ఏపీ, తెలంగాణ ప్రాజెక్టులకు వరద ప్రవాహం

ABN , First Publish Date - 2020-09-21T17:02:19+05:30 IST

తెలుగు రాష్ట్రాలు, పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో..

ఏపీ, తెలంగాణ ప్రాజెక్టులకు వరద ప్రవాహం

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలు, పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి, పెన్నా, తుంగభద్ర నదులకు వరద ప్రవాహం పోటెత్తుతోంది. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టుల నుంచి భారీగా నీరు విడుదల చేయడంతో తెలంగాణలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు లక్షా 43వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. దీంతో ఎస్సారెస్సీ 25 గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 90 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో 85 టీఎంసీల నీరు నిలువ ఉంచుతూ.. మిగిలింది కాలువలతోపాటు ఎత్తిపోతల పథకాలకు వదులుతున్నారు.


తుంగభద్ర డ్యామ్‌కు మల్లీ వరద పెరిగింది. 1.50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందన్న అంచనాలతో డ్యామ్ 12 గేట్లను ఎత్తి 36,384 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తుంగభద్ర పూర్తి స్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా.. పూర్తి స్థాయి జలసిరిని సంతరించుకుంది. నీటి నిల్వ సామర్థ్యం 100.855 టీఎంసీలు కాగా ప్రస్తుతం 100.778 టీఎంసీల నీరు నిలవ ఉంది.


పెన్నానదిలో సోమిశిల జలాశయానికి 1.30 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. సోమశిల డ్యామ్ గరిష్ట నీటి మట్టం 330 అడుగులు కాగా ప్రస్తుతం 329 అడుగుల మేర నీరు చేరింది. గేట్లు ఎత్తివేయడంతో నెల్లూరు నగరంలోని లోతట్టు ప్రాంతాలు, జిల్లాల్లోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దీంతో అధికారులు లోతట్టుప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సోమిశిల బ్యాక్ వాటర్ జలాలు, కడప జిల్లాలోని గంగపేరూడు, తప్పెటవారిపల్లి తదితర గ్రామాలను చుట్టుముట్టాయి. బాధితులు మోకాలలోతు నీటిలోనే జీవనం సాగిస్తున్నారు.

Updated Date - 2020-09-21T17:02:19+05:30 IST