం’ ఇటు ఆధునిక నాటకాలను అటు జానపద, ఆదివాసీ నాటకాలనూ కూడా పునరుద్ధరించి ప్రదర్శిస్తున్నది. అందులో భాగంగా చిందు యక్షగానాలైన ఆది జాంబ పురాణం, ఆదిశక్తి, సారంగధర, చెంచులక్ష్మిలను పునరుద్ధరించి ప్రదర్శించింది. ‘చెంచు లక్ష్మి’ నాటకం స్త్రీ పురుష సంఘర్షణనే కాక, ఆదివాసీ ఆదివాసేతర సంఘర్షణను కూడా ప్రతిబింబిస్తుంది. కళాత్మకంగా దైవ మానవ సంఘర్షణను కూడా. నేను నిజామా బాద్‌ జిల్లా ఆర్మూరులో కొన్ని రోజులు ఉండి గురువు చిందుల శ్యామ్‌ గారితో కలిసి అటు జనపదం కళాకారులూ ఇటు యక్షగానం కళాకారులూ కలిసి దీనిని తయారు చేశాను. ఈ ప్రదర్శనకు సహాయం చేసిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌గారికీ, ఎంఎల్‌సి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికీ, డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ గారికీ మరియు సాహిత్య కళా ప్రియులు మన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్ర శేఖర్‌ రావు గారికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు.’’

చెర్విరాల భాగయ్య యక్షగాన సంపదలో భాగమైన ఈ నాటాకాన్ని గురువు చిందుల శ్యాం తన బృందంతో గ్రామాల్లో తమదైన పూర్వ రీతిలో ప్రదర్శనలు ఇస్తున్నారు. కరోనా కారణంగా చూడలేకపోయిన ప్రేక్షకుల కోసం, అంతరించి పోతున్న తెలంగాణ మహా సంస్కృతినీ చరిత్రనూ రక్షించుకోవడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం దెంచనాల కృషిని గుర్తించి ఈ యక్షగానాన్ని ఒక్క తెలం గాణలోనే కాక దేశమంతా ఆడిస్తుందని ఆశిస్తున్నాను.

చింతపట్ల సుదర్శన్‌

92998 09212

Advertisement
Advertisement
Advertisement