Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 03 Jun 2021 04:19:39 IST

రెండు డోసులూ వేసుకున్నా.. బీ కేర్‌ఫుల్‌

twitter-iconwatsapp-iconfb-icon
రెండు డోసులూ వేసుకున్నా.. బీ కేర్‌ఫుల్‌

కరోనా వైరస్‌ సోకకుండా వ్యాక్సిన్‌ అడ్డుకోలేదు

సోకితే ఇన్ఫెక్షన్‌ తీవ్రతను బాగా తగ్గిస్తుంది

ప్రాణాపాయం నుంచి కాపాడుతుంది

కోమార్బిడిటీస్‌, వయసు వంటివి

టీకా పనితీరుపై ప్రభావం చూపే అవకాశం

టీకా రెండు డోసులు వేసుకున్న తర్వాతా

కొందరికి కరోనా.. కొందరి ప్రాణాలకు ముప్పు

యువతతో పోలిస్తే 65 ఏళ్లు దాటినవారిలో

టీకా రక్షణ కొంత వరకూ తక్కువగా ఉంటోంది

ఏపీ, తెలంగాణల్లో బి.1.617.2 వేరియంట్‌

రాష్ట్రంలో జీన్‌ సీక్వెన్సింగ్‌ చేసిన 

ప్రతి రెండో నమూనాలో ఒకటి ఈ వేరియంట్‌దే

సింగిల్‌ డోసు టీకా ప్రభావం దానిపై 33 శాతమే

మూడోసారి వైరస్‌ బారిన పడ్డ కేసులూ వస్తున్నాయి

వ్యాక్సిన్‌ వేసుకున్నాం కదా అని నిర్లక్ష్యం వద్దు

అందరూ జాగ్రత్తగా ఉండాలని వైద్యుల సూచన


హైదరాబాద్‌లోని ఛాతీ ఆస్పత్రిలో సిబ్బందికి ఈ ఏడాది జనవరి 16, 17 తేదీలలో మొదటి డోసు వ్యాక్సిన్‌ వేశారు. రెండో డోసు ఫిబ్రవరి 13,14 తేదీలలో వేశారు. వ్యాక్సిన్‌ వేసుకున్న వారిలో పది మందికి రెండు నెలల తర్వాత వైరస్‌ సోకింది. కానీ, వారంతా అయిదు రోజులకే కోలుకున్నారు. ఎవరికీ ఎలాంటి అపాయం కలగలేదు. వారే కాదు.. దేశవ్యాప్తంగా రెండు డోసుల టీకా వేసుకున్న కోట్లాది మందిలో అతి తక్కువ మంది మాత్రమే అయినా వైరస్‌ వల్ల కొంత ఇబ్బంది పడ్డారు. అందుకే అప్రమత్తతే అసలైన వ్యాక్సిన్‌ అని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అత్యధికుల్లో ధైర్యం నింపుతున్న వ్యాక్సినేషన్‌.. కొందరిలో మాత్రం అనవసర ధీమాను, ఎక్కడలేని నిర్లక్ష్యాన్నీ పెంచుతోందని, ఈ ధోరణి పెరిగితే ముప్పేనని వారు హెచ్చరిస్తున్నారు. 


అమరావతి, హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): వ్యాక్సిన్‌ వేసుకుంటే ఇక కరోనాను జయించినట్టేనని చాలా మంది భావిస్తున్నారు. కానీ.. కరోనా వ్యాక్సిన్‌ వైర్‌సను చంపేసే బ్రహ్మాస్త్రం కాదు. నిమిషాల్లో వైర్‌సను అంతం చేసి, ప్రాణాలను కాపాడే సంజీవని అంతకంటే కాదు. కేవలం కరోనా వైర్‌సను తట్టుకునే శక్తి సామర్థ్యాలను శరీరానికి అందిస్తుంది. వైరస్‌ సోకితే ఇన్ఫెక్షన్‌ తీవ్రతను గణనీయంగా తగ్గిస్తుంది.


