ఎస్మాకు భయపడం

ABN , First Publish Date - 2022-01-31T08:01:43+05:30 IST

ఎస్మాకు భయపడం

ఎస్మాకు భయపడం

ఘర్షణ వాతావరణం తీసుకురావొద్దు: బొప్పరాజు 

ప్రభుత్వ మొండి వైఖరి కారణంగానే సమ్మెలోకి 

ఉద్యమం కోసం అవసరమైతే జైలుకెళ్లేందుకూ సిద్ధం

‘చలో విజయవాడ’కు లక్షలాది మంది తరలిరావాలి

మేం సమ్మె చేస్తే సీఎంలు ప్రతిపక్షంలోకే: బండి

ముగిసిన రిలే దీక్షలు.. జీవోల రద్దుకు డిమాండ్‌ 

పీఆర్సీ గోవిందా.. ఐఆర్‌ గోవిందా..

అనంతలో పీఈటీల వినూత్న నిరసన



(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) 

ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణాన్ని తీసుకురావొద్దని రాష్ట్ర మంత్రులకు ఏపీజేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు విజ్జప్తి చేశారు. ఆదివారం శ్రీకాకుళంలోని ఎన్జీవో హోమ్‌ రిలే నిరాహార దీక్ష చేపట్టిన ఉద్యోగులకు ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రుల కమిటీతో చర్చలకు రాలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘ఎస్మా చట్టానికి భయపడేది లేదు. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాడతాం. చిత్తశుద్ధితో, నిజాయితీతో ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేస్తే మేము నాలుగు అడుగులు వేస్తాం. చర్చలకు సిద్ధంగా ఉన్నాం. కానీ లిఖితపూర్వకంగా ఇచ్చిన వాటికి ముందు సమాధానం చెప్పాలి. మూడేళ్లు తిరిగాం, ఇంకా మోసం చెయ్యొద్దు. జీతాల్లో కోత పెట్టొద్దు’ అని ఆయన కోరారు. లక్షలాది మందితో 3న నిర్వహించే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యోగులకు బొప్పరాజు పిలుపునిచ్చారు. 


చర్యలకు దిగితే ముందుగానే సమ్మెలోకి: బండి 

ఉద్యోగులు సమ్మె చేసిన అనంతరం ముఖ్యమంత్రులు ప్రతిపక్షంలో కూర్చున్న విషయాన్ని జగన్‌ గుర్తుపెట్టుకోవాలని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల చేతికి పీఆర్సీ నివేదిక ఇస్తే రేపు ఇంకా గట్టిగా పట్టుబడతారని సీఎం అనడం సబబేనా అని ప్రశ్నించారు. మెరుగైన పీఆర్సీ సాధన కోసం చేసే ఉద్యమంలో అవసరమైతే జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమన్నారు. ఆదివారం కూడా విధుల్లోకి రావాలని ట్రెజరీ ఉద్యోగులపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని మండిపడ్డారు. విధులకు రానివారిపై క్రమశిక్షణ చర్యలు అంటూ బెదిరింపులకు దిగుతున్నారన్నారు. అటువంటి చర్యలకు ఉపక్రమిస్తే చెప్పిన తేదీ కంటే రెండురోజులు ముందుగానే అత్యవసర సమ్మెలోకి వెళ్తామని బండి హెచ్చరించారు. గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుల్లో ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష శిబిరాలను ఆదివారం ఆయన సందర్శించారు. ప్రభుత్వ మొండివైఖరి కారణంగానే సమ్మెలోకి వెళ్తున్నామన్నారు. దీన్ని అర్థం చేసుకుని ప్రజలు సహకరించాలన్నారు. మెరుగైన పీఆర్సీ సాధన కోసం చేస్తున్న ఉద్యమంలో ప్రభుత్వ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వం తక్షణమే చీకటి జీవోలను రద్దుచేసి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కారించాలని కోరారు. వచ్చేనెల 3న జరిగే చలో విజయవాడ కార్యక్రమానికి లక్షలాది మంది ఉద్యోగులు తరలిరావాలని బండి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. 


ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి వద్దు: సూర్యనారాయణ 

ప్రభుత్వం నిర్బంధంగా నిర్వహిస్తున్న పీఆర్సీ అమలు ప్రక్రియకు అర్ధం లేదని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌కే సూర్యనారాయణ పేర్కొన్నారు. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఏజీ కార్యాలయం, లోకల్‌ ఫండ్‌ కార్యాలయం సర్టిఫై చేయకుండా, డివిజన్‌ వారిని పరిగణనలోకి తీసుకోకుండా సీఎ్‌ఫఎంఎస్‌ ద్వారా తమకు తామే పెన్షన్‌ డివిజన్లు చేయడం చట్ట విరుద్ధమైన చర్యన్నారు. గుంటూరులో ప్రభుత్వ ఉద్యోగుల నిరసన శిబిరంలో ఆయన మాట్లాడుతూ అటువంటి అధికారులు, సీఎ్‌ఫఎంఎస్‌ ఏజెన్సీలు కోర్టులో దోషులుగా నిలబడాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ట్రెజరీ ఉద్యోగులను అపార్ధం చేసుకోవద్దని, ఒత్తిడి తట్టుకోలేకే విధుల్లోకి వెళ్తున్నారన్నారు. డీటీవోలు కూడా ట్రెజరీ ఉద్యోగులను ఒత్తిడికి గురిచేయవద్దని కోరారు. డీటీవోల కోసం అవసరమైతే ఉన్నాతాధికారుల కార్యాలయాల వద్ద నిరసన చేస్తామని సూర్యనారాయణ పేర్కొన్నారు. 


భయపెడితే సత్తా చూపిస్తాం: వెంకట్రామిరెడ్డి 

ఎస్మా అంటూ భయపెడితే తమ సత్తా ఏమిటో చూపిస్తామని ఏపీజీఈఎఫ్‌ రాష్ట్ర అఽధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏపీజేఏసీ సెక్రటరీ జనరల్‌ హృదయరాజు, పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణానిధిమూర్తితో కలసి ఆదివారం ఆయన కర్నూలులో ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యమాన్ని ఆపాలంటూ ప్రభుత్వం బెదిరిస్తోందని, సరైన పీఆర్సీ వచ్చేవరకు బెదిరింపులకు లొంగబోమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఆశుతోశ్‌ మిశ్రా కమిటీ రిపోర్టును బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం మొండి వైఖరిని మార్చుకోకుంటే ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఫిబ్రవరి 3న చలో విజయవాడ, 5న ప్రభుత్వ యాప్‌లను డౌన్‌చేసి సహాయ నిరాకరణ, 6న అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి దిగుతామని వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. 



Updated Date - 2022-01-31T08:01:43+05:30 IST