ప్రతి ఆడపిల్లా ఇలా కావాలి!

ABN , First Publish Date - 2022-03-19T15:36:17+05:30 IST

మార్చి 20, 2022 ఆదివారం నాడు ఉషశ్రీ 94వ జయంతిని పురస్కరించుకుని సామవేదం..

ప్రతి ఆడపిల్లా ఇలా కావాలి!

మార్చి 20, 2022 ఆదివారం నాడు ఉషశ్రీ 94వ జయంతిని పురస్కరించుకుని సామవేదం షణ్ముఖశర్మ గారికి ‘ఉషశ్రీ సంస్కృతి సత్కారం’ 11వ పురస్కారం అందిస్తోంది ఉషశ్రీ మిషన్‌. ఈ సందర్భంగా సుమారు 40 సంవత్సరాల క్రితం ఉషశ్రీ రచించిన ‘ఎవరు ఎలా మాట్లాడతారు? భారతంలో రాయబారాలు’ పుస్తకం నుంచి ఈ భాగం మీ కోసం...


(శ్రీకృష్ణుడు రాయబారానికి బయల్దేరబోతున్నాడు. పాండవులు తమ తమ అభిప్రాయాలను ఆయనకు వివరిస్తున్నారు)


వీరందరి మాటలూ ఒక యెత్తు ద్రుపదరాజనందన ఆవేశం మరొక యెత్తు. కురుగురువృద్ధ బాంధవులున్న సభలో జరిపిన పరాభవం ఆమె హృదయంలో అగ్నిలా మండుతూనే ఉంది. పదమూడు సంవత్సరాలు అగ్నిజ్వాలలను ఓరిమితో అణుచుకుంది. ఇంకా వాటికి శాంతి చెయ్యాలని నిశ్చయించుకుంది. ఆ స్థిర సంకల్పంతో వాసుదేవుని ముందుకు వస్తున్న ద్రౌపదిని చూపుతూ వ్యాసమునీంద్రుడు...

సర్వలక్షణ సంపన్నం మహాభుజగ వర్చసం

కేశపక్షం వరారోహా గృహ్య వామేన పాణినా‘‘

అన్నారు.


ఈ చిన్న శ్లోకంలోనే ఆమె రూపం మనకు సాక్షాత్కరిస్తుంది.

బుస కొడుతున్న నల్లత్రాచు పాము వంటి జుట్టు ముడి విప్పి ఎడమ చేతితో ముందుకు చూపుతూ గద్గద కంఠంతో కన్నీరు విడుస్తూ వచ్చింది ద్రౌపది.


దేవకీ నందనా! నాడు సభాభవనంలో అంత పరాభవం చేసి, ఈనాడు సంజయుని చేత ధర్మపన్నాలు చెప్పి పంపిస్తే, వీరు విని, తమకు అయిదు గ్రామాలిచ్చినా చాలు, అని యాచిస్తారా! పాపం! దుర్యోధనుడు వీరి సోదరుడు కదా! ఆ మాత్రం దయతలవరా!


తమరు పడ్డ క్లేశాలన్నీ వీరు మరిచిపోగలరు, తమ్ముని మీద ప్రేమతో సహించి ఊరుకోనూగలరు. కాని రాజ్యభాగం అందుకోకపోతే నలుగురూ ఏమంటారు? సిగ్గులేని అవివేకులని తూలనాడరా!


‘‘గౌరవహీనంగా తమను తాము కించపరచుకొని సంధికి సిద్ధపడుతున్నారు. బావుంది. కాని సంధివల్ల వారికి లాభం కాని మనకు కాదే, ఇంతకూ ఏ కీడైనా సైరింపగా వారు బ్రాహ్మణులా! దురభిమానిౖయెన సుయోధనుడు నీ మాటలు వినడు. వినక యుద్ధానికి కాలుదువ్వినా వీరు కాళ్లూ చేతులూ ముడుచుకుని కారడవులకి వెడతారా!’’ ఆవేశంతో నేనేదో అంటున్నాను. మీరు బాగా ఆలోచించి మీ మంచితనానికి ఇబ్బంది రాకుండా వారితో సంధి చేసుకోండి. నా మాటలు లక్ష్యపెట్టకండి, మీ నిర్ణయానుసారం సాగండి.


