రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-01-28T04:22:46+05:30 IST

రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్‌

రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్‌
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి

అవినీతి పాలనపై సీబీఐ విచారణ చేపట్టాలి

బీజేపీ నేత వివేక్‌ వెంకటస్వామి


మట్టెవాడ(వరంగల్‌), జనవరి 27 : రాష్ట్రంలో కేసీఆర్‌ అవినీతి పాలనపై సీబీఐ విచారణ చేపట్టాలని పార్లమెంట్‌ మాజీ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర నాయకుడు వివేక్‌ వెంకటస్వామి డిమాండ్‌ చేశారు. బుధవారం వరంగల్‌ స్టేషన్‌ రోడ్‌లోని రాధాకృష్ణ గార్డెన్‌లో బీజేపీ జిల్లాకార్యవర్గ సమావేశం జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా వివేక్‌ వెంకటస్వామితోపాటు, బీజేపీ జిల్లా ఇంచార్జి మీసాల చంద్రయ్య హాజరయ్యారు. సమావేశంలో మొదటగా పార్టీ జెండాను ఎగురవేశారు.  ఈ సందర్భంగా వివేక్‌ వెంకటస్వామి మాట్లాడుతూ.. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కేసీఆర్‌ ఆస్తులు పెంచుకున్నారని ఆరోపించారు. రూ.36వేల కోట్లతో నిర్మించాల్సిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను లక్ష కోట్లకు పెంచారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో పెద్ద ఎత్తును అవినీతి జరిందన్నారు. కేసీఆర్‌ పాలన కాంట్రాక్టులు, కమీషన్‌లతోనే జరుగుందని అన్నారు. కమీషన్‌లతో వచ్చిన డబ్బును ఎన్నికలో గెలవడానికి విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారన్నారు.  తెలంగాణలో కేసీఆర్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అన్నారు. 2022లోనే దేశ వ్యాప్తంగా జమిలీ ఎన్నికలు జరుగుతాయన్నారు.  రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక, వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు బుద్ది చెబుతారని అన్నారు.  అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వరంగల్‌ నగరానికి మంజూరు చేసిన నిధులను వినియోగించుకోని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆరోపించారు. రానున్న గ్రేటర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగుర వేస్తామన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్‌ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించారని ముఖ్యంగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ లు ఎవరికీ ఇవ్వలేదని అన్నారు. లాక్‌ డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు, ప్రైవేట్‌ ఉపాధ్యాయులు, అధ్యాపకుల ను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. నగరం లో భూ కబ్జాలు పెరిగిపోయాయని, బీసీలకు రావాల్సిన రుణా లు ఇప్పటి వరకు మంజూరు కాలేదని తీర్మానంలో పేర్కొన్నారు. 

సమావేశంలో  రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండె విజయ రామారావు, యెండల లక్ష్మీనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్‌ రెడ్డి, కార్పొరేటర్‌లు కొడబోయిన సాంబయ్య, స్వాతి, నాయకులు చింతాకుల సునిల్‌, సిద్దం నరేష్‌, గంటా రవి కుమార్‌, పాక సుధాకర్‌, కుసుమ సతీష్‌, రత్నం సతీ్‌షసా, చింతం రాజు, చొల్లేటి కృష్ణమాచారి, గైనేని రాజన్‌, కూచన క్రాంతి పాల్గొన్నారు.


Updated Date - 2021-01-28T04:22:46+05:30 IST