ఆస్పత్రి పాలయ్యే అగత్యాన్ని.. ప్రాణాపాయ ముప్పును తగ్గిస్తుంది. ఈ విషయం తెలియక చాలా మంది టీకాలు వేయించుకున్నాక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. ఆ నిర్లక్ష్యమే అత్యంత ప్రమాదకరమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా.. ఇటీవలికాలంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో వ్యాక్సినేషన్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ టీకాలు తీసుకున్నవారంతా.. తమకేం కాదులే అన్న ధోరణితో వ్యవహరించడమే సమస్యకు, వైరస్‌ వ్యాప్తి పెరగడానికి కారణమవుతోంది. ఆ ధోరణితో వారు వైరస్‌ బారిన పడడమే కాక.. కుటుంబసభ్యులకు, చుట్టూ ఉండేవారికి వ్యాపించడానికి కారణమవుతున్నారు. ఏపీ, తెలంగాణల్లో ఇలా వ్యాక్సినేషన్‌ తర్వాత కరోనా బారిన పడినవారిలో చాలా మంది స్వల్పలక్షణాలతోనే బయటపడ్డారు. మిగిలిన తక్కువ మందిలో కొందరు ఆస్పత్రుల్లో చేరి చికిత్సతో ఇంటికి చేరుకున్నారు. మరికొందరు ఆక్సిజన్‌ సపోర్టు దాకా వెళ్లగా.. ఇంకొందరికి వెంటిలేటర్‌ చికిత్స అవసరమైంది. దురదృష్టవశాత్తూ అతికొద్దిమంది మాత్రం ప్రాణాలు కోల్పోయారు. వ్యాక్సిన్‌ ఒక్కొక్కరి శరీర తీరును బట్టి ఒక్కొక్కలా పనిచేయడమే ఈ మరణాలకు కారణం.


వయస్సు, కోమార్బిడిటీస్‌, సోకిన వేరియంట్‌, టీకా వేయించుకున్నాక ఎన్నాళ్లకు వైరస్‌ సోకింది.. ఇలా చాలా అంశాలు వ్యాక్సిన్‌ పనితీరుపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా.. 65 ఏళ్లు దాటినవారిలో టీకా రక్షణ దాదాపు 50శాతమే ఉంటోందని, యువతలో ఆ రక్షణ 89ు దాకా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మే 10న తెలిపినట్టు వైద్యులు గుర్తుచేస్తున్నారు. అలాగే కొత్త వేరియంట్లు కూడా రీఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయని వారు తెలిపారు. ఉదాహరణకు.. సెకండ్‌వేవ్‌లో ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపిన బి.1.617.2 వేరియంట్‌ చాలా తీవ్రమైందని.. ఇది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కూడా కనిపిస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. ఏప్రిల్‌ 15 తర్వాత ఏపీలో జీన్‌ సీక్వెన్సింగ్‌ చేసిన ప్రతి రెండో నమూనా ఈ వేరియంట్‌దిగానే తేలిందని.. ఇప్పుడు దక్షిణ తెలంగాణలో కూడా ఆ వేరియంట్‌ ప్రభావం ఎక్కువగా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వేరియంట్‌కు.. టీకా వల్ల కలిగే రక్షణను తప్పించుకోగల సామర్థ్యం ఉందని గుర్తుచేస్తున్నారు. పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లండ్‌ చేసిన ఒక అధ్యయనం ప్రకారం.. డెల్టా వేరియంట్‌పై సింగిల్‌ డోసు టీకా ప్రభావశీలత కేవలం 33% మాత్రమేనని తేలింది.


ఉన్న ఈ వేరియంట్లు చాలవన్నట్టు.. దేశవ్యాప్తంగా నిత్యం లక్షల మందికి సోకుతుండడం వల్ల వైర్‌సలో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. రెండు డోసుల టీకా తీసుకున్నా కూడా.. అలాంటి కొత్త వేరియంట్లకు ఎక్స్‌పోజ్‌ అయితే ఇన్ఫెక్షన్‌ బారిన పడే ప్రమాదం ఎక్కువ. అప్పుడూ టీకా వల్ల కొంత రక్షణ ఉంటుంది. కానీ.. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలం కన్నా, టీకా వల్ల వచ్చిన యాంటీబాడీల బలం కన్నా.. కొత్త వేరియంట్‌ బలం ఎక్కువైతే ఇన్ఫెక్షన్‌ తీవ్రమయ్యే ముప్పుంది.  


రకరకాల కారణాల వల్ల..

