ఎస్సై వేధిస్తున్నారంటూ పురుగుల మందుతో ఎస్పీ కార్యాలయానికి..

ABN , First Publish Date - 2021-07-27T08:25:44+05:30 IST

భూమి వ్యవహారం విషయంలో ఎస్సై జోక్యం చేసుకుని.. దుర్భాషలాడుతున్నారని, తమకు ఆత్మహత్యే శరణ్యమంటూ ఓ రైతు..

ఎస్సై వేధిస్తున్నారంటూ పురుగుల మందుతో ఎస్పీ కార్యాలయానికి..

సోదరులతో కలిసి గద్వాలలో ఆందోళనకు దిగిన రైతు

గద్వాల క్రైం, జూలై 26: భూమి వ్యవహారం విషయంలో ఎస్సై జోక్యం చేసుకుని.. దుర్భాషలాడుతున్నారని, తమకు ఆత్మహత్యే శరణ్యమంటూ ఓ రైతు.. తన సోదరులతో కలిసి సోమవారం గద్వాల ఎస్పీ కార్యాలయం ఎదుట పురుగుల మందుతో ఆందోళనకు దిగాడు. జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్‌ మండలం మద్దెలబండకు చెందిన బాధిత రైతు ఈరన్న మాట్లాడుతూ.. తమ భూమిని రాములు నాయక్‌ అనే వ్యక్తి కబ్జా చేశాడని ఆరోపించాడు. దీనిపై ఏడుసార్లు ఎస్పీకి, మార్చిలో సీఎం కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. తాజాగా మల్దకల్‌ ఎస్సై శేఖర్‌ జోక్యం చేసుకుంటూ పొలం నీది కాదని, ఎందుకు నీవు వస్తున్నావని దుర్భాషలాడుతూ దాడి చేస్తున్నారని తెలిపాడు. పశువులకు కాపలా ఉంచిన బాలుడిని విచక్షణారహితంగా కొట్టారని ఆరోపించాడు. అనంతరం వీరన్న నుంచి ప్రజావాణిలో ఎస్పీ వినతిపత్రం తీసుకున్నారు. విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు. కాగా, ఈరన్న కుటుంబ సభ్యులపై తాను దాడి చేయలేదని ఎస్సై శేఖర్‌ ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు.

Updated Date - 2021-07-27T08:25:44+05:30 IST