సీనియర్ ఆటగాడు షమీపై అరిచేసిన హార్దిక్ పాండ్యా.. ఫైరవుతున్న అభిమానులు

ABN , First Publish Date - 2022-04-13T00:06:11+05:30 IST

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో తన సహచరుడైన

సీనియర్ ఆటగాడు షమీపై అరిచేసిన హార్దిక్ పాండ్యా.. ఫైరవుతున్న అభిమానులు

ముంబై: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో తన సహచరుడైన సీనియర్ బౌలర్ మహ్మద్ షమీపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఒక్కసారిగా అరిచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకెక్కి వైరల్ అవుతోంది. అది చూసిన అభిమానులు పాండ్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 46 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేయగా, నికోలస్ పూరన్ 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.  


పాండ్యా వేసిన 13వ ఓవర్‌లో రాహుల్ త్రిపాఠి ఇచ్చిన క్యాచ్‌ను పట్టుకోవడంలో షమీ విఫలమయ్యాడు. క్యాచ్ మిస్సవడంతో పాండ్యా గట్టిగా అరిచేశాడు. అప్పటికే అతడి బౌలింగులో విలియమ్సన్ రెండు భారీ సిక్సర్లు బాదాడు. త్రిపాఠి ఇచ్చిన క్యాచ్‌ను షమీ ముందుకొచ్చి అందుకుంటే చిక్కేదే. కానీ అతడు రెండడుగు వెనక్కి వేసి బౌన్స్ అయిన బంతిని అందుకున్నాడు. దీంతో షమీపై పాండ్యా ఆగ్రహం వ్యక్తం చేశాడు.


సీనియర్ బౌలర్‌పై పాండ్యా అలా అరవడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. అతడు గొప్ప కెప్టెన్ అయితే కావొచ్చు కానీ టీమ్మేట్లపై అలా అరవడం సరికాదని అంటున్నారు. మరీ ముఖ్యంగా సీనియర్ అయిన షమీపై అది కరెక్ట్ కాదని మండిపడుతున్నారు.


భారత జట్టుకు షమీ ఎంతో చేశాడని, హార్దిక్ అందులో సగం కూడా చేయలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. సహచరులతో ఎలా మాట్లాడాలో తెలియని వ్యక్తి కెప్టెన్‌గా పనికిరాడని అంటున్నారు. అన్ని మ్యాచ్‌లు గెలవడం సాధ్యం కాదని, అది జెంటిల్మెన్ గేమ్ అన్న సంగతిని మర్చిపోవద్దని పాండ్యాకు హితవు పలుకుతున్నారు.



Updated Date - 2022-04-13T00:06:11+05:30 IST