నేలదున్ని మనుట చాలమిన్న!

ABN , First Publish Date - 2021-01-04T06:59:20+05:30 IST

ఆపదలో సొంత ఊరు అనే ఆలోచన ఒక బలం. సెంటులోనో, అరసెంటు లోనో చిన్నదైనా సరే వున్న ఇల్లు, సొంతానిదైనా కౌలుకు తీసుకుని సాగుచేసేదైనా సంవత్సరాలుగా కన్నవాళ్ళు చేస్తూ వస్తున్న సేద్యపుపనిలో నిక్షిప్తమైవున్న భద్రమైన భావన ఆ బలం.

నేలదున్ని మనుట చాలమిన్న!

ఆపదలో సొంత ఊరు అనే ఆలోచన ఒక బలం. సెంటులోనో, అరసెంటు లోనో చిన్నదైనా సరే వున్న ఇల్లు, సొంతానిదైనా కౌలుకు తీసుకుని సాగుచేసేదైనా సంవత్సరాలుగా కన్నవాళ్ళు చేస్తూ వస్తున్న సేద్యపుపనిలో నిక్షిప్తమైవున్న భద్రమైన భావన ఆ బలం. సహస్రాబ్దాలుగా సేద్యమే ప్రధానాధారంగా మనుతూ వస్తూన్న ఈ వ్యవసాయాధారిత దేశంలో మనిషి ‘పరాధీనపు బ్రతుకు పోతేపోయె, నేలదున్ని మనుట చాలమిన్న’ అనే ఆలోచనలో భద్రత పొందటంలో ఆశ్చర్యమేముంటుంది.


‘కర్షక వృత్తితో ఎన్ని కష్టాలో గదా!’ అనిపించేలా వుంటున్నాయి ఏ రోజు వార్తలు విన్నా, చూసినా ఈ రోజులలో, ఈ కాలం ఆ కాలం అనే తేడా లేకుండా. విత్తిన తరువాత పండేదెంతో, అకాలంగా వానో వరదో వచ్చి, పోయినది పోగా ఇంటికి చేరేదెంతో?! అన్నది ఎవ్వరికీ అంతుబట్టని స్థితి లోనే ఇంకా రోజులు గడుస్తూ వుండడం చూస్తూనే వున్నాం. ఈ అనిశ్చిత స్థితిలో మార్పు అసలెన్నటికైనా వస్తుందా? కాలంతో సంబంధం లేకుండానూ, ముందుగా ఊహించలేని ఉపద్రవాలతో కర్షకునికి నష్టం కలగకుండానూ చూడగలిగి--చిన్నకారు రైతులు ఇక చేసే దేమీలేదన్న బలహీన క్షణంలో ఆత్మహత్యల బారినపడ కుండా--కాపాడగలిగే రక్షణ విధానాలను కల్పించుకుని, వాటిని తూచా తప్పకుండా నిష్పక్షపాతంగానూ, నిజాయితీగానూ అమలుపరిచే రోజులతో నిండిన భద్రమైన కాలం ఈ దేశంలో కర్షకుల పాలిటికి ఏనాటికైనా రాగలిగే అవకాశం వుందా? అనేది ఇంకా ఒక సందిగ్ధంగానే మిగిలి ఉంది.


కర్షక వృత్తి ఇన్ని కష్టాలతో నిండి వున్నదైనప్పటికీ, ఈ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదనే భావన అందరిలో కొన్ని శతాబ్దాలుగా నెలకొని ఉంది. సామాన్య మానవులకే కాదు, మహాకవుల చిత్తాలకు కూడా ఈ భావన ఎంతగానో ప్రీతిపాత్రమైనదని చెప్పడానికి మంచన కవి (క్రీ.శ.1300 ప్రాంతం) రాసిన ‘కేయూరబాహు చరిత్రము’ అనే పేరుగల కావ్యంలో (స్వల్పమైన పాఠ బేధాలతో) వున్నప్పటికినీ, పోతన మహాకవి (క్రీ.శ.1400 ప్రాంతం) చాటువుగా లోకంలో బహుళ ప్రసిద్ధమై నిలిచి యున్న ఈ క్రింది పద్యం ఒక మంచి ఉదాహరణ:


బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్‌

కూళలకిచ్చి యప్పడుపుకూడు భుజించుట కంటె సత్కవుల్‌

హాలికులైన నేమి? గహనాంతర సీమల కందమూల కౌ

ద్దాలికులైన నేమి? నిజదారసుతోదరపోషనార్థమై.


