బాణసంచా కర్మాగారంలో పేలుడు

ABN , First Publish Date - 2022-01-06T14:04:44+05:30 IST

విరుదునగర్‌ జిల్లా సాత్తూరు వద్ద మంజల్‌ ఓడైపట్టి గ్రామంలోని బాణాసంచా తయారీ కర్మాగారంలో బుధవారం ఉదయం సంభ వించిన పేలుడులో నలుగురు కార్మికులు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

బాణసంచా కర్మాగారంలో పేలుడు

- నలుగురు కార్మికుల దుర్మరణం 

- విరుదునగర్‌ జిల్లాలో మరో దుర్ఘటన


చెన్నై: విరుదునగర్‌ జిల్లా సాత్తూరు వద్ద మంజల్‌ ఓడైపట్టి గ్రామంలోని బాణాసంచా తయారీ కర్మాగారంలో బుధవారం ఉదయం సంభ వించిన పేలుడులో నలుగురు కార్మికులు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా... విజయ కరిసల్‌ ప్రాంతానికి చెందిన కరుప్పసామి నడుపుతున్న ఆ కర్మాగారంలోని ఆరుగదుల్లో బాణసంచా తయారు చేస్తున్నారు. పరిసర గ్రామాలకు చెందిన కార్మికులు ప్రతిరోజూ ఆ కర్మాగారానికి వచ్చి పనిచేస్తుంటారు. ఆ మేరకు బుధవారం ఉదయం 15 మంది కార్మికులు ఆ కర్మాగారంలో బాణసంచా తయారీలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో ఓ గదిలో కర్మాగారం యజమాని కరుప్పసామి, కార్మికుడు సెంథిల్‌ (33) బాణసంచా తయారీకి సంబంధించి రసాయనిక పదార్థాలను కలిపే పనులు చేపట్టారు. రసాయనిక పదార్థాల నుండి హఠాత్తుగా దట్టమైన పొగలతో మంటలు చెలరేగి పక్కనే ఉన్న టపాకాయల నిల్వలపై పడ్దాయి. దీంతో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించగా, ఆ గది పూర్తిగా నేలమట్టమైంది. మంటలు నలువైపులా వ్యాపించాయి. ఆ శిథిలాల మధ్య పలువురు కార్మికులు చిక్కుకున్నారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న శివకాశి, వెంబకోటై, సాత్తూరు నుంచి అగ్నిమాపక దళం ఫైరింజన్లతో హుటాహుటిన అక్కడికి చేరుకుని గంట సేపు పోరాడి మంటలను ఆర్పివేశారు. ఆ తర్వాత శిథిలాల మధ్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఏడుగురు కార్మికులను వెలికి తీశారు. వీరిని చికిత్స నిమిత్తం సాత్తూరు, కోవిల్‌పట్టి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. చికిత్సపొందుతున్నవారిలో బాణాసంచా కర్మాగారం యజమాని కరుప్పసామి (40), కొమంగిపురానికి చెందిన కాశి (40), సాత్తూరు కామాక్షి పురానికి చెందిన సెంథిల్‌ (33) అనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మధ్యాహ్నానికి కొమ్మంగిపురం జగన్నాధన్‌ భార్య అయ్యమ్మాళ్‌ (47) చికిత్స ఫలించక మృతి చెందారు. తక్కిన ముగ్గురు కార్మికులకు వైద్యులు చికిత్సలందిస్తున్నారు. ఏళాయిరంపన్నై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.


మృతులకు స్టాలిన్‌ సాయం...

బాణసంచా కర్మాగారంలో సంభవించిన పేలుడులో మృతి చెందిన నలుగురు కార్మికుల కుటుంబాలకు తలా రూ.3 లక్షల ఆర్థికసాయం అందజేస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురికి తలా రూ.లక్ష చొప్పున సాయం చేయనున్నట్లు పేర్కొన్నారు. దుర్ఘటన పట్ల సీఎం దిగ్ర్భాంతి వ్యక్తం చేసి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Updated Date - 2022-01-06T14:04:44+05:30 IST