Raeapteek: యూరప్‌లోనే అతిప్రాచీన ఫార్మసీ..

ABN , First Publish Date - 2022-07-13T21:12:45+05:30 IST

టౌన్ హాల్ ఫార్మసీ సుదీర్ఘ చరిత్రలో, చాలా మంది ఇక్కడ ఫార్మసిస్ట్‌లుగా పనిచేసారు. ఈ ఫార్మసీలో పది తరాల పాటు పనిచేసిన బుర్చార్ట్ కుటుంబానికి ప్రత్యేకమైన గౌరవం ఉంది. 1582 నుంచి 1911 సంవత్సరాలలో, బుర్చార్ట్ కుటుంబం ఫార్మసీకి పది తరాలకు పైగా సేవలందించింది.

Raeapteek: యూరప్‌లోనే అతిప్రాచీన ఫార్మసీ..

Tallinn నగరంలో ది రప్తీక్ (The Raeapteek) టౌన్ హాల్ ఫార్మసీ ఐరోపాలో అత్యంత పురాతనమైనదని తెలిసి అబ్బురమనిపించింది. దాని గురించి మన్ని వివరాలు తెలుసుకోవాలని వెదుక్కుంటూ మరీ వెళ్లాను. IT Professional గా అప్పుడప్పుడూ విదేశాలు వెళ్లి రావాల్సిన బాధ్యతలు ఉంటాయి నాకు. అలానే ఎస్టోనియా వెళ్ళాల్సి వచ్చింది. North Europe లో Estonia ఒక అందమైన దేశం (అధికారికంగా Republic of Estonia అని పిలుస్తారు). ఉత్తరాన గల్ఫ్ ఆఫ్ ఫిన్ లాండ్, పశ్చిమాన బాల్టిక్ సముద్రం (స్వీడన్), దక్షిణాన లాట్వియా, ఇంకా తూర్పున లేక్ పీపస్, రష్యా – ఆ దేశ సరిహద్దులు. అదంతా ద్వీపాలమయం. ఎస్టోనియాలో రెండు అతిపెద్ద నగరాల్లో ఒకటైన Tallinn, ఆ దేశ రాజధాని నగరం. 


అంత దూరం ఆత్రంగా వెళ్లింది ఒక ఫార్మసీ దుకాణం కోసమా అనుకోకండి; The Raeapteek ఐరోపా ఖండంలోనే అతి ప్రాచీనమైన మందుల దుకాణం. అది ఎప్పుడు మొదలయ్యిందో కచ్చితమైన తేదీలు తెలియకపోయినా, Raeapteek యాజమాన్యం చేతులు మారి మూడవ యజమాని హస్తగతం అయ్యింది మాత్రం 1422 లోనే. అలా అప్పుడు ఆ పట్టన దుకాణాల జాబితాలోకి ఎక్కిన Raeapteek, ఈ ఏడాదితో 600 ఏళ్లు పూర్తి చేసుకొని, ఇంకా కొనసాగుతోంది. 


ఏదైనా ప్రదేశాలకు వెళ్ళినపుడు అక్కడ మనల్ని ఆకర్షించే వాటిలో ఇలా పురాతనమైనవే ముందు వరుసలో ఉంటాయి. అలా నేను ఈ ఫార్మసీకి వెళ్లాను. టౌన్ హాల్ ఫార్మసీలో నన్ను చాలా విషయాలు ఆకర్షించాయి. టౌన్ హాల్ ఫార్మసీ సుదీర్ఘ చరిత్రలో, చాలా మంది ఇక్కడ ఫార్మసిస్ట్‌లుగా పనిచేసారు. ఈ ఫార్మసీలో పది తరాల పాటు పనిచేసిన బుర్చార్ట్ కుటుంబానికి ప్రత్యేకమైన గౌరవం ఉంది. 1582 నుంచి 1911 సంవత్సరాలలో, బుర్చార్ట్ కుటుంబం ఫార్మసీకి పది తరాలకు పైగా సేవలందించింది.


