ఫెడరర్‌ @రూ. 803 కోట్లు

ABN , First Publish Date - 2020-05-30T09:05:50+05:30 IST

స్విస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ ఫోర్బ్స్‌ జాబితాలో అగ్రస్థానం దక్కిం చుకున్నాడు. ఈ ఏడాది అత్యధిక సంపాదన కలిగిన టాప్‌-100 ప్లేయర్ల జాబితాను

ఫెడరర్‌ @రూ. 803 కోట్లు

ఫోర్బ్స్‌-2020 జాబితాలో స్విస్‌ టెన్నిస్‌ స్టార్‌కు అగ్రస్థానం

రూ. 196 కోట్లతో 66వ స్థానంలో విరాట్‌ కోహ్లీ

న్యూయార్క్‌: స్విస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ ఫోర్బ్స్‌ జాబితాలో అగ్రస్థానం దక్కిం చుకున్నాడు. ఈ ఏడాది అత్యధిక సంపాదన కలిగిన టాప్‌-100 ప్లేయర్ల జాబితాను ఫోర్బ్స్‌ శుక్రవారం ప్రకటించింది. ఇందులో ఫెడరర్‌ రూ 803.48 కోట్ల సంపాదన (106.3 మిలియన్ల యూఎస్‌ డాలర్లు)తో టాప్‌లో నిలిచాడు. గత 12నెలల కాలంలో ఆటగాళ్లు ఆర్జించిన మొత్తాన్ని లెక్కించి ఈ జాబితాను రూపొందించారు. ఫెడరర్‌ ఆర్జించిన ఈ మొత్తంలో రూ. 755 కోట్లు ఎండార్స్‌మెంట్ల ద్వారానే రావడం విశేషం. అత్యధిక సంపా దనలో ఓ టెన్నిస్‌ ప్లేయర్‌ అగ్రస్థానంలో నిలవడం ఇదే తొలిసారి. ఇక.. కరోనా కారణంగా వేతనాల్లో కోత పడడంతో సాకర్‌ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో రూ. 800 కోట్లు (105 మిలియన్‌ డాలర్లు), లియోనెల్‌ మెస్సీ రూ. 790 కోట్లు (104 మిలియన్‌ డాలర్లు) వరుసగా రెండు, మూడు స్థానాలకు పడిపోయారు. బ్రెజిల్‌ సాకర్‌ హీరో నేమార్‌ రూ. 722 కోట్లు (95.5 మిలియన్‌ డాలర్లు), ఎన్‌బీఏ స్టార్‌ లెబ్రాన్‌ జేమ్స్‌ రూ. 666 కోట్లు (88.2 మిలియన్‌ డాలర్లు) నాలుగు, ఐదు స్థానాలతో టాప్‌ ఫైవ్‌లో నిలిచారు. ఈ జాబితాలో ఇద్దరు మహిళలకు మాత్రమే చోటు దక్కింది. ఆ ఇద్దరు కూడా టెన్నిస్‌ స్టార్లు నవోమి ఒసాక (జపాన్‌), వెటరన్‌ ఏస్‌ సెరెనా విలియమ్స్‌. ఓవరాల్‌గా ఒసాక రూ. 282 కోట్ల (37.4 మిలియన్‌ డాలర్లు)తో 29వ స్థానంలో నిలవగా, సెరెనా విలియమ్స్‌ రూ. 272 కోట్ల (36 మిలియన్‌ డాలర్లు)తో 33వ స్థానాన్ని దక్కించుకుంది. ఇక.. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రూ. 196 కోట్లతో 66వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న ఏకైక క్రికెటర్‌ కోహ్లీనే కావడం విశేషం. నిరుడు విరాట్‌కు 100వ స్థానం దక్కింది.

Updated Date - 2020-05-30T09:05:50+05:30 IST