పిల్లలకు ఇచ్చే బీసీజీటీకా గుర్తుందా? చిన్నప్పుడే ఆ టీకా ఇచ్చినప్పటికీ కొందరిలో క్షయ వస్తుంది. దీనికి కారణం వారికి టీకా పూర్తి స్థాయిలో రక్షణ ఇవ్వకపోవడమే. బీసీజీ టీకానే కాదు.. కరోనా టీకా అయినా అంతే. ముఖ్యంగా.. మధుమేహం, అధిక రక్తపోటు, ఊపిరితిత్తుల జబ్బులు, హృద్రోగాలు, స్థూలకాయం, కాలేయ, మూత్రపిండ వ్యాధులు ఉన్నవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటివారు టీకా వేయించుకున్నా కొత్త వేరియంట్ల బారిన పడితే ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాక్సిన్‌ తీసుకున్న 15 రోజుల దాకా యాంటీబాడీలు అభివృద్ధి చెందవు. ఈలోగా వైరస్‌ బారిన పడితే ఇన్ఫెక్షన్‌ తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. ప్రాణాపాయ స్థితినీ ఎదుర్కోవాల్సి రావచ్చు. అలాగే, వ్యాక్సిన్లను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోయినా, తగు సమయంలో ఇవ్వకపోయినా నష్టం వ్యాక్సిన్‌ వేయించుకున్నవారికే.


కాబట్టి.. సమస్య ఏ రూపంలో అయినా రావచ్చని, అసలు రాకుండా ఉండాలంటే అప్రమత్తతే ముఖ్యమని హైదరాబాద్‌లోని ఛాతీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబూబ్‌ ఖాన్‌ సూచించారు. బయటకు వెళ్లినప్పుడు మనకు ఎదురొచ్చేవారిలో ఎవరికి ఏ కొత్త వేరియంట్‌ సోకిందో తెలియదు కాబట్టి భౌతిక దూరం పాటించడం, రద్దీ ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడం, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే డబుల్‌ మాస్కులు, శానిటైజర్‌ను వాడాలని  వైద్యులు సూచిస్తున్నారు.


తీవ్రతను తగ్గిస్తుంది.. టీకా తప్పనిసరి

వ్యాక్సిన్‌ సమర్థత 80 శాతం వరకు మాత్రమే. టీకా వేయించుకున్న వంద మందిలో 80 మందికి పనిచేస్తే మరో 20 మందిలో పనిచేయకపోవచ్చు. వంద మందిలో 50 మందికి బాగైనా ఉపయోగకరంగానే భావిస్తాం. కరోనా వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్‌ తీవ్రతను మాత్రమే వ్యాక్సిన్‌ తగ్గిస్తుంది. కొందరిలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఏ మందు/వ్యాక్సిన్‌ సంజీవని కాదు, అమృతం అంతకన్నా కాదు. కానీ.. వ్యాక్సిన్‌ తీసుకున్న వెయ్యి మందిలో అయిదారుగురు మాత్రమే ఐసీయూ వరకు వెళతారనేది వాస్తవం. అదే వ్యాక్సిన్‌ తీసుకోని వెయ్యి మందిలో 100 నుంచి 150 మంది వరకు ఐసీయూ దాకా వెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పక వ్యాక్సిన్‌ తీసుకోవాలి.

డాక్టర్‌ జగదీష్‌ కుమార్‌, జనరల్‌ ఫిజిషియన్‌, ఏఐజీ 

మావాళ్లందరూ సేఫ్‌

టీకా తర్వాత 2.6% మందికి కొవిడ్‌: అపోలో

అపోలో గ్రూపు ఆస్పత్రుల్లో రెండు డోసుల టీకా వేయించుకున్న ఆరోగ్య కార్యకర్తల్లో ఒక్కరు కూడా కొవిడ్‌తో చనిపోలేదని ఆ గ్రూపు జేఎండీ డాక్టర్‌ సంగీతా రెడ్డి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 269 మంది రిజిస్టర్డ్‌ వైద్యులు సెకండ్‌వేవ్‌లో కరోనాతో చనిపోయారని భారత వైద్య సమాఖ్య (ఐఎంఏ) మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అత్యధికంగా బిహార్‌లో 78 మంది, ఉత్తరప్రదేశ్‌లో 37 మంది, ఢిల్లీలో 29 మంది వైద్యులు చనిపోయినట్టు ఐఎంఏ వెల్లడించింది.


దీనిపై సంగీతా రెడ్డి స్పందించారు. మరణించిన వైద్యులకు సంతాపం తెలిపారు. అలాగే.. అపోలో ఆస్పత్రుల్లో రెండు డోసులూ వేయించుకున్న 3600 మంది వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తల్లో కేవలం 2.6 శాతం మంది మాత్రమే సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ వల్ల ఇన్ఫెక్షన్‌ బారిన పడ్డారని.. వారిలో ఒక్కరు కూడా చనిపోలేదని ఆమె పేర్కొన్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ఆంధ్రప్రదేశ్ Latest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.