‘మన ఊరు-మన బడి’లో భాగస్వాములు కండి.. ! ఎన్‌ఆర్‌ఐలకు మంత్రి కేటీఆర్‌ పిలుపు

ABN , First Publish Date - 2022-02-13T20:52:27+05:30 IST

రాష్ట్రప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ‘మన ఊరు-మన బడి’లో భాగస్వాములు కావాలని ఎన్‌ఆర్‌ఐలకు మంత్రి కె. కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం కింద రూ.7289 కోట్లతో దాదాపు 26 వేల ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నట్లు ...

‘మన ఊరు-మన బడి’లో భాగస్వాములు కండి.. ! ఎన్‌ఆర్‌ఐలకు మంత్రి కేటీఆర్‌ పిలుపు

విరాళాల సేకరణకు వెబ్‌సైట్‌

సర్కార్‌ స్కూళ్లను ‘కార్పొరేట్‌’లా తీర్చిదిద్దండి: హరీశ్‌ రావు, సబిత 


హైదరాబాద్‌/రంగారెడ్డి అర్బన్‌, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ‘మన ఊరు-మన బడి’లో భాగస్వాములు కావాలని ఎన్‌ఆర్‌ఐలకు మంత్రి కె. కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం కింద రూ.7289 కోట్లతో దాదాపు 26 వేల ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంపై ఎన్‌ఆర్‌ఐలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్‌ శనివారం వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. తెలంగాణలో నూతన విద్యాసంస్థల ఏర్పాటుతో పాటు ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని కేటీఆర్‌ అన్నారు. దీనిని ఒక ప్రభుత్వ కార్యక్రమంలాగా కాకుండా.. ప్రజలను భాగస్వాములను చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్‌ఆర్‌ఐల భాగస్వామ్యాన్ని కోరుతున్నామని, అందరూ ముందుకురావాలని కోరారు. ఒక ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు రూ.కోటి, అంతకుమించి ఆర్థిక సహాయం చేస్తే.. దాతలు సూచించిన పేరును ఆ పాఠశాలకు పెడుతామని  తెలిపారు. రూ.10 లక్షలకు పైగా సహాయం అందిస్తే ఒక తరగతి గదికి వారి పేరును పెడుతామని చెప్పారు.


ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు ముందుకురావాలని, త్వరలోనే ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించి విరాళాలను స్వీకరిస్తామని ఆయన తెలిపారు. పాఠశాలల అభివృద్ధికి ముందుకువచ్చిన ఎన్‌ఆర్‌ఐలకు విద్యాశాఖ సంపూర్ణ సహకారం అందిస్తుందని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు సందీ్‌పకుమార్‌ సుల్తానియా, దేవసేన, టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల, ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధి అనిల్‌ కూర్మాచలంతో పాటు వందలాది మంది ఎన్‌ఆర్‌ఐలు పాల్గొన్నారు. కాగా, ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దేలా కృషి చేయాలని మంత్రులు హరీశ్‌రావు, సబిత అధికారులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను క్షేత్రస్థాయిలో సందర్శించి.. సౌకర్యాల ఏర్పాటును గుర్తించాలని కలెక్టర్లకు వారు నిర్దేశించారు. శనివారం రంగారెడ్డి కలెక్టరేట్‌ నుంచి జిల్లా కలెక్టర్లు, జిల్లాపరిషత్‌ చైర్మన్లు, విద్యాశాఖ అధికారులతో మంత్రులు వీడియా కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అవసరమైన చోట అదనపు తరగతి గదుల నిర్మాణాలతో పాటు మౌలిక వసతులను కల్పించాలని అధికారులకు సూచించారు.

Updated Date - 2022-02-13T20:52:27+05:30 IST