అమరావతి: ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఏపీలో థర్డ్ వేవ్ ఉదృతమవుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయని, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు స్కూల్స్‌కు సెలవులు ప్రకటించాయన్నారు.15 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదని, థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల ప్రాణాలతో చెలగాటమాడొద్దన్నారు. గత పది రోజుల్లో ఏపీలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని, ఈ సమయంలో స్కూల్స్ ప్రారంభించడం పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని లోకేష్ ఆ లేఖలో పేర్కొన్నారు.