గడపే దాటని ‘తుది అంచనాలు’

ABN , First Publish Date - 2021-02-28T08:39:15+05:30 IST

పోలవరం ప్రాజెక్టు తుది అంచనా వ్యయం రూ. 55548.87 కోట్లకు కేంద్రం ఆమోదం తెలపలేదు. ముఖ్యమంత్రి ప్రకటించినట్టు.. తొలిదశలో 41.15 మీటర్ల కాంటూరులో నిర్వాసితులను తరలించేందుకు నిధులూ మంజూరు కాలేదు. ఇప్పటివరకూ పోలవరం

గడపే దాటని ‘తుది అంచనాలు’

షెకావత్‌ వద్దే ఇంకా పోలవరం ఫైలు

నిర్వాసితులకు పరిహారమూ చేరలేదు

పనుల నాణ్యతపై కేంద్రం అసంతృప్తి

డిజైన్లకు డీడీఆర్‌పీ ఆమోదం కష్టమే!

రేపు పోలవరంపై సీఎం జగన్‌ సమీక్ష


(అమరావతి, ఆంధ్రజ్యోతి)

పోలవరం ప్రాజెక్టు తుది అంచనా వ్యయం రూ. 55548.87 కోట్లకు కేంద్రం ఆమోదం తెలపలేదు. ముఖ్యమంత్రి ప్రకటించినట్టు.. తొలిదశలో 41.15 మీటర్ల కాంటూరులో నిర్వాసితులను తరలించేందుకు నిధులూ మంజూరు కాలేదు. ఇప్పటివరకూ పోలవరం ప్రాజెక్టు పనుల నాణ్యతపై ఎవరూ వేతెల్తి చూపలేదు. ఇటీవల కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్‌ ఏబీ పాండ్యా అధ్యక్షతన పోలవరంలో పర్యటించిన డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌ (డీడీఆర్‌పీ), ఆ ‘కొరతా’ తీర్చేసినట్టు సమాచారం. కాఫర్‌డ్యామ్‌కు వినియోగిస్తున్న మట్టి పనులు సహా హెడ్‌వర్క్స్‌ పనులపై డీడీఆర్‌పీ అసంతృప్తిని వ్యక్తంచేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. గేట్లకు మినహా కీలకమైన డిజైన్లకు ఈప్యానల్‌ ఆమోదం తెలిపే అవకాశంలేదని జల వనరుల నిపుణులు చెబుతున్నారు. పోలవరం తుది అంచనా వ్యయంపై స్పష్టతరాలేదు. అదేవిధంగా భూ నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం .. సహాయ పునరావాస కార్యక్రమాలను చేపట్టడంపై నిర్దేశించిన కాల వ్యవధి కూడా మరో 35 రోజుల్లో పూర్తవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సోమవారం ఉదయం 11 గంటలకు పోలవరం ప్రాజెక్టుపై నిర్వహించే సమీక్షా సమావేశంపై ఆసక్తి నెలకొంది. 


అడిగేదెవరు.. చెప్పేదెవరు..?

పోలవరం సాగు నీటి ప్రాజెక్టు తుది అంచనా వ్యయం రూ.55548.87 కోట్లకు  కేంద్ర కేబినెట్‌ ఆమోదం పొందాల్సి ఉందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింహ్‌ షెకావత్‌ లోక్‌సభ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రకటించారు. కానీ, ఇప్పటివరకు దీనికి సంబంధించిన ఫైలు సదరు మంత్రి శాఖ గడపేదాటలేదు. 2017-18నాటి అంచనాల మేరకు, తుది అంచనా వ్యయాన్ని రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని రాష్ట్రప్రభుత్వం మొత్తుకుంటున్నా, ప్రధాని మోదీకి సీఎం లేఖ రాసినా, రాష్ట్ర మంత్రులు స్వయంగా వెళ్లి మంత్రి షెకావత్‌ను కలిసినా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అత్యవసర సమావేశం కూడా ఆ మేరకు సూచించినా, పోలవరం అంచనాలు పెంచుతామంటూ కేంద్రం నుంచి సానుకూల ప్రకటన ఇప్పటిదాకా వెలువడలేదు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నుంచి కేంద్ర ఆర్థికశాఖ ఆమోదానికి కూడా పంపలేదు. 


ఆర్థిక శాఖ రూ.2013-14 అంచనాలమేరకు కేంద్ర కేబినెట్‌ తీర్మానించిన రూ.20,398.61 కోట్లకే కట్టుబడి ఉన్నట్లుగానే తేల్చి చెబుతోంది. ఇంకోవైపు.. అంచనా వ్యయం ఊసెత్తకుండా.. ప్రాజెక్టు 45.72 మీటర్ల ఎత్తున గరిష్ఠ నిల్వ సామర్థ్యం (194.60 టీఎంసీలు) మేరకు భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలను పూర్తిచేశాకే..కాఫర్‌ డ్యామ్‌లను మూసేందుకు ఆమోదం తెలుపుతామని పీపీఏ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ పోలవరం క్షేత్ర పర్యటనలోనే ప్రకటించారు. కానీ రాష్ట్రప్రభుత్వం పీపీఏ నిర్ణయంతో సంబంధం లేకుండా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమవుతోంది. దీంతో ప్రాజెక్టు భవితపై నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయి. మరోవైపు పోలవరం సాగునీటి ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌ పనులు చేస్తున్నామని భ్రమలు కల్పిస్తున్న సర్కారు...నిర్వాసితులను తరలించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధతను చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  


బిగింపులో మరిన్ని జాగ్రత్తలు

పోలవరం సాగునీటి ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌ నిర్మాణంలో పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని పీపీఏకు సూచనలు వెళ్తున్నాయి. ఈ ప్రాజెక్టు రేడియల్‌ గేట్లు 16 మీటర్ల వెడల్పుతోనూ, 21.5 మీటర్ల పొడవుతోనూ దేశంలోనే అతి పెద్దవైనందున బిగింపులో పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సి ఉందని పీపీఏకు పలువురు నిపుణులు లేఖ రాశారు. నిర్మాణంలో ఎదురవుతున్న లోపాలను కేంద్ర జలశక్తిమంత్రిత్వశాఖ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. రేడియల్‌ గేట్ల డిజైన్‌..మెటీరియల్‌ క్వాలిటీ, ఫ్యాబ్రికేషన్‌ విధానాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. అత్యంత కీలకమైన గేట్లకు సంబంధించి, శాండ్‌ బ్లాస్టింగ్‌ అంశంపై శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని పీపీఏను నిపుణులు ఆ లేఖలో కోరారు. రేడియల్‌ గేట్లకు శాండ్‌ బ్లాస్టింగ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా లేదన్న సందేహాలను  వ్యక్తంచేశారు. దీనివల్ల గేట్లు త్వరితగతిన పాడైపోతాయన్న ఆందోళన వెలిబుచ్చారు. రైల్‌ ట్రాక్‌, గాంట్రీ క్రేన్‌ బిగింపు కూడా అత్యంత కీలకమైనవని సూచించారు.

Updated Date - 2021-02-28T08:39:15+05:30 IST