UPSC Civil Services Prilimanary Exam 2021: జనరల్‌ కటాఫ్‌ ఎంత ఉండొచ్చంటే..

ABN , First Publish Date - 2021-10-11T13:38:10+05:30 IST

సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష..

UPSC Civil Services Prilimanary Exam 2021: జనరల్‌ కటాఫ్‌ ఎంత ఉండొచ్చంటే..

కొంచెం కష్టంగా.. సివిల్స్‌ ప్రిలిమ్స్‌

జనరల్‌ కటాఫ్‌ 90 దాటొచ్చు

రాష్ట్రంలో 47శాతం అభ్యర్థుల హాజరు


హైదరాబాద్‌ సిటీ(ఆంధ్రజ్యోతి): సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా రెండు సెషన్లలో పరీక్షలు జరిగాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉదయం, సాయంత్రం జరిగిన పరీక్షలకు 47 శాతం అభ్యర్థులు హాజరైన్నట్టు అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శర్మన్‌ నేతృత్వంలో కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. నగరంలో మొత్తం 101 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. ప్రశ్నపత్రాలు ఉంచిన స్ట్రాంగ్‌ రూమ్‌ను తెరిచి క్రమపద్దతిలో అన్ని కేంద్రాలకు పేపర్లు పంపించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని రూట్‌ ఆఫీసర్లు, స్థానిక తనిఖీ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. రాష్ట్రం నుంచి 46,955 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు జరిగిన తొలి సెషన్‌కు 22,386మంది (47.68%) అభ్యర్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30నుంచి సాయంత్రం 4.30వరకు జరిగిన రెండో సెషన్‌కు 22,193 మంది (47.47%) హాజరయ్యారు. అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, యూపీఎస్సీ అండర్‌ సెక్రటరీ మనోజ్‌ శర్మ, ఇతర అధికారులు పరీక్షా కేంద్రాలను సందర్శించారు. సివిల్స్‌ పరీక్షల నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వందకుపైగా ప్రత్యేక బస్సులను ఆయా పరీక్షా కేంద్రాలకు నడిపారు. హాల్‌టికెట్‌ చూపించిన అభ్యర్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు.


జనరల్‌ కటాఫ్‌ 90 పైనే...

సివిల్స్‌లో తొలిఅంకం ప్రిలిమ్స్‌ కొంచెం కష్టంగానే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్వభావరీత్యా డైనమిక్‌గా ఉందని అకడమిక్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయినప్పటికీ జనరల్‌ కటాఫ్‌ 90కి మించి ఉండొచ్చని అంచనా వేస్తుండటం విశేషం. రెండోదైన అర్హత పేపర్‌ సీశాట్‌పై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఇంజనీరింగ్‌ నేపథ్యం ఉన్న అభ్యర్థులను మినహాయిస్తే... మిగిలినవారు ఈ పేపర్‌ కష్టంగా ఉందని చెబుతున్నారు. మొదటి పేపర్‌ గత ఏడాదితో పోల్చుకుంటే కష్టంగా ఉంది. దాదాపుగా సిలబస్‌ మొత్తం పేపర్లో ప్రతిబింబించింది. సమకాలీన అంశాలు, భారత చరిత్ర, పాలిటీ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. మళ్లీ ఇందులో భారత చరిత్రపై అడిగిన ప్రశ్నలు కష్టం ఉన్నాయని కొందరు అంటున్నారు. జాగ్రఫీ నుంచి తక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఎన్విరాన్‌మెంట్‌ గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు సమయం ఎక్కువ పట్టింది. ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలు అడిగారు. 


చాలా ఏళ్ల తర్వాత క్రీడాంశాలపై కూడా ప్రశ్నలు వచ్చాయి. అందులో ఒకటి క్రికెట్‌ సిరీస్‌పై అడిగారు. కొన్ని ప్రశ్నలు అభ్యర్థులను తికమకపెట్టే విధంగా ఉండటమే కాకుండా, సమాధానం గుర్తించేందుకు సమయం తీసుకున్నాయి. అయిదింట మూడొంతులు కష్టం, రెండొంతులు ఫర్వాలేదు అన్నవాళ్లు కూడా ఉన్నారు. పరీక్ష కేంద్రం నుంచి బైటకు వచ్చిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది కష్టం అంటుండగా, కొద్దిమంది మాత్రమే సులువుగా ఉందని చెబుతుండటం గమనార్హం. అర్హత పేపర్‌గా భావించే సీశాట్‌ కూడా కష్టంగానే ఉంది. మ్యాథ్స్‌, డెసిషన్‌ మేకింగ్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ ప్రశ్నలు సులువుగా ఉన్నాయి. కాంప్రహెన్షన్‌ కింద అడిగిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు సమయం ఎక్కువ పట్టింది. లాజికల్‌ రీజనింగ్‌ ఒక్కటే ఫర్వాలేదనిపించింది.




Updated Date - 2021-10-11T13:38:10+05:30 IST