ఖరీదైన మందు.. విందు..!

ABN , First Publish Date - 2022-08-07T09:31:37+05:30 IST

చీకోటి ప్రవీణ్‌ ఉదంతం తర్వాత.. నగరానికి - దేశ విదేశాల్లో కొనసాగుతున్న క్యాసినో ఆటలకు సంబంధాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

ఖరీదైన మందు.. విందు..!

ధనికులు, యువతే టార్గెట్‌.. నగరంలో క్యాసినో బ్రోకర్లు.. సెలబ్రెటీలతో గెట్‌ టు గెదర్‌లు

అక్రమంగా ఆన్‌లైన్‌లో క్యాసినో

పదుల సంఖ్యలో యాప్స్‌

వ్యసనపరులుగా మారుతున్న యువత

హవాలా ద్వారా వందలకోట్ల తరలింపు!


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): చీకోటి ప్రవీణ్‌ ఉదంతం తర్వాత.. నగరానికి - దేశ విదేశాల్లో కొనసాగుతున్న క్యాసినో ఆటలకు సంబంధాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా నిర్వాహకులు, బ్రోకర్లు ఒక క్రమపద్ధతిలో బడాబాబులు, ధనికులు, వారి పిల్లలను ముగ్గులోకి దింపుతున్నారు. అందుకోసం వారాంతాల్లో ‘ఖరీదైన మందు.. అద్భుతమైన విందు్‌్‌ పేరుతో పార్టీలు నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు. టార్గెట్‌లను గుర్తించడంలో బ్రోకర్ల పాత్ర కీలకం. కొందరు బ్రోకర్లు గతంలో క్యాసినోలు ఆడి.. సర్వస్వం కోల్పోయినవారు కావడం గమనార్హం..!


గెట్‌-టుగెదర్‌ అంటూ..

సమాజంలో ఓ స్థాయిలో ఆర్థిక స్థితిమంతులుగా ఉన్న బిల్డర్లు, రియల్టర్లు, వ్యాపారులే టార్గెట్‌గా క్యాసినో నిర్వాహకులు నేరుగా లేదా తమ బ్రోకర్ల ద్వారా పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. ‘మీలాంటి సంపన్నులు రావాల్సిన పార్టీ ఇది. చాలా మంది వస్తారు. మీరు ఇంతకు ముందు ఇలాంటి పార్టీలకు రాక.. చాలా కోల్పోయారు’ అంటూ బుట్టలో వేసుకుంటారు. ఒక్కసారి పార్టీకి వెళ్లేవారిని పూర్తిగా బ్రెయిన్‌వాష్‌ చేసేస్తారు. ఖరీదైన మందు, మంచి విందును ఏర్పాటు చేయడంతోపాటు.. కొందరు వ్యక్తులతో పరిచయకార్యక్రమాలు పెడతారు. ఆ క్రమంలో.. ‘ఈయన జె ట్‌స్పీడ్‌తో కుబేరుడయ్యాడు. రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టాడు.. ఇప్పు డు కోట్లకు పడగలెత్తాడు..’ ‘ఇదిగో.. ఈయన్ను చూడండి.. రూ. లక్షతో హైదరాబాద్‌ వచ్చాడు..! ఏడాదిలో రూ. 100 కోట్ల వ్యాపారాలకు అధిపతి అయ్యాడు..’. అంటూ అసలు విషయాన్ని తీరిగ్గా చెబుతారు. క్యాసినోలను నమ్ముకుని వారు ఈ స్థాయిలో ఎదిగారంటూ నమ్మబలుకుతారు. క్యాసి నో ఆడటం ఎలా? పెట్టుబడి ఎంత పెడితే.. ఎంత లాభం వస్తుంది? ఎక్కడ ఆడుతారు? విమాన సర్వీసులు, ప్యాకేజీలు ఏంటి? అనే వివరాలను అందజేసి.. బుకింగ్‌లకు సిద్ధమవుతారు. 


హవాలా మార్గంలో నగదు బదిలీ!