ఈ ఫార్మసీ పక్కన ఒక మ్యూజియం కూడా ఉంది, దీనిలో చరిత్రకు సంబంధించి మధ్యయుగ వైద్య పద్దతుల గురించి తెలుసుకోవచ్చు. ఈ ఫార్మసీ అండర్ గ్రౌండ్ లో వర్క్‌షాప్‌లు నిర్వహించేవారు. దీనిని సరిగ్గా ఎప్పుడు ప్రారంభించారో చరిత్రకారులు గుర్తించలేకపోయారు, అయితే అందుబాటులో ఉన్న పురాతన రికార్డుల ప్రకారం 1422లో Raeapteek ప్రారంభించారని చెపుతారు. ఇది దాని మూడవ యజమాని పేరు మీదనే ఇప్పటికీ ఉంది. కాకపోతే కొంతమంది పూర్వీకులు ఈ ఫార్మసీ 1415లో ప్రారంభించినట్టుగా చెపుతారు. 


జోహాన్ బర్చార్ట్ బోత్ బెలావరీ డి సైకావా అనే హంగేరియన్ వాసి. తన స్వస్థలమైన ప్రెస్‌బర్గ్ (ప్రస్తుత బ్రాటిస్లావా) నుండి టాలిన్‌కు మారాడు. అక్కడే ఫార్మసీ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుని సిటీ కౌన్సిల్ నుండి లీజును పొందాడు. ఆ తరువాత అతను తన వంశంలో ఈ ఫార్మసీ వ్యాపారాన్ని కొనసాగించాలనుకునే మొదటి కుమారుడికి "జోహాన్" అనే పేరు పెట్టుకోవాలనే కుటుంబ సంప్రదాయాన్ని మొదలు పెట్టాడు. 1843లో జోహాన్ పది బర్‌చార్ట్ ప్రకారం ఈ సంప్రదాయం ఈ కుటుంబంలో పదవ మొదటి కుమారుడు జన్మించడంతో 19వ శతాబ్దం చివరి వరకు ఎనిమిది తరాల పాటు కొనసాగింది. 


ఇదంతా వింటుంటే కాస్త చిత్రంగా ఉంది కదా.. అంతే కాదు..జోహాన్ బర్చార్ట్  వంశంలో అందరూ ఫార్మసిస్ట్‌లుగా మాత్రమే కాకుండా వైద్యులుగా కూడా కొనసాగారు. 


1710లో, టాలిన్ బ్లాక్ ప్లేగుతో నాశనమవుతున్న సమయంలో ఐదవ జోహాన్ బర్చార్ట్ తన వైద్య వృత్తిని ప్రారంభించాడు. గ్రేట్ నార్తర్న్ యుద్ధంలో టాలిన్ రష్యన్ సైన్యానికి లొంగిపోయినప్పుడు, అతను రష్యన్ సైన్యానికి ఔషధాలను అందించిన మొదటి వ్యక్తి. 1716 లో, అతను పట్టణ నావికా ఆసుపత్రి వైద్యుడిగా సేవలందించాడు. 


1802లో, ఎనిమిదో జోహాన్ బుర్‌చార్ట్ తను సేకరించిన వైద్య పరికరాలుతో ప్రైవేట్ మ్యూజియాన్ని "మోన్ ఫెయిబుల్" అని పిలిచారు. అతని సేకరించిన అనేక అంశాలు ఇప్పుడు ఎస్టోనియన్ హిస్టరీ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచుతున్నారు. ఎనిమిదో జోహాన్ 1802లో టాలిన్‌లో మొదటిసారి ప్రదర్శనకు ఉంచాడు. వారసత్వంగా ఫార్మసీని కొనసాగించే పద్దతి 1890లలో జోహాన్ పదో బుర్‌చార్ట్‌కు చెందిన చివరి వారసుడు మరణంతో ముగిసింది. 1911లో పదో జోహాన్ సోదరీమణులు ఆస్తిని C.R. లెబర్ట్‌కు విక్రయించడంతో, పది తరాల పాటు కొనసాగిన కుటుంబ వ్యాపారం అక్కడితో ముగిసింది.


