అందరూ కళంకితులే!

ABN , First Publish Date - 2020-09-11T06:25:32+05:30 IST

టీవీన్యూస్‌కు ఏమయింది? మీడియా పరిశీలకులు పలువురు ఇప్పటికి చాలా వారాలుగా టీవీ న్యూస్ నిర్యాణం గురించి రాస్తున్నారు! బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ విషాద...

అందరూ కళంకితులే!

సుశాంత్ ‘అస్తిత్వ సంక్షోభానికి’ మాదకద్రవ్యాలు సేవించడం, మానసిక రుగ్మతలు, తీవ్ర నైరాశ్యానికి లోనుకావడమే ప్రధాన కారణాలని ఆయనకు చికిత్స చేసిన సైకియాట్రిస్టులు వెల్లడించారు. అయినప్పటికీ ఆ అంశాలపై దృష్టి పెట్టకుండా వ్యర్థ ప్రసంగాలు, అశ్లీల ఊసులతో వీక్షకులను ఉత్సాహపరిచేందుకు టీవీ చానెల్స్ ప్రాధాన్యమిస్తున్నాయి. ప్రైమ్‌టైమ్‌లో బిగ్‌బాస్ తరహా వినోద కార్యక్రమాలను వీక్షించేందుకు మీరు ఎక్కువగా ఇష్టపడుతుంటే జర్నలిజం కంటే అధిక రేటింగ్స్ సాధించడమే లక్ష్యంగా కల టీవీ ఛానెల్స్‌ను తప్పుపట్టడమెందుకు?


టీవీన్యూస్‌కు ఏమయింది? మీడియా పరిశీలకులు పలువురు ఇప్పటికి చాలా వారాలుగా టీవీ న్యూస్ నిర్యాణం గురించి రాస్తున్నారు! బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ విషాద మరణం పూర్వాపరాల గురించిన సంచలనాత్మక వార్తలను అందించడమే టీవీ మాధ్యమం అంతిమమ విధిగా మారిపోయినట్లు పరిగణిస్తున్నారు. అయితే అనుక్షణమూ గాభరా కలిగించే బ్రేకింగ్ న్యూస్ నిస్తోన్న మాధ్యమమే, సుశాంత్ కేసు ఒక అసంబద్ధ నాటకంగా పరిణమించడానికి ఏకైక కారణమా? ఈ అసంగత వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు, రాజకీయ పార్టీలు మొదలైనవి నిందారహితమైనవేనా?


దర్యాప్తు సంస్థల పాత్రనే తీసుకోండి. దేశ అత్యున్నత నేర దర్యాప్తు సంస్థలు– సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ–మూడూ సుశాంత్ కేసులో చురుగ్గా, తదేక దీక్షతో వ్యవహరిస్తున్నాయి. తమ శక్తి సామర్థ్యాలను, పూర్తి సమయాన్ని వినియోగిస్తున్నాయి. మంచిదే. అయితే దేశవ్యాప్తంగా అనేకానేక ఆర్థిక కుంభకోణాలలో నష్టపోయిన్న కాదు, సర్వమూ కోల్పోయిన మధ్యతరగతి ప్రజలు తమ డబ్బును తిరిగి పొందడానికి, తమను దారుణంగా దగా చేసిన ఆర్థికసంస్థల యాజమానులపై శీఘ్రగతిన అభియోగాలు మోపేందుకు పరిపరి విధాల పోరాడుతున్నారు. ఆ బాధితులకు ఊరట కలిగించే విధంగా మన దర్యాప్తుసంస్థలు వ్యవహరిస్తున్నాయా? సమాధానం స్పష్టమే.


