పేదలకు నగదు పంపిణీ

ABN , First Publish Date - 2020-04-11T06:11:58+05:30 IST

పేద కుటుంబంగా గుర్తించిన ప్రతి కుటుంబపు బ్యాంకు ఖాతాలో మూడు రోజులలోగా మొదటి విడతగా రూ.5000 జమ చేయనున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 14న జాతీయ టెలివిజన్‌లో ప్రకటించాలి. అర్హమైన కుటుంబానికి బ్యాంకు ఖాతా లేనిపక్షంలో...

పేదలకు నగదు పంపిణీ

పేద కుటుంబంగా గుర్తించిన ప్రతి కుటుంబపు బ్యాంకు ఖాతాలో మూడు రోజులలోగా మొదటి విడతగా రూ.5000 జమ చేయనున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 14న జాతీయ టెలివిజన్‌లో ప్రకటించాలి. అర్హమైన కుటుంబానికి బ్యాంకు ఖాతా లేనిపక్షంలో ఆ సొమ్మును వారి నివాసానికి తీసుకువెళ్ళి అందజేయాలి. ఈ ఆర్థిక వితరణకు అయ్యే మొత్తం గరిష్ఠంగా రూ.65,000 కోట్ల మేరకు వుంటుంది. పేదలకు ఈ సహాయం సంపూర్ణంగా భరింపదగినది, పరిపూర్ణంగా సాధ్యమైనది, ఆర్థికంగా వివేకవంతమైనది, సామాజికంగా అనివార్యమైనది.


ప్రప్రథమ కరోనా వైరస్ పాజిటివ్ కేసును 2019 డిసెంబర్ 30న చైనాలో గుర్తించారు. తొలుత వుహాన్ నగరంలోనూ, ఆ తరువాత హుబేయి రాష్ట్రంలోనూ ఆ వైరస్ వ్యాపించింది. దరిమిలా చైనాలోని ఇతర రాష్ట్రాలకు, ఇరుగు పొరుగు, సుదూర దేశాలకూ కరోనా విస్తరిల్లింది. ఈ సత్వర వ్యాప్తికి ప్రపంచం భీతిల్లిపోయింది. 2020 జనవరి ఆఖరు కల్లా 27 దేశాలు కొవిడ్ -19 తో బారిన పడ్డాయి. 


2020 ఫిబ్రవరి 12న రాహుల్ గాంధీ ఇలా ట్వీట్ చేశారు: ‘కరోనా వైరస్‌తో మన ప్రజలకు, మన ఆర్థిక వ్యవస్థకు ఒక మహోపద్రవం ముంచుకొస్తున్నది. మన ప్రభుత్వం ఈ ముప్పును తీవ్రంగా పరిగణించడం లేదని నేను అభిప్రాయపడుతున్నాను. ఈ మహమ్మారిని అరికట్టేందుకు సకాలంలో తగుచర్యలు చేపట్టడం చాలా ముఖ్యం’. ఫిబ్రవరి 12 నాటికి కేంద్ర ప్రభుత్వం రెండు చర్యలు మాత్రమే చేపట్టింది. అవి: నిర్దిష్ట దేశాలకు ప్రయాణించవద్దని 2020 జనవరి 17న దేశ ప్రజలకు సలహా ఇవ్వడం; కొన్ని దేశాల నుంచి వచ్చిన సందర్శకులకు జారీచేసిన ఈ- వీసాలను ఫిబ్రవరి 3న తాత్కాలికంగా నిలిపివేయడం. 

సరే, రాహుల్ ట్వీట్‌పై ఊహించినట్టుగానే సామాజిక మాధ్యమాలలో పోకిరీ వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. మచ్చుకు రెండు చూద్దాం. ఇకటి- ‘ఓ మేధావీ, తాజా వార్తలను చూశావా?’ అని ఒక సరల్ పటేల్ పరిహాసాస్పదంగా ప్రశ్నించారు; రెండు- ‘భగవంతుడా, నీకు అభిప్రాయాలు కూడా వున్నాయా? మహాశయా, జోక్ చేయడం ఆపివేసి, పోగోను వీక్షించడానికి తిరిగి వెళ్ళు’ అని పూజ అనే ఆమె స్పందించింది. మరి ఇప్పుడు ఈ సరల్ పటేల్, పూజలు ఎక్కడ దాక్కున్నారోనని నేను ఆశ్చర్యపోతున్నాను. మార్చి 3న రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో ఇలా డిమాండ్ చేశారు: ‘కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సమృద్ధ నిధులతో ఒక కార్యాచరణ పథకాన్ని రూపొందించాలి’.


