Abn logo
May 23 2020 @ 05:54AM

ప్రాణం ఖరీదు!

జాతస్యహి ధ్రువో మృత్యు!

పుట్టినవాడికి మరణం తప్పదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ ఉవాచ. పుట్టిన వాడు మరలా జన్మించక తప్పదు! అని కూడా చెప్పాడు. ఈలెక్కన... ‘చావు–పుట్టుకలు’ ఒక నిరంతర వలయం! ఇందులో... చావు మాత్రం కచ్చితంగా విలయమే! ఈ లెక్కలు తేల్చువాడు యమధర్మరాజు! ఆయన సమవర్తి. పర తమ భేధము లేకుండా సర్వులనూ తనతో తోడ్కొని పోవు వాడు! మరణం అందరి విషయంలో సమానమే కానీ... అందరి మరణాలూ సమానం కాదు. కొందరి ప్రాణాలు ఎక్కువా... మరికొందరి ప్రాణాలు తక్కువ! ఇంకొందరి ప్రాణాలకు అసలు గుర్తింపు ఉండదు సుమీ! ఎలా పోయాయో కూడా తెలియని అభాగ్యపు ప్రాణాలు ఇవి! ‘ప్రాణాలకు విలువ కట్టలేం’ అనేది అర్ధ సత్యమే! ఎందుకనగా... ‘కోటి రూపాయలు ఇస్తాను. నీ ప్రాణం ఇస్తావా’ అంటే ఎవ్వరూ ఇవ్వరు! ఎందుకంటే, ప్రాణాలకు వెల కట్టలేం! కానీ... పోయిన ప్రాణాలకు, పోవడానికిగల కారణాలను బట్టి ‘విలువ’ కట్టడం జరుగుతూనే ఉంది. మానవీయ భాషలో చెప్పాలంటే.... ఈ వెల పేరు పరిహారం. ఇందుకు తాజా ఉదాహరణ... విశాఖపట్నపు విషాదం! అక్కడ, విషవాయువు పీల్చి ఆయువు కోల్పోయిన వారికి ప్రభుత్వం వారు చెల్లించిన పరిహారపు రొక్కం అక్షరాలా 1 కోటి రూపాయలు. సరిగ్గా వారం తర్వాత ప్రకాశం జిల్లాలో ట్రాక్టర్‌ ప్రమాదంలో విద్యుదాఘాతంతో మృతిచెందిన వారికి ప్రకటించిన పరిహారం... ఐదు లక్షల రూపాయలు మాత్రమే! ఆనక దీనిని పది లక్షలకు పెంచారు. మరి విశాఖ వారివే ప్రాణాలా, ప్రకాశం వారివో, మరొకరివో కావా! అనే ప్రశ్నకు తావిక్కడ లేదు. ఎందుకనగా, విశాఖలో ఖరీదైన పరిశ్రమ వల్ల మరణించిన వారూ... ప్రకాశంలో సాధారణ ట్రాక్టర్‌ కారణంగా మరణించినవారూ ఒక్కటెలా అవుతారు? కాదుగాక కాదు! రకరకాల మరణాలకు రకరకాల పరిహారాలు చెల్లించడం ఈనాటిది కాదు కదా! విమాన ప్రమాదంలో మరణిస్తే ఒకరకం... రైలు ప్రమాదంలో చనిపోతే మరోరకం... ఆర్టీసీ బస్సు వల్ల చనిపోతే ఇంకో రకం! అదేదీ కాకుండా ఖర్మకాలి కారో, బైకో ప్రమాదానికి గురై చనిపోతే.... అంతే సంగతులు! రోడ్డు ప్రమాదమంత ‘అకాల–అకారణ’ మరణం మరొకటి ఉండదు. మన దేశంలో సగటున ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు చొప్పున రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. రోజుకు దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరీ అన్యాయం కదా! అకారణమైన ఈ అకాల మరణాల వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయో!


మరణానికి ఒక మంచి ‘కారణం’ ఉండాలి మరి! ఈ మధ్య ఉత్తర కశ్మీర్‌లోని హంద్వారాలో ఇంట్లో నక్కిన ఇద్దరు ఉగ్రవాదుల నుంచి పౌరులను కాపాడే క్రమంలో... ఒక మేజర్‌తోసహా ఐదుగురు ఆర్మీ అధికారులు మరణించారు. ‘మనం ప్రమాదంలో ఇరుక్కోవడం ఎందుకు! పది గ్రనేడ్లు గురి చూసి విసిరితే సరిపోతుంది’ అనుకుంటే... ఉగ్రవాదులతోపాటు పౌరులూ మరణించేవారు. జవాన్లు బతికేవారు. కానీ... వాళ్లు అలా చేయలేదే! ఈ ఎన్‌కౌంటర్‌ తర్వాత పౌరుల కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. అమరులైన సైనికుల కుటుంబాల రోదనా చిత్రాలు అందరినీ కలచి వేశాయి. ‘ప్రాణ’త్యాగం అంటే ఇదే కాబోలు! ‘విలువ’ విషయానికొస్తే... సుశిక్షితులైన ఐదుగురు సైనికుల ప్రాణాలు విలువైనవా? పలువురు సాధారణ పౌరుల ప్రాణాలు విలువైనవా? ఇది మరీ క్రూరమైన లేదా చెత్త ప్రశ్న... అనిపిస్తోంది కదూ! ఇంకోమాట! ‘బీమా’ రూపంలో చాలామంది ఎవరి ప్రాణాలకు వారు స్వయంగా ‘వెల’ కడుతూనే ఉన్నారు కదా! తదనంతరం కుటుంబానికి లభించే ఆర్థిక భరోసా అది!