మరి ఒక నటుడి మరణంతో ప్రమేయమున్న ఒక కేసు దర్యాప్తులో ఈ మూడు సంస్థలు ఎందుకు అంతగా శ్రద్ధాసక్తులు చూపుతున్నాయి? గత నెలలో, అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన డబ్బును చెలామణిలోకి తీసుకురావడానికి సంబంధించి యెస్‌ బ్యాంక్‌పై ఉన్న కేసులో డిహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లు వాధ్వాన్ సోదరులకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేయలేదూ? ఆ నిందితులు బెయిల్‌కు ఎలా అర్హులయ్యారు? వాధ్వాన్ సోదరులను రిమాండ్ చేసిన తేదీకి, విధిగా 60 రోజుల గడువులోగా వారిపై చార్జిషీట్ దాఖలు చేయడంలో ఈడీ విఫలమవ్వడం వల్లే కాదూ? అన్నట్టు సుశాంత్ కేసులోనూ అతని గర్ల్ ఫ్రెండ్, సహ నటి రియా చక్రవర్తి, ఆమె కుటుంబంపై మనీ లాండరింగ్‌కు సంబంధించి తీవ్ర అభియోగాలను ఈడీ మోపింది. ఏమిటి వీటికి ఆధారం? బిహార్‌లో సుశాంత్ కుటుంబం దాఖలు చేసిన ఒక ఎఫ్‌ఐఆర్లోని ఫిర్యాదుల యోగ్యతలను కనీసంగానైనా పరిశీలించకుండానే దాని ఆధారంగా ఈడీ ఆ అభియోగాలను నమోదు చేసింది.


ఎన్‌సీబీ పాత్ర మరింత వివాదాస్పదంగా ఉన్నది. పూర్తిగా వాట్సాప్ సంభాషణల ప్రాతిపదికన రియా, ఆమె సోదరునిపై ఒక కేసును నమోదు చేసింది. ఈ సంభాషణలలో కొన్నిటిని ఈడీ తొలుత ఎంపిక చేసి లీక్ చేసింది. దరిమిలా, ఈ కేసు దర్యాప్తును మరింత విస్తృతస్థాయిలో నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఇందుకు ఎన్‌సీబీని పురిగొల్పినదేమిటి? హిందీ చలనచిత్రసీమలో మాదకద్రవ్యాల క్రయ విక్రయాలను నిర్వహిస్తున్న ముఠాల కార్యకలాపాలపై కూడా దర్యాప్తు జరపాలని సంకల్పించుకోవడమేనట. వ్యక్తులు స్వల్ప పరిమాణంలో మాదకద్రవ్యాలను సేవించడమనే నేరాల దర్యాప్తు తమ పరిధిలోకిరాదని, తమ సంస్థ అంతర్జాతీయ, అంతర్‌రాష్ట్ర డ్రగ్‌మాఫియా కార్యకలాపాలను అరికట్టడంపైన మాత్రమే దృష్టి పెడుతుందని ఎన్‌సీబీ సీనియర్ అధికారి ఒకరు బహిరంగంగానే అంగీకరించారు. అయితే రియా కేసులో కేవలం 59 గ్రాముల మార్జువానాను సేకరించి వినియోగించుకోవడం మాత్రమే జరిగింది. అయినప్పటికీ ఆ స్వల్ప వ్యవహారాన్ని పెద్ద నేరంగా పరిగణించి కేసు దాఖలు చేసి పలువురిని అరెస్ట్ చేసింది. చివరకు సుశాంత్ వంట మనిషి కూడా మాదక ద్రవ్యాల సిండికేట్‌లో భాగస్థుడని ఎన్‌సీబీ ఆరోపించింది. ఏమిటి అతడి నేరం? డ్రగ్స్ వ్యసనానికి లోనైన తన యజమాని సుశాంత్ కోసం గంజాయిని తీసుకురావడమే ఆ వంట మనిషి ఏకైక నేరం. బాలీవుడ్‌లోనే కాక దేశంలోనే డ్రగ్ మాఫియాలకు నాయకత్వం వహిసున్న ‘పెద్దల’ను ఎన్‌సీబీ అరెస్ట్ చేసిందా మరి?