‘ఒక్కమాట, నేను పుట్టిన వంశం, మెట్టిన వంశం ఎటువంటిది? చేపట్టిన వారు సామాన్యులా! నా బిడ్డలు తక్కువవారా! ఇన్నిటినీ మించి సుభద్ర కంటె నన్నే అభిమానంతో గౌరవంతో చూసుకుంటున్నావే. ఇంతటి నన్ను ఏం చేశారయ్యా! రాజసూయ యాగం ముగిసేవేళ అవభృథ స్నానంతో పరమ పవిత్రమైన ఈ కేశపాశం పట్టి ఒకడెవడో ఈ అయిదుగురూ చూస్తుండగా సభా భవనానికి లాగుకొని వచ్చాడే! కులస్త్రీని ఇంత అవమానించడం విన్నావా!


కురువృద్ధులు, గురు వృద్ధులు, మిత్ర బాంధవులందరూ ఉన్న సభాభవనానికి ఏకవస్త్రనైయున్న నన్ను (రజస్వలలు ఏకవస్త్రం ధరించటం ఆచారం) ఈడ్చుకొచ్చి దుశ్శాసనుడు అవమానిస్తుంటే వీరంతా చైతన్య శూన్యులై కూర్చుంటే నిన్ను స్మరించాను, గుర్తున్నదా! ఆ ఇంటి పెద్ద కోడలిని అని కూడా చూడకుండా నన్ను దాసిగా చేశారు. ఆ మహామహులు వీరంతా వారిని సేవిస్తుంటే నేనా ఇంట్లో కోడరికం వెలగబెట్టాలా! వారి పాదాలు ఒత్తుతూ దాసిలా బ్రతుకు బ్రతకాలా!


చూడవయ్యా, దుశ్శాసన దుర్మదాంధుని చేతులలో ఊడగా మిగిలిన పవిత్ర కేశాలు. ఈ పవిత్ర వేణిని మరువకుండా రేపు కురుసభలో నీ సంభాషణ సాగించు. ఈ జుట్టు మీద చెయ్యి వేసిన దురాత్ముని శరీరం ఇంతలింతలు ముక్కముక్కలుగా రణరంగంలో పడివుండగా నా కంటితో చూడాలి. అప్పుడు కాని నా హృదయావేదన చల్లారదు. ఎందుకయ్యా గదాదండంతో ఈయనా, గాండీవంతో ఆయనా... వీరుభయులూ విక్రమించి సంగ్రామ భూమిలో రక్తప్రవాహంలో విలవిల్లాడే దుర్యోధనుని శవాన్ని ధర్మరాజుతో కలిసి చూసే అదృష్టం మాకు కలిగించకపోతే!


‘‘పదమూడు సంవత్సరాలుగా పరాభవాగ్ని జ్వలిస్తూనే వుంది. నీవంటి తోబుట్టువు, అంత పరాక్రమం గల భర్తలు పూసుకుని దుష్టశిక్షణ సాగించి ఆ అవమానాన్ని చల్లార్చండి’’ అంది.


ద్రౌపదీదేవి నోట వెలువడిన ప్రతిపదం యౌవనంలో అడుగుపెట్టే ఆడపిల్లల చేత కంఠపాఠం చేయించి, దాని అర్థాన్ని వారి గుండెకు ఎక్కించాలి. దేశంలో దుశ్శాసన, కీచక సంతానం పెరుగుతున్న ఈ రోజులలో ఆడపిల్లలందరూ ద్రౌపదీదేవి వలె ప్రతీకారాన్ని కోరాలి. పరాభవించిన దుశ్శాసనుల ముందు తలవంచడం మానాలి.


అందుకోసమే భారతం –

భారతం అంతా చదవలేకపోతే ఉద్యోగపర్వమైనా చదివించండి. దాని సారాంశం గుండెకెక్కించండి. ఇది మానవజాతి ఉన్నంతకాలం మహేతిహాసంగా ఎందుకు ఇన్ని వేల సంవత్సరాలుగా కోట్లాది ప్రజలను ఆకర్షిస్తున్నదో గ్రహించి అది ఇచ్చే సందేశాన్ని ఆచరణలో పెట్టండి.


– ఉషశ్రీ


Updated Date - 2022-03-19T15:36:17+05:30 IST