BJPLP Leader: బీజేపీఎల్పీ నేత ఈటల!

ABN , First Publish Date - 2022-09-06T00:09:36+05:30 IST

ఈ నెల 6 నుంచి అసెంబ్లీ (Assembly) సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీజేపీ పక్ష నేత ఎవరు అన్న ప్రశ్న ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

BJPLP Leader: బీజేపీఎల్పీ నేత ఈటల!

హైదరాబాద్: ఈ నెల 6 నుంచి అసెంబ్లీ (Assembly) సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీజేపీ పక్ష నేత ఎవరు అన్న ప్రశ్న ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. బీజేఎల్పీ నేతగా కొనసాగిన రాజాసింగ్‌ (Raja Singh)ను పార్టీ జాతీయ నాయకత్వం సస్పెండ్‌ చేసింది. ఆయన్ను పార్టీ బాధ్యతల నుంచి తప్పించడమే కాక సస్పెండ్‌ (Suspended) చేస్తూ నిర్ణయం తీసుకుంది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఆయనను ఆదేశించింది. ఆయన ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వివరణ ఇచ్చేందుకు కొంత సమయం ఇవ్వాలని రాజాసింగ్ సతీమణి బీజేపీ క్రమశిక్షణా కమిటీకి లేఖ రాశారు. రాజాసింగ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ (PD Act) పెట్టారు. అందువల్ల ఆయనకు ఇప్పుడే బెయిల్ వచ్చే అవకాశం లేదు. అందువల్ల పార్టీ పక్ష నేతను ఎన్నుకునేందుకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీజేపీ నుంచి రాజాసింగ్ మాత్రమే గెలిచారు. అసెంబ్లీ బీజేపీ సభ్యుడు రాజాసింగ్ కాబట్టి ఎలాంటి పోటీ లేకుండా ఆయననే పార్టీపక్ష నేత బీజేపీ నేతలు ఎన్నుకున్నారు. ఆ తర్వాత రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ సభ్యుల అసెంబ్లీలో సంఖ్య పెరిగింది. అయితే ఇక్కడి నుంచే అసలు కథ మొదలైందని అంటున్నారు. దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రఘునందన్‌రావు (Raghunandan Rao) అసెంబ్లీలో అడుగుపెట్టారు. రఘునందన్ రావు న్యాయవాదిగా ఉద్యమకారుడిగా సుదీర్ఘ అనుభవం ఉంది. అందువల్ల శాసనసభాపక్ష నేతగా కావాలని అనుకుని ఉండి ఉంటారు.



ఆ మధ్య ఆయన పార్టీ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం అందరినీ కూర్చోబెట్టి సర్థిచెప్పిందని ప్రచారం జరిగింది. రఘునందన్ సమస్యను సెటిల్ చేసిన వెంటనే హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఈటల రాజేందర్ (Etala Rajender) అసెంబ్లీకి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీఆర్‌ఎస్ శాసససభాపక్ష నేతగా ఈటల రాజేందర్ పనిచేశారు. విద్యార్థి దశ నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ఆయన గొప్ప పాత్రను పోషించారు. 2014లో టీఆర్‌ఎస్ (TRS) అధికారంలోకి వచ్చాక ఈటలను ఆర్థికశాఖామంత్రిని చేశారు. రెండోసారి ఆరోగ్యశాఖామంత్రిగా నియమించారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ రాజేందర్‌‌పై అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. ఆయనపై పెట్టిన కేసులు విచారణ.. పార్టీ నుంచి బహిష్కరించడం అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. అంతేవేగంగా రాజేందర్ బీజేపీలో చేరారు. హుజూరాబాద్ (Huzurabad) నుంచి మరోసారి ఎమ్మల్యేగా గెలిచారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఈటల పార్టీలో బండి సంజయ్ నాయకత్వంలో అసెంబ్లీలో రాజాసింగ్ నాయకత్వంలో పనిచేయాల్సి వస్తోంది. 



రాష్ట్ర నాయకత్వంలో ఆయనకు చోటు కల్పిస్తే ఆయన స్థాయిని దిగజార్చినట్లు అవుతుందని జాతీయ స్థాయిలో స్థానం కల్పించారు. జాతీయ నేత అయినప్పటికీ అసెంబ్లీలో మాత్రం రాజాసింగ్ కిందే పనిచేయాలి. మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komati Reddy Rajagopal Reddy)ని గెలిపించుకుని అసెంబ్లీకి పంపాలని బీజేపీ నేతలు అనుకుంటున్నారు. రఘునందన్, ఈటల రాజేందర్, రాజగోపాల్‌రెడ్డి ఈ ముగ్గురు రాజాసింగ్ నాయకత్వంలో పనిచేయాలి. ఈ ముగ్గురు ఎవరికి వారు హేమాహేమిలే. అందువల్ల వీళ్లు రాజాసింగ్‌ కింద పనిచేస్తే ఎలాంటి మెసేజ్ పోతుందోనని బీజేపీ నేతలు కొన్నాళ్లుగా ఆందోళనలో ఉన్నారు. పైగా రాజాసింగ్‌ ఇప్పటికీ తెలుగు భాషాను స్పష్టంగా మాట్లాడలేరు. ఇది కూడా ఓ మైనస్సే. రాజాసింగ్‌కు బీజేపీతో సంబంధం లేకుండా సొంతంగా గెలిచే సత్తా ఉంది. అందువల్ల ఆయనను తప్పించే అవకాశం లేదు. 



ఇలా ఆందోళనలో ఉన్న బీజేపీ నేతలకు ఆయన వ్యాఖ్యలను ఆధారం చేసుకుని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్‌పై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ ఆదేశించింది. ఓ సందర్బంలో రాజాసింగ్ మాట్లాడుతూ తనను బీజేపీ వదులుకోదని చెప్పారు. కాబట్టి బీజేపీ ఆయనను ఎంతమాత్రం వదులుకోదని చెబుతున్నారు. బీజేపీ ఒకటి తలిస్తే తెలంగాణ ప్రభుత్వం రాజాసింగ్‌పై పీడీయాక్ట్ పెట్టింది. అందువల్ల ఆయన బెయిల్‌పై ఇప్పట్లో విడుదలయ్యే అవకాశాల్లేవు. ఈ కారణంతో బీజేపీ ఎవరినీ నొప్పించకుండా ఈటల రాజేందర్‌ను బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునే అవకాశం వచ్చింది. ఒకవేళ రాజాసింగ్ సంజాయిషీకి బీజేపీ అధిష్టానం మెత్తపడితే రాజాసింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతారు. ఈ అసెంబ్లీ సమావేశాల వరకు బీజేపీ శాసనసభాపక్ష నేతపై యధాతథాస్థితిని కొనసాగించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

Updated Date - 2022-09-06T00:09:36+05:30 IST