సుశాంత్ కేసు సాగుతున్న క్రమమే కొన్ని సత్యాలను చెప్పకనే చెప్పుతుంది. సుశాంత్ మరణాన్ని తొలుత ఆత్మహత్యగా భావించారు. హఠాత్తుగా అది స్వచ్ఛంద ఆత్మహత్య కాదని, ఆత్మహత్యకు పాల్పడేలా ప్రోత్సహించారని పేర్కొన్నారు. కథ అంతటితో ముగియలేదు. సుశాంత్‌ది ఆత్మహత్య కానేకాదని, అతడు హత్యకు గురయ్యాడని వెల్లడించారు. బాలీవుడ్‌లో బంధుప్రీతి, మాఫియాలతో సంబంధాలు, ఆర్థికనేరాలు, రాజకీయ వ్యవహారాలలో పాల్గొనడం, చివరగా మాదకద్రవ్యాల వినియోగమే సుశాంత్ విషాద మరణానికి దారితీశాయని అంటున్నారు. ఏది సత్యం? ఏదసత్యం? ఒక్కో సందర్భంలో ఒక్కో కారణం నిజమని మీరు విశ్వసించేలా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇది మాత్రమే సత్యం. అయినా ‘ఇదీ సత్యం’ అని తాము సత్యంగా విశ్వసిస్తోన్న విషయాన్ని చాటేందుకు బీహార్, ముంబై పోలీసులు గుంజాటన పడుతున్నారు. పరస్పరం తీవ్రంగా విమర్శించుకుంటున్నారు సమన్వయంతో కేసును పరిష్కరించే ప్రయత్నాలు కించిత్ కూడా జరగడమే లేదు. 


ఇంతలో సుప్రీంకోర్టు రంగ ప్రవేశం చేసింది. సుశాంత్ కేసులో సిబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ఆదేశంతో, రోజువారీ క్రిమినల్ కేసుల విచారణకు సంబంధించిన న్యాయాధికారుల పరిధి విషయమై ఇబ్బందికరమైన ప్రశ్నలు తలెత్తాయి. సరే, సెలబ్రిటీల వ్యవహారాలలో రాజకీయవర్గాల ప్రమేయం లేకుండా ఉంటుందా? సుశాంత్ సజీవుడుగా ఉన్నప్పుడేమో గానీ, అతడి విషాద మరణం తరువాత, ఆ దురదృష్టకర సంఘటన తమ ప్రయోజనాలకు ఉపయోగించుకునేందుకు రాజకీయ వేత్తలు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యర్థుల ఆటకట్టించేందుకు, ఎన్నికల ప్రచారానికి ఎంతగా ఉపయోగించుకోవాలో అంతగా ఉపయోగించుకుంటున్నారు. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతి రాజకీయపార్టీ కూడా సుశాంత్‌ను తలకెత్తుకున్నది. ‘బీహార్‌కు గర్వకారణం’గా ఆ కీర్తిశేషుడిని ప్రశంసిస్తున్నారు. అతడి మరణ రహస్యాన్ని ఛేదించాలని డిమాండ్ చేస్తున్నారు.