1991 నుండి ఇప్పటివరకు

1990 తర్వాత, ఈ భవనం దాదాపు 50 సంవత్సరాల పాటు నిర్లక్ష్యానికి గురికావడంతో మొత్తం ఫార్మసీని మరమత్తులు చేసారు. ఈ పునర్నిర్మాణం 2003 వరకు 10 సంవత్సరాల పాటు కొనసాగింది. ప్రస్తుతం ఫార్మసీ  ప్రధాన భాగం మొదటి అంతస్తులో ఉంది. ఇది ఆస్పిరిన్‌తో సహా చాలా ఆధునిక ఔషధాలను విక్రయిస్తోంది.  గ్రౌండ్ ఫ్లోర్‌లో పురాతన వస్తువుల దుకాణం ఉంది.1999లో రెండవ అంతస్తులో "బాల్తసర్" అనే రెస్టారెంట్ ప్రారంభించారు.


మ్యూజియం సంగతులు..

మొదటి అంతస్తులో ఆధునిక ఫార్మసీకి సమీపంలో పాత వైద్య పరికరాలు, చారిత్రక రసాయన శాస్త్రవేత్త సాధనాలతో ఏర్పాటు చేసిన చిన్న మ్యూజియం ఉంది. దీని గోడపై ఏర్పాటు చేయబడిన, మ్యూజియంలో 1635 నాటి బుర్‌చార్ట్ కుటుంబానికి చెందిన పెద్ద రాతి కోట్ ఆఫ్ ఆర్మ్స్ కూడా ఉంది. ఇది కిరీటంతో పాటు లిల్లీల మధ్య గులాబీతో కూడిన గ్రిఫిన్‌ను చూపుతుంది. 


ఈ ఫార్మసీలో విక్రయించబడిన ఉత్పత్తులు...

మధ్యయుగ కాలంలో రోగులు చికిత్సల కోసం మమ్మీ జ్యూస్ (విదేశీ మమ్మీలను ద్రవంతో కలిపి తయారు చేసిన పొడి), కాలిన ముళ్లపందుల పొడి, కాలిన తేనెటీగలు, గబ్బిలం పొడి, పాము చర్మపు కషాయం యునికార్న్ కొమ్ము పొడిని కొనుగోలు చేసేవారు. 


ఇప్పుడు వానపాములు, స్వాలోస్ గూళ్ళు రకరకాల మూలికలు, స్పిరిట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. క్యాండీలు, కుకీలు, ప్రిజర్వ్‌లు, మార్జిపాన్, జెల్లీడ్ పీల్ లాంటి ఆహారాలను కూడా విక్రయిస్తున్నారు. "మోర్సెల్స్" అని పిలిచే స్పైసీ కుక్కీలు ఇక్కడి మరో ప్రత్యేకత.


ఫార్మసీ కాగితం, సిరా, సీలింగ్-మైనపు, రంగులు, గన్‌పౌడర్, గుళికలు, సుగంధ ద్రవ్యాలు, కొవ్వొత్తులు టార్చ్‌లను కూడా విక్రయించింది. పొగాకు ఐరోపాకు చివరికి ఎస్టోనియాకు తీసుకురాబడినప్పుడు, ఫార్మసీ వీటిని విక్రయించడంలోనే మొదటిదిగా నిలిచింది.


ఒక గ్లాసు క్లారెట్ (స్థానికంగా చక్కెర, మసాలా కలిపిన రైన్-వైన్) కూడా ఇక్కడ దొరుకుతుంది. అంతే కాదు ఈ టౌన్ హాల్ ఫార్మసీ వార్షిక ప్రాతిపదికన దాదాపు 400 లీటర్ల ఫ్రెంచ్ కాగ్నాక్‌ బ్రాందీని పన్ను లేకుండా దిగుమతి చేసుకునే అధికారాన్ని పొందింది.


ఇలా ఈ ఫార్మసీ గురించి తెలుసుకునే కొద్దీ ఏదో కొత్త విషయం తెలుస్తూనే ఉంది. ఇక్కడకు రావడం ఆశ్చర్యంగా, కూసింత గర్వంగా కూడా ఫీలవుతున్నాను. అతిప్రాచీనమైన ఈ ఔషధాల దుకాణంలో ఆనందపుగుళికలు దొరక్కపోవా! ఇంత దూరం వచ్చినందుకు ఆ అరుదైన ఔషధం కొనుక్కుపోకపోతే ఎలా అనిపించింది. 

IT Professional కిరణ్ కళ్యాణ్ చక్రవర్తి గుళ్లపూడి యాత్రాకథనం


Updated Date - 2022-07-13T21:12:45+05:30 IST