కొన్ని ముఠాలు ఆఫ్‌లైన్‌తోపాటు.. ఆన్‌లైన్‌లోనూ క్యాసినోకు అవకాశం కల్పిస్తున్నాయి. అయితే.. వీరికి శ్రీలంక, నేపాల్‌ వంటి దేశాల నుంచి లైవ్‌లైన్‌ను అందజేయాల్సి ఉంటుంది. అందుకోసం ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. ఎంతమొత్తం వెచ్చిస్తున్నారో ముందుగానే తెలియజేయాలి. ఆ మొత్తాన్ని బట్టి.. వారిని కేటగిరీలుగా విభజించి, ఆన్‌లైన్‌లో క్యాసినో ఆడటానికి అనుమతిస్తారు. అంతకు ముందు వారు పేర్కొన్న డ బ్బును చెల్లించాల్సి ఉంటుంది. దానికి సిద్ధమైతే.. నిర్వాహకులు వెంటనే హవాలా ఏజెంట్లను పంపుతారు. సీక్రెట్‌ కోడ్‌ చెబుతారు. హవాలా ఏజెంట్‌ ఆ సీక్రెట్‌ కోడ్‌ చెబితే.. అతనికి రూ. లక్షలు, కోట్లు అందజేయా లి. హవాలా ఆపరేటర్ల ద్వారా క్యాసి నో నిర్వాహకులకు ఆ మొత్తం అందగానే.. ఆన్‌లైన్‌లో లైవ్‌లైన్‌ను అందజేస్తారు. అలా లైవ్‌లైన్‌ తీసుకున్నవారు పగలు, రాత్రి అని తేడాలేకుం డా క్యాసినో ఆడుతూ.. ఉన్నదంతా పోగొట్టుకుంటారు. ఇలా తెలుగు రాష్ట్రాల నుంచే రోజుకు రూ. 50 కోట్ల వరకు హవాలా మార్గంలో తరలి వెళ్తోందని అంచనా. ఇంత జరుగుతున్నా.. ప్రభుత్వాలు క్యాసినో, హవాలా దందాను నిలువరించలేకపోతోంది. ఇలా క్యాసినోట్లో డబ్బులు పోగొట్టుకుని, రోడ్డుమీదకు వచ్చినవారిలో చాలా మంది బ్రోకర్లుగా అవతారమెత్తి.. కొత్తవారిని చేర్పించి, రూ. కోట్లు సంపాదిస్తున్నట్లు తెలిసింది.


ఒక్కొక్కరిదీ ఒక్కో కథ?

చందు(పేరు మార్చాం) ఒక గొప్ప బిల్డర్‌. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన భార్య, మెడిసిన్‌ చదివే కూతురు ఉంది. తన తమ్ముడు ఆన్‌లైన్‌ జూదాని కి అలవాటు పడ్డట్లు గుర్తించి, అతణ్ని గాడిలోకి తీసుకువచ్చాడు. అతను బ్రోకర్లకు బాకీ పడ్డ రూ. 75 లక్షలు తిరిగి చెల్లించాడు. ఈ క్రమంలో పరిచయం అయిన బ్రోకర్లు చందుకే ఎసరుపెట్టారు. ఏపీలో గొప్పపార్టీ అని.. ఖరీదైన మందు-అద్భుతమైన విందు ఉంటాయని ముగ్గులోకి దింపారు. 2019లో అలా రూ. 10లక్షలతో క్యాసినో ఆడడం ప్రారంభించాడు. ఈ ఏ డాది ప్రథమార్థం వరకు రూ. 20 కోట్లు పోగొట్టుకున్నాడు. దాంతో భార్యాకూతురు అతణ్ని వదిలేసి వెళ్లారు. అప్పులపాలైన చందు ఇప్పుడు బయ టి ప్రపంచానికి కనిపించకుండా.. రహస్యంగా గడుపుతున్నాడు.


రూ. కోట్లు పోగొట్టుకున్న వ్యాపారి

అప్పుడప్పుడుసరదాగా గోవాకు వెళ్లి క్యాసినోకు అలవాటుపడిన రాజు.. ప్రస్తుతం తన బిజినె్‌సలన్ని మానేసి హైదరాబాద్‌లోని ఓహోటల్‌లో గది ని అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. కారణం.. అప్పుల వాళ్లతో వేగలేక. ఫోన్లు, సిమ్‌కార్డులు మార్చేసి.. ముందు జాగ్రత్తగా ఫేక్‌ లొకేషన్‌ యాప్‌ తో ఢిల్లీ, యూపీల్లో ఉన్నట్లు సెట్టింగ్‌లు మార్చి, కాలం వెల్లదీస్తున్నాడు.  


కొలువులు పోగొట్టుకొని డ్రైవర్లుగా

ప్రముఖ కార్డియాలజీ డాక్టర్‌ రూ.3కోట్లు, ఇద్దరు సాప్ట్‌వేర్‌ ఇంజనీర్లు రూ. కోటి వరకు పొగొట్టుకున్నారు. కొందరు టెకీలు అన్నీ పోగొట్టుకున్నారు.‘కరోనా మహమ్మారి వల్ల కొలువు పోయిందని ఇంట్లో అబద్ధాలు చెప్పాం. ఏం పనిచేయాలో అర్థం కాక.. పబ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు వద్ద అర్ధరాత్రి డ్రైవర్‌లుగా పనిచేస్తున్నాం’ అని కొందరు బాధితులు వెల్లడించారు. ఇలా ఎందరెందరో క్యాసినో ఛట్రంలో చిక్కుకుపోయారు.

Updated Date - 2022-08-07T09:31:37+05:30 IST