లక్షణాలున్నా.. నెగెటివ్‌

ABN , First Publish Date - 2021-05-06T08:06:58+05:30 IST

లక్షణాలున్నా.. నెగెటివ్‌

లక్షణాలున్నా.. నెగెటివ్‌

  • ఆర్టీ-పీసీఆర్‌ తప్పుడు నివేదికలతో ప్రజలు, వైద్యుల్లో ఆందోళన
  • కొత్త మ్యుటేషన్లతో పరీక్షలకు చిక్కని వైరస్‌
  • వైరస్‌ వృద్ధి చెందకముందే టెస్టు చేయించుకోవడమూ ఒక కారణమే
  • టెస్టింగ్‌ కేంద్రాల్లో ప్రమాణాలపై పర్యవేక్షణేదీ?


భారత్‌లో కరోనా కేసులు భయంకరంగా పెరిగిపోతున్నాయి. సెకండ్‌ వేవ్‌ ధాటికి ప్రజలు గజగజా వణికిపోతున్నారు. అయితే చాలామందికి కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ ఆర్టీ-పీసీఆర్‌ టెస్టుల్లో ‘నెగెటివ్‌’ వస్తోంది. ఇంతకుముందు ఇలా తప్పుగా రావడం అరుదుగా జరిగేది. కానీ ఇప్పుడు ఇలాంటి రిపోర్టుల సంఖ్య పెరిగింది. దీంతో ఇటు ప్రజలు, అటు వైద్యుల్లో ఆందోళన, అయోమయం కనిపిస్తోంది. కరోనా ఉన్నవారికి నెగెటివ్‌ ఫలితం ఎందుకొస్తోంది? ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షను ఎంతవరకు నమ్మొచ్చు? అనే అంశాలను ఒకసారి పరిశీలిస్తే అనేక విషయాలు తేటతెల్లమవుతాయి.


తప్పుడు నెగెటివ్‌ నివేదికలు తారస్థాయికి.. 

భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టుల డిమాండ్‌ కూడా విపరీతంగా పెరుగుతోంది. అయితే వీటిలో 20 శాతానికిపైగా టెస్టుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తున్న వ్యక్తులకు కూడా నెగెటివ్‌ ఫలితమే వస్తున్నట్లు సమాచారం. ఇలా జరగడం వల్ల కరోనాతో తీవ్రంగా బాధపడే వారికి కూడా ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితులు ఎదురుకావొచ్చు. ఇదే సమయంలో అసింప్టమాటిక్‌ (వైరస్‌ సోకినా ఇన్ఫెక్షన్‌ లక్షణాలు కనిపించని) వారికి నెగెటివ్‌ ఫలితం వస్తే.. వారు అందరితో కలిసి తిరగడం వల్ల మిగతా వారికి వైరస్‌ సోకే ముప్పు ఉంది. ఈ తప్పుడు ఫలితాలు దేశంలో ఎంతటి సమస్యగా మారాయంటే.. కరోనా టెస్టు ఫలితంతో సంబంధం లేకుండా ఇన్ఫెక్షన్‌ లక్షణాలు కనిపించిన వారందరికీ కొవిడ్‌ చికిత్స అందించాలని సాక్షాత్తూ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా సూచించారు. ఆయన మాటలు వింటేనే దేశంలో ఈ తప్పుడు నెగెటివ్‌ రిపోర్టులు ఏ స్థాయిలో వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.


ఈ నాలుగు అంశాలు పరిశీలిస్తారు.. 

