‘ఎ’ట్టా ఇచ్చారబ్బా!

ABN , First Publish Date - 2022-06-13T08:44:13+05:30 IST

‘ఎ’ట్టా ఇచ్చారబ్బా!

‘ఎ’ట్టా ఇచ్చారబ్బా!

బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు ‘ఏఏ’ రేటింగ్‌

ఇచ్చింది... ఇండియా రేటింగ్స్‌ సంస్థ

కంపెనీ చట్టం కింద ఏర్పడిన కార్పొరేషన్‌

నిర్వహణ చార్జీలు మాత్రమే ఆదాయం

జగన్‌ వచ్చాక అడ్డదారిలో ‘మళ్లింపు’

అయినా... ఇండియా ‘రేటింగ్స్‌’


అమరావతి, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): మద్యం వ్యాపారం చేసే బేవరేజెస్‌ కార్పొరేషన్‌! లిక్కర్‌ బాండ్లు జారీ చేసి రూ.8300 కోట్లు అప్పు తీసుకుంది. అందులో... రూ.5వేల కోట్లు ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) సొమ్ములే! ‘రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేయం’ అని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన తర్వాతే ఇదంతా జరిగింది. బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు ఇండియా రేటింగ్స్‌ సంస్థ ‘ఏఏ’ రేటింగ్‌ ఇవ్వడమే ఇందులో కీలకం! అసలు ‘ఏ రేటింగ్‌’కూ అర్హత లేని సంస్థకు ఏకంగా ‘ఏఏ’ రేటింగ్‌ ఎలా ఇచ్చారనేది ఆర్థిక నిపుణులకూ అంతుపట్టడంలేదు. ఎందుకంటే... బేవరేజెస్‌ కార్పొరేషన్‌ కంపెనీల చట్టం కింద ఏర్పాటైంది. రాష్ట్రం తరఫున మద్యం వ్యాపారం నిర్వహిస్తుంది. దీనికి గాను ప్రభుత్వం నిర్వహణ చార్జీలు చెల్లించాలి. ఈ కార్పొరేషన్‌కు ప్రభుత్వ ఆస్తులు కూడా ఏమీ ఉండవు. కానీ... దొడ్డి దారిలో అప్పులు తెచ్చేందుకు వైసీపీ సర్కారు ‘కార్పొరేషన్‌’ స్వరూపాన్ని మార్చేసింది. మద్యం ఆదాయాన్ని రెండు ముక్కలు చేసి... ‘స్పెషల్‌ మార్జిన్‌’ పేరుతో బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు భారీగా మళ్లిస్తున్నారు. ఇది కూడా అప్పుల కోసమే! రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఖజానాకు చెందాల్సిన ఆదాయాన్ని ఇలా కార్పొరేషన్‌కు మళ్లిస్తున్నారు. దీనిపై హైకోర్టులో కేసు కూడా నడుస్తోంది. దీనికి సంబంధించి హైకోర్టు ప్రభుత్వానికి, బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ విషయాలు అందరికీ తెలుసు. అయినా సరే... బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు ఇండియా రేటింగ్స్‌ సంస్థ ‘ఏఏ’ రేటింగ్‌ ఇవ్వడం గమనార్హం. ‘‘ఇండియా రేటింగ్స్‌ సంస్థ ఎందుకు ఎలా ఏ నిర్ణయం తీసుకుంది? ఖజానాలో పడాల్సిన ఆదాయాన్ని రాజ్యాంగ విరుద్ధంగా కంపెనీల చట్టం ద్వారా ఏర్పడిన కార్పొరేషన్‌కు మళ్లించారు. మద్యనిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చి జగన్‌ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అదే మద్యం ఆదాయాన్ని వనరుగా చూపి అప్పులు తెస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకులు అప్పులు ఇవ్వడంలేదు. ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా దొడ్డిదారిలో అప్పులు తెచ్చుకుంటోందని అందరికీ తెలుసు. అయినప్పటికీ... ఇండియా రేటింగ్స్‌ సంస్థ బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు ‘ఏఏ’ రేటింగ్‌  ఇవ్వడం ఆశ్చర్యకరం’’ అని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

Updated Date - 2022-06-13T08:44:13+05:30 IST