నిజం చెప్పాలంటే... ప్రాణాలకు ఒక్కో దేశంలో ఒక్కో విలువ. మనకు సరిగ్గా ఆవల ఉన్న అమెరికా అంటే తగని మోజు కదా! అక్కడి నుంచి వద్దాం! ‘మా ఒక్క పౌరుడి ప్రాణం మూడో ప్రపంచ దేశాలకు చెందిన పదిమంది పౌరుల ప్రాణాలతో సమానం’ అని అమెరికా వాళ్ల భావన. ఇందులో అహంకారమూ, అభిజాత్యమూ, ఆధిపత్య వైఖరీ సుస్పష్టం. అయితే, అమెరికాలో పౌరుల ప్రాణాలను అత్యంత జాగ్రత్తగా చూసుకోవడమూ నిజము. అక్కడెవరైనా ప్రమాదవశాత్తూ కారుతో ఢీకొట్టి పరుల ప్రాణాలు తీశాడంటే... అంతే సంగతులు! ఆ ఢీకొట్టిన వాడు ఇతర దేశాలకు చెందిన వలస ఉద్యోగి అయితే అంతే అంతే సంగతులు! పరిహారం చెల్లించేందుకు ఆస్తులు అమ్ముకోవాలి. దేశం వదిలి రావాలి. మరి మన దేశంలో! ప్రమాదవశాత్తూ ఎన్ని ప్రాణాలైనా తీయొచ్చు. రెండు రోజుల్లోనే బెయిలుపై బయటికి రావచ్చు. బండి చక్రం పట్టవచ్చు. మరి... తెల్లవారి ప్రాణాలకంటే, మన ప్రాణాల విలువ తక్కువని మనకు మనమే ఒప్పుకున్నట్లేనా? ఏమో!


ఏదిఏమైనా... పోయినోళ్లంతా మంచోళ్లు! వారిలో మంచిని మాత్రమే తలచుకుని, చెడును కనీసం ‘ఆ రోజుకు’ పక్కనపెట్టడం మన మానవ ధర్మం! చాలామంది గొప్పతనం వారి మరణం తర్వాతే తెలుస్తుంది. మరణించిన వారిని మోసుకెళ్లేది... ఆ నలుగురే! కానీ, ముందూ వెనుకా ఎంత మంది నడిచారన్న దానిని బట్టి చనిపోయిన వ్యక్తిది ఎంత ఘనమైన బతుకో అర్థమవుతుంది. ఆ తర్వాత... కర్మకాండలు, సంతర్పణలూ! అందుకే, ‘స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే బ్రదర్‌’ అని అన్నారు ఆచార్య ఆత్రేయ! ఆ ‘మనసు కవి’ ఒక మహానుభావుడు. కానీ... 2020లో కరోనా అనేది ఒకటి మనల్ని చుట్టుముట్టి, కట్టిపడేస్తుందని ఆయన ఊహించలేరు కదా! ఇప్పుడు పెళ్లినే పదిమందితో ‘మమ’ అనిపిస్తున్నారు. ఇక... చావు పెళ్లిలాంటిదెలా అవుతుంది! ఈ కరోనా కాలంలో సహజ మరణమూ శాపంగానే మారింది. తండ్రి మరణించినా రాష్ట్ర సరిహద్దులు దాటి రాలేని కుమారులు! ‘ఏదో ఒకలాగా కార్యక్రమం నడిపిద్దాం’ అనుకుంటున్న కుటుంబ సభ్యులు! ఏదో అమెరికాలోనో, ఆస్ట్రేలియాలోనో ఉన్నవారిలాగా వాట్సాప్‌ ఫొటోలో కడసారి చూపులు, వీడియో కాల్‌లో అంత్యక్రియలు చూడాల్సి రావడమేమిటి! ఈ సమయంలో రాజు–పేద తేడా లేదు. మరణానంతర క్రియలకు మరణయాతన పడుతున్న కాలమిది! ఒక వైద్యుడు జీవితాంతం ఐదూ పది రూపాయలకే పేద రోగులకు సేవలు అందించారు. కానీ, కరోనా కారణాన ఆయన మరణించినప్పుడు వెంట పదిమంది నడవలేకపోయారు. పైగా, ‘కరోనా వైరస్‌ వ్యాప్తికి కారకుడు’ అనే అపనింద! మరో డాక్టరుకు బలం, బలగం వేలలో ఉన్నా... ఏమి లాభమాయె! కుటుంబ సభ్యులు కడసారి చూపునకూ నోచుకోలేకపోయారు. ఏమీకాని వారెవరో ‘విధి’వశాత్తూ అంత్యక్రియలు జరపవలసి వచ్చింది. కలి కాలాన్ని మించినది కదా ఈ కరోనా కాలం! చంపేస్తోంది! బతికున్న వాళ్లకు చచ్చేంత కష్టం తెచ్చిపెట్టింది. అసలే కరోనాతో భయపడుతుంటే... ఈ చల్లగా ఈ చావు కబుర్లు ఏమిటో! ఆపేసే ముందు ఒక్కమాట! ప్రాణం విలువైనది. దానిని కాపాడుకుందాం! లేకుంటే... దానికి వెల కట్టేస్తారు!


తొమ్మండ్రు సురేష్‌ కుమార్‌

Advertisement
Advertisement
Advertisement