కరోనా కేసుల్లో రికార్డులు బద్దలు కొడుతున్న ఫ్లోరిడా

ABN , First Publish Date - 2020-07-14T02:42:41+05:30 IST

ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే.

కరోనా కేసుల్లో రికార్డులు బద్దలు కొడుతున్న ఫ్లోరిడా

ఆర్లాండో: ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. ఇప్పుడు అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం కరోనా కేసుల్లో మరో రికార్డ్ నెలకొల్పుతోంది. ఆదివారం ఫ్లోరిడాలో 15 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒకే రాష్ట్రం నుంచి ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. ఏప్రిల్ 10న న్యూయార్క్‌లో అత్యధికంగా 12,874 కేసులు నమోదయ్యాయి. అయితే ఆ రికార్డ్‌ను ఇప్పుడు ఫ్లోరిడా దాటేసింది. ఫ్లోరిడాలోని ఆర్లాండో నగరంలో ఉన్న వాల్ట్ డిస్నీ వరల్డ్‌ను తెరిచిన మరుసటి రోజే కేసుల్లో పెరుగుదల కనిపించడం విశేషం. ఫ్లోరిడాను కరోనా కేసుల్లో ప్రత్యేక దేశంగా చూస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజులో అత్యధికంగా నమోదైన కేసుల్లో నాలుగో దేశంగా నిలుస్తుందని రీయూటర్స్ అనాలసిస్ చెబుతోంది. మరోపక్క ఫ్లోరిడాలో కరోనా పరీక్షల సంఖ్య కూడా భారీగా ఉంటోంది. ఆదివారం దాదాపు లక్షా 43 వేల పరీక్షా ఫలితాలను అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. అమెరికాలో ఒకపక్క కేసులు భారీగా పెరుగుతోంటే.. అనేక రాష్ట్రాల్లో ఫేస్‌మాస్క్ తప్పనిసరిగా ధరించాలని చెప్పడంపై నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫ్లోరిడా, మిచిగాన్ రాష్ట్రాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. కాగా.. అమెరికాలో ఇప్పటివరకు 33 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరోపక్క కరోనా కారణంగా అమెరికాలో లక్షా 36 వేలకు పైగా మరణించారు. అమెరికాలో ఇప్పటికే అనేక రాష్ట్రాలు తిరిగి పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించేందుకు సిద్దమయ్యాయి.

Updated Date - 2020-07-14T02:42:41+05:30 IST