కేటీఆర్‌కు ఓటమి భయం

ABN , First Publish Date - 2021-08-26T07:50:07+05:30 IST

హుజూరాబాద్‌లో ఎవరు గెలిచినా తమ ప్రభుత్వం కూలిపోయేది లేదని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించడంలో టీఆర్‌ఎస్‌ ఓటమి ఖాయమనే విషయం స్పష్టమవుతోందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు.

కేటీఆర్‌కు ఓటమి భయం

  • ఉప ఎన్నికపై ఆయన వ్యాఖ్యలే నిదర్శనం
  • నా డిమాండ్‌తోనే దళిత అధికారులకు..
  • ప్రభుత్వంలో ఉన్నత పదవులు ఇచ్చారు
  • ప్రైవేటు టీచర్లకు ఆపత్కాల సాయం ఏది? 
  • బీజేపీ నేత ఈటల రాజేందర్‌

జమ్మికుంట రూరల్‌, ఆగస్టు 25: హుజూరాబాద్‌లో ఎవరు గెలిచినా తమ ప్రభుత్వం కూలిపోయేది లేదని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించడంలో టీఆర్‌ఎస్‌ ఓటమి ఖాయమనే విషయం స్పష్టమవుతోందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. తాను గెలుస్తున్నాననే నివేదికలు వచ్చాయని, ఓడిపోతున్నామనే భయంతో కేటీఆర్‌ ఇలాంటి ప్రకటన చేశారని తెలిపారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో బుధవారం ఈటల మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ గెలిస్తే గొర్ల మంద మీద తోడేళ్లు పడ్డట్లు ఎమ్మెల్యేలు, మంత్రులు నియోజకవర్గంపై ఎందుకు పడుతున్నారని ప్రశ్నించారు. సొంత పార్టీ నాయకులను ప్రలోభపెట్టి, ఖరీదు కట్టి, చిల్లర పనులు చేసి కేసీఆర్‌ అభాసుపాలయ్యారని విమర్శించారు. తనతో మాట్లాడిన ప్రతి ఒక్కరిని బెదిరిస్తున్నారని, అలా అయితే ఈ గడ్డ మీద వేరే పార్టీ ఉండొద్దని కొత్త చట్టం తీసుకురావాలన్నారు. ఏడేళ్ల తర్వాత సీఎం అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేశారని, తన డిమాండ్‌తోనే సీఎంవో కార్యాలయంలో దళితుడైన రాహుల్‌ బొజ్జాను, ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా లింబాద్రిని, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా దళిత బిడ్డను నియమించారనిపేర్కొన్నారు.


 ఇండియా టుడే సర్వేలో కేసీఆర్‌ క్రెడిబిలిటీ 84 శాతం తగ్గిపోయిందని తేలిందన్నారు. ఎవరి జాగాలో వారు ఇళ్లు కట్టుకునేందుకు నిధులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల జరిగిన దళిత బంధు సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతున్న సమయంలో ఇద్దరు మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని తెలిపారు. ఇంటెలిజెన్స్‌ అధికారులు వారిని గుర్తించి కేసీఆర్‌తో మాట్లాడించారని చెప్పారు. సర్పంచ్‌, ఎంపీటీసీ, వార్డు మెంబర్‌, ఇతర ప్రజాప్రతినిధులపై నమ్మకం లేకపోవడం వల్లే సామాన్య ప్రజలు, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులతో కేసీఆర్‌ మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. సిద్దిపేట మంత్రి ఇక్కడ అడుగు పెట్టి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గర ఉండి దావత్‌లు ఇస్తున్నారని.. ఎన్నికలయ్యాక ఇక్కడి ప్రజలను ఎవరూ పట్టించుకోరని చెప్పారు. తన గెలుపు తర్వాత తెలంగాణలో పెను మార్పులు వస్తాయని తెలిపారు. ప్రభుత్వం ప్రైవేటు టీచర్లను పట్టించుకోవడం లేదని, రెండు నెలలు మాత్రమే ఆపత్కాల సహాయం కింద నగదు, బియ్యం పంపిణీ చేసిందని విమర్శించారు. ప్రైవేటు టీచర్లు, లెక్చెరర్లు సమస్యలు చెప్పుకుందామని తన దగ్గరకు వచ్చారని.. ప్రభుత్వానికి వారి గోడు వినిపిద్దామని కార్యక్రమం ఏర్పాటు చేశామని.. కానీ వారిని బెదిరింపులకు గురి చేశారని పేర్కొన్నారు.

Updated Date - 2021-08-26T07:50:07+05:30 IST