మార్చి 14 నుంచి కేంద్ర ప్రభుత్వం కరోనా నిరోధక చర్యలు చేపట్టడం ప్రారంభించింది. నిర్దిష్ట దేశాల నుంచి వచ్చిన సందర్శకులను క్వారంటైన్ లో ఉంచింది; ఇరుగు పొరుగు దేశాలతో సరిహద్దులను మూసివేసింది; అంతర్జాతీయ విమానయాన సర్వీసులపై ఆంక్షలు విధించింది; దేశీయ విమానయాన సర్వీసులను నిషేధించింది; అంతిమంగా మార్చి 25 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను అమలుపరచడం ప్రారంభించింది. 

ఈ ఘటనలను సింహావలోకనం చేసుకుంటే రాహుల్ గాంధీ తన విధ్యుక్త ధర్మాన్ని సరిగా పాటించారని స్పష్ట మవుతుంది. కరోనా విషమ సంక్షోభం విషయమై ప్రభుత్వాన్ని హెచ్చరించిన వారిలో ఆయన ప్రథముడు. కొన్ని రాష్ట్రాలు (కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్ , తమిళనాడు) కేంద్ర ప్రభుత్వం కంటే ముందుగానే కరోనా వైరస్ కట్టడికి పూనుకున్నాయి. తమ రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలో లాక్‌డౌన్‌లు ప్రకటించాయి కరోనా వ్యాప్తికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం మార్చిలో కాకుండా ఫిబ్రవరిలోనే పటిష్ఠ చర్యలు చేపట్టివలసివుంటుందా అనే విషయమై చర్చ కొవిడ్-19 పై అంతిమ విజయం సాధించిన అనంతరం కూడా చాలా కాలం పాటు కొనసాగే అవకాశం ఎంతైనా వున్నది. కరోనా వైరస్ పై యుద్ధంలో దేశం సత్వర పురోగతి సాధించేందుకు, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు, జీవనాధారాలను సంరక్షించేందుకు, మాంద్యంలోకి జారపోతున్న ఆర్థిక వ్యవస్థను రక్షించి, పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సాహసోపేత చర్యలు తీసుకోవాలి. ఈ విషయమై ప్రభుత్వాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా నేనీ వ్యాసాన్ని రాశాను. 


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ క్రింది అంశాలపై సత్వరమే తగుచర్యలు చేపట్టాలి. అవి: (1) వైరస్ వ్యాప్తి నియంత్రణ, వ్యాధిగ్రస్తులకు వైద్య చికిత్స; (2) పేదలు, ఇతర దుర్భల వర్గాల వారికి జీవనాధారాల పరంగా మద్దతు నివ్వడం; (3) నిత్యావసర సరుకుల, సేవల నిర్వహణ; (4) మాంద్యంలోకి దిగజారిపోతున్న ఆర్థిక వ్యవస్థను కాపాడి, పునురుద్ధరించడం. 

మొదటి అంశం విషయంలో కేంద్ర ప్రభుత్వం తొలుత పలు తప్పులు చేసినప్పటికీ, ఆ తరువాత వాటిని సరిదిద్దుకున్నది. లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలుపరిచేలా రాష్ట్ర ప్రభుత్వాలను పలు విధాల పురిగొల్పుతోంది. వైద్య నిపుణులు, ప్రతిపక్ష నేతల నుంచి వచ్చిన ఒత్తిళ్ల ఫలితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు చర్యలు చేట్టింది. ఆరోగ్య భద్రతా సదుపాయాలను, వైద్య సామగ్రి, వైద్యులు, నర్సులకు అవసరమైన ఆరోగ్య పరిరక్షణ పరికరాల మరింతగా సమకూర్చుకోవల్సిన అవసరం ఎంతైనా వున్నది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు నాయకత్వ పాత్ర వహించాలి. రెండో అంశం విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫల మవడం అమిత వ్యాకులత కలిగిస్తోంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వా లకు ఆర్థిక మద్దతు నందించడం లేదు దేశ వనరులపైన మొదటి హక్కుల పేద ప్రజలదేనన్న వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. 


కేంద్ర ప్రభుత్వం మార్చి 25 వ తేదీన ప్రకటించిన ఆర్థిక కార్యాచరణ పథకం పిసినారితనానికి తార్కాణంగా ఉన్నది. పలు వర్గాల వారిని పూర్తిగా ఉపేక్షించారు. ప్రభుత్వం నుంచి తమకేమీ సహాయమందదన్న భావనతోనే వలస శ్రామికులు పట్టణాలు, నగరాలను వీడి స్వగ్రామాలకు అనేక ప్రయాసలతో తిరిగి వెళ్ళిపోయారు. వారు తమతో పాటు కరోనా వైరస్‌ను కూడా పల్లెలకు తీసుకువెళ్ళడం ఒక విషాదం. దీని పర్యవసానాలను మనం ఇంకా అవగతం చేసుకోవల్సి వున్నది. 

రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఎంతో కొంత నగదును సమకూరుస్తూనే వున్నాయి. అయినప్పటికీ వారి జీవనాధారాలకు అవసరమైన మద్దతు లభించడం లేదు. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని పేదలకు నగదు పంపిణీ చేయాలి. వారి చేతుల్లో విధిగా కొంత నగదు వుండేలా చర్యలు చేపట్టాలి. దేశంలోని 26 కోట్ల కుటుంబాలలో 50 శాతానికి ఈ నగదు సహాయాన్ని సమకూర్చాలి. ఇంచుమించు 13 కోట్ల కుటుంబాలకు నగదును పంపిణీ చేయవలసివుంటుంది. పట్టణ ప్రాంతాల పేదలకు సంబంధించి ఉజ్వల పథకం లబ్ధిదారుల జాబితాలతో ప్రారంభమవ్వాలిజ జన్‌ధన్ ఖాతాలను పరిశీలనలోకి తీసుకోవాలి జన్‌ఆరోగ్య ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరిన వారిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. దారిద్ర్య రేఖకు దిగువన (బిపిఎల్) కుటుంబాల జాబితాలో ఈ జాబితాలను సరిచూసుకుని, పేద కుటుంబాలకు సంబంధించిన తుది జాబితాను రూపొందించుకునేందుకు రాష్ట్రాలకు అధికారమివ్వాలి. గ్రామీణ పేదల విషయంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనదారుల పట్టీతో ప్రారంభమవ్వాలి. ఉజ్వల పథక లబ్ధిదారుల జాబితాలనూ పరిశీలనలోకి తీసుకోవాలి. బిపిఎల్ జాబితాలతో ఈ జాబితాలను సరిచూసుకుని తుది జాబితాలను సిద్ధం చేసుకునేందుకు రాష్ట్రాలకు అధికారమివ్వాలి. ఆదివాసీ ప్రాంతాలలోని అన్ని కుటుంబాలకు ఈ నగదు సహాయాన్ని అందించాలి. 


పద మూడు కోట్ల పేద కుటుంబాలకు సంబంధించి రాష్ట్రాల వారీగా జాబితాలను రూపొందించుకోవడం సాధ్యమేనని నేను భావిస్తున్నాను. లబ్ధిదారుల విషయంలో అవకతవకలు జరిగేందుకు అవకాశం లేకపోలేదు. అయితే కరోనా ప్రస్తుత జాతీయ ఆత్యయిక స్థితిలో ఆ లోపాలు, లొసుగులను ఉపేక్షించవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయంతో రాష్ట్ర ప్రపభుత్వాలు పేదకుటుంబాల జాబితాలను ఐదు రోజులలో రూపొందించుకోవచ్చు. 

పేద కుటుంబంగా గుర్తించిన ప్రతి కుటుంబపు బ్యాంకు ఖాతాలో మూడు రోజులలోగా మొదటి విడతగా రూ.5000 జమ చేయనున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 14న జాతీయ టెలివిజన్‌లో ప్రకటించాలి. అర్హమైన కుటుంబానికి బ్యాంకు ఖాతా లేనిపక్షంలో ఆ సొమ్మును వారి నివాసానికి తీసుకువెళ్ళి అందజేయాలి. ఈ ఆర్థిక వితరణకు అయ్యే మొత్తం గరిష్ఠంగా రూ.65,000 కోట్ల మేరకు వుంటుంది. పేదలకు ఈ సహాయం సంపూర్ణంగా భరింపదగినది, పరిపూర్ణంగా సాధ్యమైనది, ఆర్థికంగా వివేకవంతమైనది, సామాజికంగా అనివార్యమైనది. ఏప్రిల్ 14 అనంతరం లాక్‌డౌన్‌ను పొడిగించినప్పటికీ తమకు అందిన, అందే నగదు సహాయంతో పేదలు తమ కష్టనష్టాలను తట్టుకోగలరు. ఇక మూడు, నాలుగు అంశాలను చూద్దాం. నేను చెప్పేదేమంటే మొదట చేయవలసిన పనులను మొదటే చేద్దాం. చేయాలికూడా. జాతీయ వనరులపై మొదటి హక్కు పేద ప్రజలదేనని, పేదల సంక్షేమానికే వాటిని ఉపయోగించాలని మనం ఎన్ని మార్లు ఘోషించలేదూ? మరి వాటికి మనం కట్టుబడి వుండొద్దూ?





పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2020-04-11T06:11:58+05:30 IST