మత్స్య వికాసం

ABN , First Publish Date - 2021-06-13T04:59:19+05:30 IST

మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం చక్కని ఫలితాలనిస్తోంది. ప్రతీ సంవత్సరం ఆశించిన దిగుబడితో పాటు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు లాభాలను ఆర్జిస్తున్నారు.

మత్స్య వికాసం

చేపల పరిశ్రమకు మంచి రోజులు
రూ.కోట్లలో పెరుగుతున్న ఆదాయం
గతేడాది 152.73 లక్షల చేపపిల్లల పంపిణీ
558 చెరువుల్లో 6,012 టన్నుల దిగుబడి
మత్స్యకారులకు రూ.89.09 కోట్ల మేర లబ్ధి
ఈసారి 579 చెరువుల్లో 153.67 లక్షల చేపపిల్లల పంపిణీకి రంగం సిద్ధం


వరంగల్‌అర్బన్‌ అగ్రికల్చర్‌, జూన్‌ 12: మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం చక్కని ఫలితాలనిస్తోంది. ప్రతీ సంవత్సరం ఆశించిన దిగుబడితో పాటు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు లాభాలను ఆర్జిస్తున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో మత్స్యశాఖ పరిధిలోని చెరువులపై ఆధారపడిన మత్స్యకారులు రూ.కోట్లల్లో వ్యాపారం చేస్తున్నారు. దిగుబడైన ఉత్పత్తులను సరిగా మార్కెటింగ్‌ చేసుకోగలిగితే మరిన్ని లాభాలు వస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లోని గ్రామ పంచాయతీల పరిఽధిలో గల చెరువులను మత్స్యశాఖ పరిధిలోకి తెస్తే దళారుల బెడదపోయి చేపల పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. చేపపిల్లల ఉత్పత్తిని కూడా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకే అప్పగించాలని వారు కోరుతున్నారు.

రూ.కోట్లలో ఆదాయం

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో మత్స్యశాఖ పరిధిలో 102 చెరువులతో పాటు గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువులను కలిపి మొత్తం 558 చెరువులను మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల వారికి లీజుతో పాటు, చేపపిల్లల్ని ఉచితంగా పంపిణీ చేస్తుంటారు. 2020-21 సంవత్సరంలో 558 చెరువుల్లో 152.73 లక్షల చేపపిల్లలను పంపిణీ చేయగా, 6,012 టన్నుల దిగుబడి వచ్చింది. మత్స్యకారులకు రూ.89.09 కోట్లు ఆదాయం వచ్చింది. 2021-22 సంవత్సరంలో 579 చెరువుల్లో 153.67 లక్షల చేప పిల్లలు పంపిణీ చేసేందుకు మత్స్యశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అనుకున్నట్లుగా చేపపిల్లల పంపిణీ జరిగితే గతేడాది కన్నా ఈసారి సుమారు రూ.100కోట్లు ఆదాయం సమకూరుతుందని మత్స్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

గ్రామాలలో దళారుల బెడద
చేపపిల్లల ఉచిత పంపిణీ పథకం ప్రారంభం నుంచి గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువుల్లో కూడా మత్స్యశాఖ ఉచితంగా చేపపిల్లల్ని పంపిణీ చేసింది. కానీ ఆచెరువుల నుంచి లీజు సొమ్మును వసూలు చేసుకునే అధికారం గ్రామపంచాయతీలకే ఉండడంతో గ్రామంలో పలు సమస్యలు తలెత్తుతున్నాయి. చేపలు పట్టాలన్నా, అమ్ముకోవాలన్నా అంతావారు చెప్పినట్టే చేయాలనే ఆంక్షలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మత్స్యకారులు వాపోతున్నారు. గ్రామపంచాయతీ పరిఽధిలోని చెరువులపై ఆయా గ్రామ ప్రజాప్రతినిధులు, దళారుల ఒత్తిడితో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు మత్స్యకారులు చెబుతున్నారు. గ్రామాల్లోని చెరువులను కూడా మత్స్యశాఖ పరిధిలోకి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.

మత్స్యకారుల అభివృద్ధికి కృషి
- విజయభారతి, జిల్లా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి

జిల్లాలో మత్స్యకారుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నాం. గత సంవత్సరం పకడ్బందీగా చేపపిల్లల్ని పంపిణీ చేశాం. మత్స్యకారులకు అన్ని సూచనలు చేశాం. దీంతో వారు మంచి లాభాలు ఆర్జించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగించుకుంటే సంతోషకరమైన జీవితాలు గడుపుతారనే భరోసా కల్పిస్తున్నాం. ముందస్తుగా చేపపిల్లలను చెరువుల్లో వేసుకోవద్దు. మత్స్యకారులు దళారులతో చేతులు కలిపి చెరువులను వారికి అప్పగించినట్లు  ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవు. ఈ సంవత్సరం చేప పిల్లల పంపిణీ కోసం టెండర్ల ప్రక్రియ ఇంకా పూర్తికావాల్సి ఉంది.

కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే ఉచిత పథకం
- బుస్స మల్లేశం, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు

చేపపిల్లల ఉచిత పంపిణీ పథకం కాంట్రాక్టర్ల జేబులు నింపే పథకంగా మారింది. ప్రభుత్వం పంపిణీ చేసే చేపపిల్లలను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించకుండా చేపల ఉత్పత్తి కేంద్రాలను నిర్వహించే బాధ్యతలను మత్స్యపారిశ్రామిక సంఘాలకే అప్పగిస్తే బాగుంటుంది. ప్రభుత్వం చేపపిల్లల పెంపకాలపై మత్స్యకారులకు ప్రత్యేక శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమారం చేపల ఉత్తత్తి కేంద్రంలో నామమాత్రంగా కొన్ని వందల చేపపిల్లల్ని పెంచుతున్నట్లు చూపించి ఆంధ్రా ప్రాంతంలో 35 ఎంఎం నుంచి 40ఎంఎం సైజు చేపపిల్లలను ఒకటి 25పైసలు, అంగుళం పొడవున్న చేపపిల్లను 50పైసలకు చొప్పున లక్షల చేప పిల్లల్ని దిగుమతి చేసుకుని పంపిణీ చేస్తున్నారు.

Updated Date - 2021-06-13T04:59:19+05:30 IST