కరోనాతో రైతు కుదేలు!

ABN , First Publish Date - 2020-04-04T10:21:23+05:30 IST

కరోనాతో రైతు కుదేలు!

కరోనాతో రైతు కుదేలు!

కూలీల కొరతతో సమస్యలెన్నో.. ప్రణాళిక లేకపోతే విపత్తే!

వ్యవసాయ రంగ నిపుణుడు రామాంజనేయులు


కరోనా వైరస్‌ ప్రభావం తెలుగు రాష్ట్రాల వ్యవసాయ రంగంపై తీవ్రంగా పడిందని వ్యవసాయ రంగ నిపుణుడు డాక్టర్‌ రామాంజనేయులు అన్నారు. పంట కోత దగ్గర నుంచి విక్రయాల దాకా ప్రతి అడుగులోనూ ప్రభుత్వాలు సరైన ప్రణాళికలు రూపొందిచకపోతే రాబోయేది గడ్డుకాలమేనని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగంలో నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితి గురించి... సమీప భవిష్యత్తు గురించి ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఆ వివరాలు..

కరోనా ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉంది? రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు?

ప్రస్తుతం వ్యవసాయ రంగం చాలా చిత్రమైన పరిస్థితిలో చిక్కుకుంది. లాక్‌డౌన్‌ వల్ల ఎవరూ బయటకు రావటం లేదు. దీంతో కూరగాయలు, పళ్లను స్థానికంగా విక్రయించటం తప్ప ఇతర ప్రాంతాలకు రవాణా చేసే పరిస్థితి లేదు. రైతుకు వచ్చే రేటు కూడా తక్కువే. 

వరి, జొన్న, మిర్చి పండించే రైతుల పరిస్థితి ఏమిటి?

దేశంలో అత్యధికంగా వరిని సాగుచేసే రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ ఉన్నాయి. ఉదాహరణకు ఈ ఏడాది తెలంగాణలో 50 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. సాధారణంగా ఏప్రిల్‌ రెండో వారానికి పంట చేతికి వస్తుంది. అయితే పంటను కోయటానికి లేబర్‌ అందుబాటులో లేరు. యంత్రాల సాయంతో కోసినా.. వాటిని రవాణా చేసే పరిస్థితులు లేవు. అంతేకాదు జూట్‌ బ్యాగుల కొరతకూడా ఉంది. ప్రతి ఏడాది ఈ సీజన్‌లో వరికి దాదాపు 50 లక్షల బ్యాగులు అవసరమవుతాయి. 30 లక్షల బ్యాగులు ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. సాధారణంగా ఏప్రిల్‌ రెండో వారంలో వడగళ్ల వానలు పడతాయి. ఆ సమయానికి పంటను తరలించకపోతే రైతు నష్టపోతాడు.

వరి పరిస్థితే ఇలా ఉంటే మిగిలిన పంటల పరిస్థితి ఏమిటి?

వరి, జొన్న వంటి పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటిస్తుంది. కానీ మిగిలిన పంటలకు మద్దతు ధర ఉండదు. రెండు ఉదాహరణలు చూద్దాం. ఏప్రిల్‌ చివరి వారానికి మామిడి కాయలు పక్వానికి వచ్చి మార్కెట్‌లోకి రావాలి. వాటిని కోయటానికి ఈ సారి పనివారు అందుబాటులో లేరు. మిర్చి పరిస్థితి కూడా అంతే! గత ఏడాది మార్కెట్లో టన్ను రూ. 25 వేల వరకు ఉంది. ఈ సారి రేటు రూ.12 వేలు కూడా లేదు. నువ్వులు, తృణధాన్యాలు వంటి పంటలు పండించే రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది.

వలస కూలీలు వెళ్లిపోవడంవల్ల వ్యవసాయరంగంపైప్రభావం ఏమిటి?

మన వ్యవసాయ రంగంలో ఎంత మంది వలస కూలీలు ఉన్నారనే విషయం కచ్చితంగా తెలియదు. తెలంగాణ ప్రభుత్వం 9 లక్షల మంది అని చెబుతోంది. బహుశా వీరు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కేవలం వ్యవసాయ రంగంలోనే కాకుండా భవన నిర్మాణ రంగం లాంటి వాటిలో కూడా పనిచేస్తూ ఉండచ్చు. వ్యవసాయ రంగంలో ఇతర రాష్ట్రాల కూలీలతో పాటుగా- ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వచ్చిన కూలీలు కూడా ఉంటారు. లాక్‌డౌన్‌ వల్ల వీరు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లలేకపోతున్నారు. దీని వల్ల రకరకాల సమస్యలు ఏర్పడతాయి. 

పండించిన ప్రతి గింజ తాము కొనుగోలు చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించడం మేలు చేస్తుందంటారా?

రైతులకు భరోసా ఇవ్వటం మంచిదే! ప్రభుత్వం చెప్పినట్లు ధాన్యం కొనుగోలు చేస్తే రైతులకు కొంత కష్టం తీరుతుంది. అయితే కౌలు రైతుల విషయంపై కూడా స్పష్టతనివ్వాలి.

రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలి?

లాక్‌డౌన్‌ పూర్తయిన వెంటనే ఏర్పడే పరిస్థితులపై స్పష్టమైన అవగాహనకు వచ్చి ప్రణాళికను రూపొందించాలి. పంటను కొనుగోలు చేయటంతో పాటుగా నిల్వ పద్ధతులపైన.. రవాణాపైన.. రైతు కూలీలకు శిక్షణ ఇవ్వటంపైన శ్రద్ధ పెట్టాలి. అప్పుడే ఈ విపత్తును ఎదుర్కోగలుగుతాం. 

Updated Date - 2020-04-04T10:21:23+05:30 IST