ఈ ప్రముఖ బీహారీ బిడ్డపై రాజకీయులు అంత శ్రద్ధ చూపడం అర్థం చేసుకోదగిందే. మరి వరదలతో అతలాకుతలమయిన ప్రాంతాలలోని వేలాది విద్యార్థులు ఎటువంటి విపత్కర పరిస్థితులలో ఉన్నారో రాజకీయ వేత్తలు పట్టించుకుంటున్నారా? ఈ కరోనా కష్టకాలంలో ఐఐటి–జెఈఈ, నీట్ ప్రవేశపరీక్షలు రాయడానికి వారు పడుతున్న తిప్పలను తొలగించేందుకు ఆ రాజకీయులు ఏమి చేస్తున్నారు? వలసకూలీల వెతల మాటేమిటి? నెలల తరబడి పైసా ఆదాయం లేనివారు ఎలా బతుకుతున్నారు? వారి కష్టాలను తీర్చేందుకు రాజకీయ వర్గాలు చేస్తున్నదేమిటి? ఈ కఠోర పరిస్థితులను పట్టించుకోకుండా ఒక నటుడికి ‘న్యాయం’ జరగాలనే విషయమై ఉద్యమించడం సమస్యల నుంచి, తమ బాధ్యతారాహిత్యం నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకా? ఈ ‘న్యాయ’ ఆరాటం మంచి వినోదాన్నే ఇస్తోంది సుమా! బీహార్ పాలక సంకీర్ణంలో భాగస్వామి అయిన బీజేపీ ఇప్పటికే సుశాంత్ పోస్టర్లను ముద్రించి పంపిణీ చేస్తోంది. తన రాజకీయ సందేశాన్ని వివరించేందుకు ‘సుశాంత్ మాస్క్’లను ప్రజలకు అందిస్తోంది. దేశ పాలకపక్షం స్థానిక రాజకీయాలలో ప్రయోజనం పొందేందుకు మరణించిన ఒక నటుడి కీర్తిప్రతిష్ఠలను ఉపయోగించుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దేశ రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో సూచించడం లేదూ? ఓట్ల కోసం ఏమైనా చేయవచ్చన్న భ్రష్టవైఖరికి ఇంతకంటే నిదర్శనమేముంటుంది? 


మహారాష్ట్రలో సైతం పాలక సంకీర్ణానికి, ముఖ్యంగా శివసేనకు ఇబ్బందులు సృష్టించేందుకు సుశాంత్ కేసును బీజేపీ ఉపయోగించుకుంటోంది. గతంలో శివసైనికుడు, ఇప్పుడు బీజేపీ నాయకుడుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారాయన్‌రాణే సుశాంత్ విషాదాంతంలో ‘ఒక యువ మంత్రి’ కుతంత్రం ఉందంటూ పలు ఆరోపణలు చేశారు. ఏ ఒక్క ఆరోపణకూ ఒక గట్టి రుజువును ఆయన చూపలేకపోయారు. ప్రజాజీవితంలో నాగరీక విలువలు అంతకంతకూ లుప్తమై పోతున్నాయని రాణే తన ఆరోపణలతో రుజువు చేశారు. హుందాగా వ్యవహరించే దేవేంద్ర ఫడణవీస్ సైతం సుశాంత్ కేసును రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం ఎంతైనా దురదృష్టకరం. రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయని విచారిస్తే ప్రయోజనమేముంది? శివసేన నాయకత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టి ఆ క్రమంలో పాలకకూటమిని కూల్చివేయడమే బీజేపీ అసలు లక్ష్యం. 


