మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ కన్నుమూత

ABN , First Publish Date - 2020-10-13T21:00:26+05:30 IST

తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎమ్మె

మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ కన్నుమూత

హైదరాబాద్‌ : తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ శాసనసభా పక్ష మాజీ నేత గుండా మల్లేష్‌ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. కరోనా, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులకు నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గుండా మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు. మల్లేష్ ఇక లేరన్న విషయం తెలుసుకున్న సీపీఐ నేత నారాయణ గృహనిర్బంధం నుంచి బయటికొచ్చి నిమ్స్ ఆస్పత్రికి బయల్దేరారు.


కార్మికుడిగా మొదలై...

కాగా.. కార్మిక కుటుంబం నుంచి వచ్చిన గుండా మల్లేష్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామానికి చెందిన మల్లేశ్ మెట్రిక్యులేషన్ చదివి, బెల్లంపల్లిలోని రామా ట్రాన్స్‌పోర్టులో క్లీనర్‌గా, డ్రెవర్‌గా పనిచేశారు. తోటి క్లీనర్లు, డ్రెవర్ల సమస్యలపై పోరాడారు. ఆ తర్వాత సింగరేణిలో కార్మికుడిగా చేరి సీపీఐలో సభ్యత్వం తీసుకుని.. 1970లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారారు. మంచి కార్మిక నేతగా పేరు తెచ్చుకున్న ఆయన 1983లో ఆసిఫాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 1985, 1994 ఎన్నికల్లోనూ గెలిచారు. 2009లో బెల్లంపల్లి నుంచి ఎన్నికై సభానాయకుడిగా కూడా వ్యవహరించారు. 

Updated Date - 2020-10-13T21:00:26+05:30 IST