కరోనా నిర్ధారణకు ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టును కచ్చితమైన ప్రమాణంగా భావిస్తారు. అయితే ఈ టెస్టుల్లోనూ అంత కచ్చితత్వం ఉండదు. ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టుల్లో భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) డిమాండ్‌ చేసే సెన్సిటివిటీ 95 శాతమే. అంటే 5 శాతం తప్పుడు నెగెటివ్‌ ఫలితాలకు అవకాశం ఉన్నట్టే. ప్రస్తుతం దేశంలో ఇలాంటి తప్పుడు ఫలితాలు ఎక్కువగా వస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నా, వీటికి సంబంధించిన ఆధారాలు మాత్రం ఎవరి దగ్గరా లేవు. ఆర్‌టీ- పీసీఆర్‌ పరీక్షలో ఒక వ్యక్తికి కరోనా ఉందా? లేదా? అని తెలుసుకోవాలంటే నాలుగు అంశాలను పరిశీలిస్తారు. అవి సదరు వ్యక్తిలోని వైరల్‌ లోడ్‌, సేకరించిన శాంపిల్‌ నాణ్యత, ప్రాసెసింగ్‌, పరీక్ష చేసే కిట్‌ సమర్థత, పరీక్షను అర్థం చేసుకునే విధానం. సాధారణంగా కరోనా వైరస్‌ మానవ శరీరంలో వృద్ధి చెందడానికి ఐదురోజులు పడుతుంది. అంటే అంతకన్నా ముందు పరీక్ష చేయించుకుంటే నెగెటివ్‌ ఫలితం రావడానికి అవకాశాలు ఉంటాయి. దానర్థం అతడికి వైరస్‌ సోకలేదని కాదు. 


ప్రస్తుతం దేశంలో ఈ పరిస్థితి ఎదుర్కోవడానికి అవకాశాలు తక్కువ. ఎందుకంటే దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ మ్యుటెంట్లు చాలా వేగంగా శరీరంలో వృద్ధి చెందుతున్నాయి. ఆర్‌టీ- పీసీఆర్‌ టెస్టుల్లో నెగెటివ్‌ ఫలితం వచ్చిన చాలామంది రోగులకు బ్రాంకోల్వియోలర్‌ లావేజ్‌ టెస్టులో పాజిటివ్‌ ఫలితం వస్తోంది. తప్పుడు నెగెటివ్‌ ఫలితాలు రావడానికి వైరస్‌ మ్యుటేషన్లు కూడా ఒక కారణమే. అయితే భారత్‌లో వాడే టెస్టులు ఒకేసారి వేర్వేరు జెనెటిక్‌ లక్ష్యాలను టార్గెట్‌ చేస్తాయి. కాబట్టి ఈ పరీక్షలు మ్యుటేషన్‌ కారణంగా తప్పుడు ఫలితాలను ఇవ్వడం అరుదుగా జరుగుతుంది. అమెరికాలో ఈ మ్యుటేషన్లపై ఆహార ఔషధ నియంత్రణ సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆర్‌టీ- పీసీఆర్‌ టెస్టులపై మ్యుటేషన్ల ప్రభావం ఎలా ఉందో ఎప్పటికప్పుడు మానిటరింగ్‌  చేస్తోంది. భారత్‌లోనూ ఇలాగే చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.


క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబ్‌లు ఏం చేస్తున్నాయి?  

తప్పుడు ఫలితాలు రావడానికి మరో కారణం.. ఉన్నట్టుండి ఈ టెస్టు చేసే ల్యాబ్‌ల సంఖ్య పెరగడం. గతేడాది ఫిబ్రవరిలో టెస్టింగ్‌ ల్యాబ్‌లు దేశవ్యాప్తంగా 14 మాత్రమే ఉన్నాయి. ఈ ఏప్రిల్‌ నాటికి వీటి సంఖ్య 2400కు పెరిగింది. వీటి ప్రమాణాలను పరిశీలించేందుకు ఐసీఎంఆర్‌ 30 క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబ్‌లను ఏర్పాటుచేసింది. ఆ తర్వాత వీటి సంఖ్యను మరో 8కి పెంచింది. అయితే ఈ క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబ్‌లు చేసిన తనిఖీలు చాలా తక్కువని కొందరు అంటున్నారు. దేశంలోని ల్యాబ్‌లు అన్నింటి నుంచి ర్యాండమ్‌గా కొన్ని శాంపిల్స్‌ తీసుకెళ్లి వాటిని మరోసారి టెస్టు చేయాల్సిన బాధ్యత ఈ క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబ్‌లకు ఉంటుంది. ఇలా జరిగిందా అంటే జరిగింది. కానీ ఇలా రెగ్యులర్‌గా చేస్తున్నారా? అంటే లేదు అని ఐసీఎంఆర్‌కే చెందిన ఒక శాస్త్రవేత్త చెప్పారు. 


