రద్దా.. వాయిదానా?

ABN , First Publish Date - 2021-09-12T06:36:14+05:30 IST

టీమిండియా సహాయక సిబ్బందిలో నలుగురికి కరోనా సోకడం వల్ల కీలక పరిణామాలే చోటు చేసుకున్నాయి.

రద్దా.. వాయిదానా?

ఐదో టెస్టుపై ఇంకా రాని స్పష్టత

వచ్చే ఏడాది ఆడించేందుకు బీసీసీఐ చర్చలు


లండన్‌: టీమిండియా సహాయక సిబ్బందిలో నలుగురికి కరోనా సోకడం వల్ల కీలక పరిణామాలే చోటు చేసుకున్నాయి. కోచ్‌లు రవిశాస్త్రి, భరత్‌ అరుణ్‌, ఆర్‌.శ్రీధర్‌ ముందుగా కొవిడ్‌ బారిన పడగా.. ఆ తర్వాత జట్టుతో పాటే ఉన్న అసిస్టెంట్‌ ఫిజియో యోగేశ్‌ పర్మార్‌ కూడా పాజిటివ్‌గా తేలడంతో క్రికెటర్లు భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో శుక్రవారం నుంచి జరగాల్సిన ఐదో టెస్టును ఆడేందుకు మానసికంగా సిద్ధం లేమని బీసీసీఐ కార్యదర్శి జైషాకు స్పష్టం చేశారు. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు కూడా క్రికెటర్లతో జై షా మాట్లాడాడు. అయితే తమ కుటుంబ సభ్యుల భయాందోళనలు కూడా ఆటగాళ్లను వెనక్కితగ్గేలా చేశాయి. ఇదే విషయాన్ని బీసీసీఐ వెంటనే ఈసీబీకి తెలపడంతో మ్యాచ్‌ను అర్ధంతరంగా నిలిపేశారు. ఈ సిరీ్‌సలో భారత్‌ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. మరో రెండు రోజులు ఆలస్యంగా మ్యాచ్‌ను నిర్వహించాలనుకున్నా ఐపీఎల్‌-2 షెడ్యూల్‌కు ఇబ్బంది ఎదురవుతుంది. ముందుగా అనుకున్న ప్రకారం ఈనెల 15న ఆటగాళ్లంతా యూఏఈకి వెళ్లాల్సింది. పొరపాటున ఎవరికైనా కరోనా సోకితే పది రోజులపాటు ఇంగ్లండ్‌లోనే ఉండిపోవాల్సి వస్తుంది. 


ఈసీబీ గందరగోళం:

చివరిదైన ఐదో టెస్టు మ్యాచ్‌ పరిస్థితి ఏమిటనే విషయంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మ్యాచ్‌ సమయానికి కాస్త ముందు ఈసీబీ నుంచి వెలువడిన ప్రకటన కూడా గందరగోళానికి దారి తీసింది. ‘జట్టులో మరిన్ని కరోనా కేసులు బయటపడతాయనే భయంతో ఐదో టెస్టు ఆడేందుకు భారత్‌ సిద్ధంగా లేదు. కాబట్టి వారు మ్యాచ్‌ను కోల్పోయినట్టే’ అని ట్వీట్‌ చేసింది. అంటే సిరీస్‌ 2-2తో సమమైనట్టుగా భావించాల్సి ఉంటుంది. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే తమ వెబ్‌సైట్‌లో మ్యాచ్‌ను కోల్పోయిందనే పదాన్ని తొలగించి ఐదో టెస్టు రద్దయినట్టుగా సవరించింది. దీంతో సిరీ్‌సలో 2-1తో భారత్‌ ఆధిక్యంలో ఉన్నట్టయింది. అటు బీసీసీఐ కూడా మ్యాచ్‌ పరిస్థితిపై ట్వీట్‌ చేస్తూ.. భవిష్యత్‌లో ఈ మ్యాచ్‌ నిర్వహణపై ఈసీబీతో చర్చిస్తామని పేర్కొంది.


వచ్చే ఏడాది సాధ్యమేనా?

వన్డే సిరీస్‌ కోసం టీమిండియా వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో పర్యటించాల్సి ఉంది.  అదే సమయంలో ఈ ఐదో టెస్టును కూడా ఆడిద్దామని బీసీసీఐ ఆఫర్‌ చేసింది. అలాగే అదనంగా టీ20 మ్యాచ్‌ను కూడా ఆడిస్తే ఆదాయపరంగానూ కలిసివస్తుందని ప్రతిపాదించినట్టు సమాచారం. ‘బీసీసీఐ ఈ మ్యాచ్‌ను రీషెడ్యూల్‌ చేద్దామని చెప్పింది. అయితే అది ఈ సిరీ్‌సలో భాగంగా ఉంటుందా? లేక తాజా మ్యాచ్‌గా భావించాలా? లేక మరో సిరీ్‌సలో తొలి మ్యాచ్‌గా ఉంటుందా? అనేది నాకైతే తెలీదు. ఇక ఐదో టెస్టు ఫలితం గురించి మేం ఐసీసీని సంప్రదించనున్నాం’ అని ఈసీబీ సీఈవో టామ్‌ హారిసన్‌ తెలిపాడు.


నష్టం భారీగానే..

భారత్‌తో టెస్టు రద్దయినందుకు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు దాదాపు 15 మిలియన్‌ డాలర్లు (రూ.110 కోట్లు) నష్టపోనుంది. అంతేకాకుండా స్పాన్సర్‌షిప్‌, గేట్‌ రెవిన్యూ ద్వారా మరో 3 మిలియన్‌ డాలర్లు (రూ.22 కోట్లు) కోల్పోనుంది. ఇప్పటికే నాలుగు రోజుల టిక్కెట్లు పూర్తిగా అమ్ముడుపోయాయి. ఇప్పుడు ఆ సొమ్మును ప్రేక్షకులకు తిరిగివ్వనున్నారు.

Updated Date - 2021-09-12T06:36:14+05:30 IST