అనర్హుడైన రాజుకు, ఆత్మీయంగా పెంచి పోషించిన కావ్య కన్యను అంకితమిచ్చి సంపాదించుకునేది ‘పడుపు కూడు’తో సమానమైనదిగా చెప్పి, అలాంటి తిండి తినడం కంటే, ఆత్మాభిమానం వున్న కవులైనవాళ్ళు రైతులైతే మాత్రం తప్పేమిటని తీవ్రంగా ప్రశ్నించడం పైపద్యంలో కనబడు తుంది. ఈ వృత్తిపై ఎంత గౌరవభావం లేకపోతే, ఇలాంటి భావాలతో నిండి వున్న పద్యం పై కవుల కలం నుంచి వెలువడుతుంది!


అడిగిన జీతంబియ్యని

మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్‌

వడిగల యెద్దుల గట్టుక

మడి దున్నుక బ్రదకవచ్చు మహిలో సుమతీ!


- అని సుమతీశతకం లోని పద్యంలో ఈ శతకానికి కర్తగా భావించబడుతూన్న బద్దెన (అనే భద్రభూపాలుడు) మంచన, పోతనల అభిప్రాయాన్నే కందపద్యంలో కుదించి చెప్పాడు. ఏ కాలానికి చెందినవాడో ఇతమిత్థంగా చెప్పగలిగే ఆధారాలు సరిగాలేని ఈ బద్దెన, పోతనకంటే తరువాతి వాడని చెప్పడానికే ఎక్కువ ఆస్కారముంది. ఉదాహరణకు ఈ పద్యాన్నే తీసుకుని ఆలోచిస్తే, ఇందులో బద్దెన విశదీ కరించిన సెటప్‌ అంతా (జీతము, దొర, సేవకుడు, అతడు దానిని చెల్లించమని అడగడమూ అనే ఈ సెటప్‌ అంతా) రాజరికపు రోజులలోని సెటప్‌గా కంటే, ఆధునిక, అంటే బ్రిటిషు పాలన దేశంలో మొదలైన తరువాతి కాలపు సెటప్‌కు సరిపోయేదిగా కనబడుతుంది కదూ?


ఇక్కడే ఇంకొక మాట కూడా చెప్పుకోవడం అప్రస్తుతం కాదనుకుంటాను. సుమతీశతక కారుడైన బద్దెన ఈ శతకంలోని పద్యాలకు మకుటంగా వాడుకున్న ‘సుమతీ’ అనే పదాన్ని మొట్టమొదటగా కల్పించి ఉపయోగించిన కవి పోతన మహాకవియే! ఆంధ్ర మహాభాగవతం, ప్రథమ స్కంధం, 308వ పద్యంగావున్న ఈ కింది పద్యం చూడండి:


బాలాజన శాలా ధన

లీలావన ముఖ్య విభవ లీన మనీషా

లాలసులగు మానవులనుఁ

గాలము వంచించు దురవగాహము సుమతీ! 


ప్రాయంలోవున్న ఆడవాళ్ళు, పెద్దపెద్ద భవ నాలు, అపారమైన ధనం, తోటలు మొద లైన వాటితో కూడినదైన సంపదపై అమి తాసక్తి కలిగిన మానవులను ఒకనాటికి కాలం వంచించక మానదు, కాలమహిమ దురవగాహం కాబట్టి అది అర్థం కాదు - అని పై పద్యం భావం. అచ్చమైన నీతి పద్యమే కదా ఇది కూడా! బద్దెన సుమతీ శతకంలోని పద్యాలకు మోడల్‌గా అనిపించే భాష, భావ నిర్మాణంతో ఉన్న పోతన పద్యం కాదూ ఇది! (‘ఎప్పటికెయ్యెది ప్రస్తుత’- మని మొదలయ్యే సుమతీశతకపు పద్యంలోని ధారతో పై పద్యంలోని ధారను పోల్చి చూడండి, ఎంతగా పోలిక వినబడుతుందో!).