సుశాంత్ కేసును స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడంలో మన రాజకీయ నాయకుల దిగజారుడుతనం, రాజకీయ కుతంత్రాలు కొత్త విషయాలేమీ కాదు. సుశాంత్ విషాదాంతానికి, దాని ఆధారంగా జరుగుతున్న అసహ్యకర రాజకీయాలకు పౌర సమాజం ప్రతిస్పందిస్తున్న తీరు ఎంతైనా బాధ కలిగిస్తోంది. సభ్యత సిగ్గుపడుతోంది. సుశాంత్, రియాలు భాగస్వాములైన చలనచిత్ర పరిశ్రమ వైఖరినే చూడండి. గౌరవనీయులు మౌనం వహించారు. మీడియా ధోరణులను ప్రశ్నించడం లేదు. ఏం మాట్లాడితే ఏం సమస్యలు వస్తాయోనన్న భయం వారిని వెంటాడుతోంది. పైగా సామాజిక మాధ్యమాల పోకిరీ మూకల నుంచి ఎదురయ్యే సమస్యలు, వారిని మరింత భయపెడుతున్నాయి. తమ అస్తిత్వానికి కారణమైన ఒక రంగం పూర్తిగా పాపాల నెలవు అని దునుమాడుతున్నప్పుడు ఆ విమర్శను ప్రశ్నించవలసిన బాధ్యత ఆ రంగంలోని ప్రముఖులకు లేదా? బాలీవుడ్ ప్రముఖుల తీరును సామాన్య సినిమా ప్రేక్షకులు తప్పక గర్హిస్తారు. మాట్లాడవలసిన వారు మాట్లాడకపోవడం వల్లే కంగనా రనౌత్ లాంటి వారు బిగ్గరగా మాట్లాడుతున్నారు. కొంతమందిపై ధ్వజమెత్తేందుకు ఆమెకు సొంత కారణాలు ఉన్నాయి. సంభావ్య రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూడా సుశాంత్ కేసులో పరిణామాలకు కంగనా ప్రతిస్పందిస్తున్నారు. ఆమెను లక్ష్యంగా చేసుకుని శివసేన మరాఠీ ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నది. ఆమెను నానావిధాలుగా దుర్భాషలాడుతోంది. బహిరంగ చర్చలు ఎంతగా గందరగోళానికి గురవుతున్నాయో కంగనా–శివసేన వాద ప్రతివాదాల ఉదంతం విశదం చేస్తున్నది. 


టీవీ న్యూస్‌ను తీవ్రంగా విమర్శించే వీక్షకులు సైతం సుశాంత్ కేసులో నెలకొంటున్న అనారోగ్యకర పరిణామాలకు సమాధానం చెప్పవలసి ఉన్నది. అసలే కరోనా మహమ్మారి చెలరేగిపోతున్న కాలం; ఆ పై ఆర్థిక వ్యవస్థ అంతకంతకూ మాంద్యంలోకి దిగజారి పోతున్నది; ఉద్యోగాలు మటుమాయమై పోతున్నాయి. పైపెచ్చు సరిహద్దుల్లో చైనా పూర్తిస్థాయిలో కాలు దువ్వుతున్నది. ఈ పరిస్థితుల్లో సగటు మధ్యతరగతి టీవీ వీక్షకుడు సుశాంత్-–రియా కేసులో ప్రతి మలుపునూ విశేషాసక్తితో గమనిస్తున్నాడు. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఇతరుల కష్టాలు, బాధలూ చూసి ఆనందించే వ్యక్తుల్లా వ్యవహరిస్తున్నారు. తద్వారా ఈ వినాశనకర సంవత్సరపు కఠోర వాస్తవాల నుంచి పలాయనం చిత్తగించడంలో అనారోగ్యకరమైన ఆనందాన్ని పొందుతున్నాడు. సుశాంత్ ‘అస్తిత్వ సంక్షోభానికి’ మాదకద్రవ్యాలు సేవించడం, మానసిక రుగ్మతలు, తీవ్ర నైరాశ్యానికి లోనుకావడమే ప్రధాన కారణాలని ఆయనకు చికిత్స చేసిన మనోరోగ చికిత్సకులు వెల్లడించారు. అయినప్పటికీ ఆ అంశాలపై దృష్టి పెట్టకుండా వ్యర్థ ప్రసంగాలు, అశ్లీల ఊసులతో వీక్షకులను ఉత్సాహపరిచేందుకు టీవీ చానెల్స్ ప్రాధాన్యమిస్తున్నాయి. ప్రైమ్‌టైమ్‌లో బిగ్‌బాస్ తరహా వినోద కార్యక్రమాలను వీక్షించేందుకు మీరు ఎక్కువగా ఇష్టపడుతుంటే జర్నలిజం కంటే అధిక రేటింగ్స్ సాధించడమే లక్ష్యంగా కల టీవీ ఛానెల్స్‌ను తప్పుపట్టడమెందుకు?


రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - 2020-09-11T06:25:32+05:30 IST