Independence day: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు.. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు!

ABN , First Publish Date - 2022-08-14T01:10:10+05:30 IST

భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని అమెరికాలోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్.. భారీ ఎత్తున స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిపించేందుకు ఏర్పాట్లు చేసింది.

Independence day: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు.. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు!

భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని అమెరికాలోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్(Federation of Indian associations).. భారీ ఎత్తున స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిపించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆగస్టు 15న న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద జాతీయ జెండాను ఎగరేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రవాసీ భారతీయులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. అంతేకాకుండా.. హడ్సన్ నదిపై విమానం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ఖాదీ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తారు. అదే రోజున.. మువ్వన్నెల జెండాను గుర్తుకు తెచ్చేలా ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ త్రివర్ణ కాంతుల్లో మెరిసిపోయేలా ప్రత్యేక లైట్ షో ఏర్పాటు చేశారు. టైమ్స్ స్క్వేర్ వద్ద ఇండియా డే పరేడ్-2022 బిల్‌బోర్డును కూడా ప్రదర్శించనున్నారు. ఆ రోజంతా పలు సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. 


ఆగస్టు 21న రెండు గిన్నిస్ రికార్డులు నెలకొల్పేందుకు కూడా నిర్వాహకులు సమాయత్తమవుతున్నారు. అత్యధిక సంఖ్యలో జెండాలు, ఢమరుకాల ఏర్పాటుతో గిన్నిస్ ప్రపంచ రికార్డు కోసం ప్రయత్నించనున్నారు. ఇక అదే రోజున.. మాడిసన్ ఎవెన్యూ వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ‘ఇండియా డే పరేడ్’ నిర్వహించేందుకు భారతీయ సంఘాల ఫెడరేషన్..అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గ్రాడ్ మార్షల్‌గా వ్యవహరించనున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరిట జరిగే ఈ వేడుకలకు ఆంటిగ్వా అండ్ బార్బుడా ప్రధాని హెచ్.ఈ గ్రేటన్ బ్రౌన్ ముుఖ్య అతిథిగా హాజరుకానున్నారు. న్యూయార్క్ గవర్నర్ కేతీ హొచల్, భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి రాజాచారి, ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ గౌరవ అతిథులుగా, మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధూ ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారు.  ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు ప్రవాసీయులను కోరారు. 












Updated Date - 2022-08-14T01:10:10+05:30 IST