ఈ స్వల్ప శాఖాచంక్రమణం నుంచి మళ్ళీ అసలు దారి లోకి అడుగుపెడితే, మంచెన, పోతన, బద్దెనలది రాజుల కాలం. చేసిన రచనకు పాలిస్తున్న రాజు ఆదరణ లభిస్తేనే తప్ప ప్రభుసత్కారంతో పాటుగా లభించే నాలుగు రాళ్ళు ఇంటికి చేరవు. ఇప్పుడలా కాదు. రోజులు మారాయి. ఇది ప్రజాస్వామ్య యుగం. ప్రభుత్వం, ప్రభుత్వానికి సంబం ధించిన ఎన్నెన్నో విభాగాలు, సంస్థలు వాటిల్లో లభించే ఉద్యోగాలు ఇప్పుడు పౌరుల జీవనానికి, రాజరికపు వ్యవస్థలో కంటే మిక్కుటంగా, కొత్తగా అందుబాటులోకి వచ్చిన మార్గాలు. ఫలితంగా ప్రభుత్వోద్యోగం ఒక గౌరవప్రద మైన జీవనోపాధి అయింది. 


బయటనుంచి చూసేవాడికి, ప్రభుత్వో ద్యోగం ఒక అందమైన, కల. దిగులు లేని జీవనోపాధి ఒక ఎదురులేని రాజమార్గం. అదృష్ట వంతులైతే తప్ప ఆ రాజమార్గంలో ప్రవేశం దొరకదు. ఒకసారి ఆ మార్గంలో ప్రవేశం దొరికితే, మరింక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని వుండదు. జనసామాన్యంలో ప్రభుత్వోద్యోగంపై నెలకొనివున్న అభిప్రాయం ఇది. అయితే, ఇందులో కూడా, లోపల ప్రభుత్వోద్యోగిగా వుండి అందు లోని సాధకబాధకాలను అనుభవిస్తూన్న ఉద్యోగుల మాటలు అప్పుడప్పుడూ ఇందుకు కొంతభిన్నంగా వినబడుతూం టాయి. ఎంతగా అనుకున్నా, చివరికి అది పరాధీనపు బానిస బతుకే అవుతుందిగాని, అందులో సామాన్య జనం అనుకునే సుఖం ఏ మాత్రం లేదని, స్వంత బతుకులో కలగాల్సిన సుఖాన్నంతా పైఅధికారి ఇష్టానిష్టాలకు వదిలేసి పరాధీనపు బతుకు బతకడం కంటే, నేల దున్నుకుని మనుగడ సాగించడ మేలైన పని అని, పూర్వకవుల పంథాలోనే పద్యం వ్రాయగలిగిన ప్రభుత్వోద్యోగి ఒకరు, పోయిన శతాబ్దం రెండవ దశకంలో (అంటే ఇప్పటికి వందేళ్ళ క్రితం) ఈ క్రింది పద్యంలో కారణాలతో సహా కళ్ళకు కట్టినట్లుగా చెప్పాడు:


‘‘తనపెండిలికి నైదు దినములు సెలవీయు

మనిన రెన్నాళ్ళు సాలనెడువారు

తన పునస్సంధానమని సెలవడుగంగ 

నంపుమఱొక్కని ననెడువారు

తండ్రి కపరకర్మ దాజేయవలెనన్న, 

బనిరోజు లిపుడుగాదనెడువారు

సోదరికిని జబ్బు చూచి వచ్చెదనన్నఁ 

గని యేమిచేసెద వనెడువారు

తండ్రియాబ్ధికంబు దాచియాదిత్యవా

రమున బెట్టుమనుచు వ్రాయువారు

నట్టివారిగొల్చి యిక్కట్లుబడుకన్న

నేలదున్ని మనుట చాలమిన్న.’’


