శ్రీశైలానికి వరద ఉధృతి

ABN , First Publish Date - 2020-10-18T10:18:05+05:30 IST

ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద, పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తోంది.

శ్రీశైలానికి వరద ఉధృతి

ప్రాజెక్టులోకి 5.98 లక్షల క్యూసెక్కుల నీరు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) : ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద, పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో నదిపై ఉన్న ప్రాజెక్టులకు భారీగా ప్రవాహం పోటెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 5.98లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో పది గేట్లు 25 అడుగుల మేర ఎత్తి 5.67లక్షల క్యూసెక్కులు.. కుడిగట్టు పవర్‌హౌస్‌ నుంచి 26,465 క్యూసెక్కులు.. మొత్తం 5.93 లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌లోకి వదులుతున్నారు. శ్రీశైలం నీటి మట్టం 884.30 అడుగులుగా ఉంది. ఇది 211.4759 టీఎంసీలకు సమానం. నాగార్జునసాగర్‌ జలాశయానికి శనివారం 5.51 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో 18 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి  5.02 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 589.30అడుగులుగా(309.9 టీఎంసీలు) ఉంది. సాగర్‌ నుంచి మొత్తం 5.39 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు 4.90 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో 43 గేట్ల ద్వారా 4.65 లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేశారు. కృష్ణానదిపై ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు 1.69 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో నారాయణపూర్‌ జలాశయానికి 1.96 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. అక్కడి నుంచి జూరాలకు 2 లక్షల క్యూసెక్కులను విడుదల చేశారు.


సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175(45.77టీఎంసీలు) అడుగులు కాగా, ప్రస్తుతం 173.22 అడుగులకు చేరింది. ప్రాజెక్టుకు 5,62,321 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో 17 గేట్లను 4.5 మీటర్లు ఎత్తి అంతే నీటిని విడుదల చేస్తున్నారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టుకు 15,743 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. నాలుగు గేట్లు ఎత్తి 12,387క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులకుగాను ప్రస్తుతం 642.98 అడుగుల నీరు ఉంది. నిజామాబాద్‌ జిల్లా మెండోర మండలంలోని శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు 79వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 18 గేట్ల ద్వారా 75 వేల క్యూసెక్కుల వరదను వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగుల వద్ద నిలకడగా ఉంది.

Updated Date - 2020-10-18T10:18:05+05:30 IST