సీటీ విలువకు పలు రాష్ట్రాల తిలోదకాలు

కరోనా టెస్టులు తప్పుడు ఫలితాలు చూపించడానికి మరో అరుదైన కారణం సీటీ విలువ. సీటీ అంటే సైకిల్స్‌ త్రెషోల్డ్‌. వైరల్‌ లోడ్‌ ఎంత ఉందో తెలుసుకోవడానికి శాంపిల్‌ను ఎన్నిసార్లు చెక్‌ చేస్తే అన్ని సైకిల్స్‌ పూర్తయినట్లు. శాంపిల్లో ఎక్కువ వైరల్‌ లోడ్‌ ఉంటే తక్కువ సైకిల్స్‌ (సీటీ)లోనే వైరస్‌ దొరికిపోతుంది. ఒకవేళ వైరల్‌ లోడ్‌ తక్కువగా ఉంటే ఎక్కువ సైకిల్స్‌ అవసరం. నెగెటివ్‌ ఫలితం ఇవ్వాలంటే శాంపిల్స్‌కు సీటీ వేల్యూ కనీసం 35 ఉండాలి. అయితే మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు ఈ విలువ 24 ఉన్నా సరిపోతుందని సూచించాయి. ఇలా ఎన్నో రాష్ట్రాలు సీటీ నియమాలను పాటించకపోవడం గమనార్హం. 


చౌక పరీక్ష కిట్ల వినియోగం? 

ఆర్‌టీ- పీసీఆర్‌ టెస్టు కిట్‌ ధర ఒక్క ఏడాదిలో రూ.1100 నుంచి రూ.40కి పడిపోయింది. దిగుమతులపై వేసే సుంకం నుంచి ఇచ్చిన మినహాయింపులను 2020 అక్టోబరులో భారత ప్రభుత్వం తొలగించింది. దీంతో విదేశాల నుంచి వచ్చే టెస్టు కిట్లపై 15 శాతం అదనపు భారం పడింది. ఈ కారణంగా చాలా విదేశీ కంపెనీలు భారత మార్కెట్‌ నుంచి వెళ్లిపోయాయి. చాలా భారతీయ బ్రాండ్లు కూడా రూ.100 కన్నా తక్కువకు కిట్లను అమ్మడానికి నిరాకరిస్తున్నాయి. అయితే తక్కువ ధరకు లభించే టెస్టు కిట్ల నాణ్యతపై కొందరు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అయితే మార్కెట్లో లభించే ఆర్‌టీ-పీసీఆర్‌ కిట్లన్నీ ఐసీఎంఆర్‌ ప్రమాణాలను పాటిస్తున్నాయని, ధరల యుద్ధం ఎంత జరిగినా చివరకు లాభం మాత్రం వినియోగదారుడికే అనేది కొందరి వాదన. అయితే ఈ టెస్టు కిట్ల ధర తగ్గడంతో ల్యాబ్‌ల టెస్టు ఫీజు కూడా తగ్గిపోయింది. గతంలో రూ.4500 ఉన్న ఫీజు ప్రస్తుతం రూ.800కు చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా టెస్టు చేయించుకున్న ల్యాబ్‌ ఎంత ఖరీదున్న కిట్‌ ఉపయోగిస్తుందో ఎలా తెలుస్తుంది? రూ.40తో పోతున్నప్పుడు ఎన్ని ల్యాబులు రూ.100 ఖర్చు పెడతాయి? అని దేశంలో కొవిడ్‌ పీసీఆర్‌ కిట్ల ఉత్పత్తిదారుల్లో ఒకరు ప్రశ్నించారు.

Updated Date - 2021-05-06T08:06:58+05:30 IST