తెగించి కాపాడారు

ABN , First Publish Date - 2020-08-10T09:22:44+05:30 IST

విజయవాడ స్వర్ణప్యాలెస్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ కంట్రోల్‌ రూమ్‌కు ఆదివారం తెల్లవారుజామున 5.08 గంటలకు ఫోన్‌కాల్‌

తెగించి కాపాడారు

  • కరోనా బాధితులని తెలిసినా వెనక్కి తగ్గలేదు
  • తొలుత భయపడినా ప్రాణరక్షణలో ముందుకే
  • అగ్నిమాపక సిబ్బంది గుండెధైర్యం


విజయవాడ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): విజయవాడ స్వర్ణప్యాలెస్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ కంట్రోల్‌ రూమ్‌కు ఆదివారం తెల్లవారుజామున 5.08 గంటలకు ఫోన్‌కాల్‌ వెళ్లింది. హోటల్‌ అనేసరికి పెద్ద ప్రమాదమేననుకున్నారు సిబ్బంది. విజయవాడకు చుట్టుపక్కల ఉన్న అన్ని ఫైర్‌ స్టేషన్లను అప్రమత్తం చేశారు. హుటాహుటిన వచ్చాక ఇది మామూలు ప్రమాదమేనని భావించారు. నిచ్చెనల సహాయంతో మొదటి అంతస్తుకు చేరుకున్నారు. కిటికీ అద్దాలను పగలగొట్టి చూడగానే కంగారుపడ్డారు. ఇది కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ అని అర్థమై మొదట భయపడ్డారు. కరోనాతో మరణించిన వారికి దహన సంస్కారాలు నిర్వహించడానికి ఇబ్బందులు ఎదురవుతుండడం, కరోనా నిర్ధారణ జరిగిన కుటుంబాలపై ఒక రకమైన వివక్ష ఉన్న సంగతి తెలిసిందే. ఇది గుర్తుకొచ్చి అగ్నిమాపక సిబ్బంది కూడా తొలుత భయపడినా తర్వాత మాత్రం ధైర్యంతో ముందుకు సాగారు. రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించడానికి విజయవాడ, అజిత్‌సింగ్‌ నగర్‌, కొత్తపేట, ఆటోనగర్‌, ఉయ్యూరు ఫైర్‌ స్టేషన్ల నుంచి ఆరు అగ్నిమాపక వాహనాలను రప్పించారు. మొత్తం 43 మంది సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. మొదట మంటలార్పి.. పొగను నియంత్రించిన తర్వాత కిటికీ అద్దాలను పగలగొట్టి గదుల్లోకి ప్రవేశించారు. ప్రాణాలతో ఉన్న వారిని రోప్‌ల సహాయంతో కిందికి తీసుకొచ్చారు. వారిని అంబులెన్స్‌ల్లో రమేశ్‌ ఆస్పత్రికి, ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక శాఖ సంచాలకుడు జయరామ్‌ నాయక్‌ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని, అగ్నిమాపక సిబ్బందిని ఆయన సమన్వయం చేసుకుంటూ.. ఒక్కో బృందానికి ఒక్కో ప్రణాళిక ఇచ్చి ఆపరేషన్‌ కొనసాగించారు. ప్రాణాలు కోల్పోయిన వారిని ముందుగానే గుర్తించారు. ప్రాణాలతో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. వారిని కిందకు తీసుకొచ్చి ఆస్పత్రులకు తరలించడం పూర్తికాగానే మృతదేహాలను మార్చురీలకు తరలించే ప్రక్రియను చేపట్టారు. మొదటి, రెండు అంతస్తుల్లో ఉన్న ఏడు మృతదేహాలను ఒక్కొక్కటిగా బయటకు తీసుకొచ్చారు.


సర్వత్రా ప్రశంసలు..

సహాయ ఆపరేషన్‌ చేపట్టిన అగ్నిమాపక సిబ్బందిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రాణాలతో బయటపడిన జగ్గయ్యపేటకు చెందిన పవన్‌సాయికృష్ణ ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వల్లే ప్రాణాలతో బయటపడ్డానని, 307 రూమ్‌లో ఉన్న తనను కాపాడిన వారికి పాదాభివందనం చేస్తానని పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అగ్నిమాపక శాఖ డీజీ హసన్‌రెజా సిబ్బందిని అభినందించారు. కాగా.. ఆపరేషన్‌లో పాల్గొన్న 43 మంది అగ్నిమాపక సిబ్బంది.. కరోనా రోగులను చేతులతో ఎత్తుకుని కిందికి దించారు. మృతదేహాలను వారే కిందికి తీసుకొచ్చారు. దీంతో ఆపరేషన్‌లో పాల్గొన్న వారందరినీ సోమవారం నుంచి క్యారంటైన్‌ పంపాలని అగ్నిమాపక అధికారులు నిర్ణయించారు. వారందరికీ కరోనా పరీక్షలు చేయించడానికి సిద్ధమవుతున్నారు. విజయవాడ ఆటోనగర్‌లో ఒక భవనాన్ని వీరి కోసం క్వారంటైన్‌ కేంద్రంగా తీసుకున్నారు. అవకాశం ఉన్న వాళ్లు హోం క్వారంటైన్‌లో ఉండాలని, వీలుకాని వారు ఆటోనగర్‌ క్వారంటైన్‌ కరేంద్రంలో చేరాలని ఆదేశిచారు. వారం తర్వాత వారికి కరోనా పరీక్షలు ఇక్కడే చేయిస్తారు.

Updated Date - 2020-08-10T09:22:44+05:30 IST