మంచన కవి మాటేమో తెలియదు గాని, నేలదున్ని బతుకు సాగించడం పోతనగారు మాటవరసకు అన్న మాటగా కాక, అన్నానికి తాను నమ్మి జీవితమంతా అవ లంబించదలుచుకున్న మాటగా, చేసి చూపించి, చరిత్రలో తనకు తానే సాటియైున ‘కర్షక కవి’ గానిలిచిపోయాడు. ఈ కారణం చేతనేననుకుంటాను, ప్రజలు ‘బాలరసాల సాల’ పద్యానికి కర్తృత్వాన్ని పోతనకే ఆపాదించి తరతరాలుగా అలా చెప్పు కోవడానికి ఇష్టపడీ, అలవాటుపడీ, ‘చాటు’ దారిలో పద్యాన్ని పోతనదిగా చేసి ఆనందించారేమోననిపిస్తుంది. మాట చెప్పడమే కాదు, చేసే పనికి చెప్పిన మాటతో పొంతన కుదిరిన కవి మాటలను ప్రజలు గౌరవించి, తరతరాలకు సరిపోయే గొప్ప మర్యా దను కట్టబెడతారనడంలో ఆశ్చర్య పోవాలిసింది ఏమీ లేదు! అదలా వుండగా, పద్యం చెప్పగలిగే ప్రావీ ణ్యం కలవాడైన వందేళ్ళ క్రిందటి ఈ ప్రభుత్వోద్యోగికి, సందర్భానుసా రంగా పోతనగారు జ్ఞాపకానికి వచ్చి ఆ పంథాలో తానూ చెప్పడం గొప్పగా భావించి అలా చెప్పాడో, లేక నిజమైన నమ్మికతో ఆ పంథాను ఎన్నుకుని తన భావి జీవితంలో తానూ అవ లంబించాడో తెలుసుకునే మార్గం ఇప్పుడు మనకులేదు గాని, పోతన, మంచనల వాక్కు మహిమ వలన కర్షకునిగా బతుకు సాగించడం అన్నిటి కన్న గౌరవప్రదమైన వృత్తి అన్న భావం జనసామాన్యం మస్తిష్కాలలో స్థిరపడిపో యిందన్నది కాదనలేని నిజం.


ఎప్పుడూ ఒకేలా వుండేది కాలం కాదు. సృష్టి మను గడలో మార్పు ఒక్కటే నిత్యమైన నిజం. అయితే ఈ మధ్య, కరోనా వైరసులో మానవకోటి మనుగడను నిక్షిప్తం చేసి- ఒకటి రెండేళ్ళ దాకా మరి చూసుకోవాల్సింది ఏమీ లేదన్న ట్లుగా, దీర్ఘ కాల విశ్రాంతిలోకి వెళ్ళిపోయిందేమో ‘కాలం’ అనే సందేహం కలుగుతోంది. ఇప్పుడు ఇల్లు ఆఫీసుగా పనిచేయడం మొదలయింది. ఆఫీసు ఆఫీసుగా వున్నప్పుడు నిత్యవసరమైన పైపై ఉద్యోగాలు ఇప్పుడిక పనికి రానివిగా అయిపోయి ఊడిపోయాయి. ఉద్యోగాలు పోగొట్టుకున్న వారు విడతలవారీగా సొంతూళ్ళ దారి పట్టారు. ఆపదలో సొంత ఊరు అనే ఆలోచన ఒక బలం. సెంటులోనో, అర సెంటులోనో చిన్నదైనా సరే వున్న ఇల్లు, సొంతానిదైనా కౌలుకు తీసుకుని సాగుచేసేదైనా సంవత్సరాలుగా కన్న వాళ్ళు చేస్తూ వస్తున్న సేద్యపుపనిలో నిక్షిప్తమైవున్న భద్ర మైన భావన ఆ బలం. సహస్రాబ్దాలుగా సేద్యమే ప్రధానాధారంగా మనుతూ వస్తూన్న ఈ వ్యవసాయాధారిత దేశంలో మనిషి ‘పరాధీనపు బ్రతుకు పోతేపోయె, నేల దున్ని మనుట చాలమిన్న’ అనే ఆలోచనలో భద్రత పొంద టంలో ఆశ్చర్యమేముంటుంది.


భట్టు వెంకటరావు

Updated Date - 2021-01-04T06:59:20+05:30 IST