యుగపురుషుడు NTR.. రజనీకాంత్ జీవితాన్నే మార్చేసిన సలహా

ABN , First Publish Date - 2022-05-28T08:24:44+05:30 IST

తమిళ చిత్రరంగ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమాల్లోకి రాకముందు ఎన్టీఆర్‌కు వీరాభిమాని. కండెక్టర్‌గా పనిచేసే రోజుల్లో..

యుగపురుషుడు NTR.. రజనీకాంత్ జీవితాన్నే మార్చేసిన సలహా

ఒంగోలు: తెలుగు ప్రజల ఇంటి గోడల మీద ఇలవేల్పుగా, గుండెల్లో తెర వేల్పుగా నిల్చిన వ్యక్తి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు. ‘తెలుగు’ అనే పదం ఉన్నంతవరకూ జాతి జనుల మీద చెరగని ముద్ర ఆయనది. ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరులో పుట్టిన ఒక సాధారణ రైతు బిడ్డ అసామాన్య శక్తిగా, తిరుగులేని ఏలికగా ఎదిగి మహోన్నత శిఖరాలు అధిరోహించిన వైనం అద్భుతం, అనన్య సామాన్యం. తెలుగు టాకీ పుట్టడానికి ఎనిమిదేళ్ల ముందు ఎన్టీఆర్‌ జన్మించారు. తెలుగు సినిమా వయసు సంతరించుకుంటున్న దశలో పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన దాని వ్యాప్తికి ఎంతగా కృషి చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేసినా, నాయక, ప్రతినాయక పాత్రలను పోషించినా, యువకుడి నుంచి వృద్ధుడి వరకూ ఏ పాత్ర చేసినా.. వేర్వేరు నటులు పోషించారా అనే రీతిలో అభినయాన్ని ప్రదర్శించడం ఎన్టీఆర్‌కే చెల్లింది. ముందు తరాలకు నిరంతర ఆదర్శప్రాయునిగా నిలిచిన ఎన్టీఆర్‌ సినీ జీవితచిత్రంలోని కొన్ని రీళ్లు..


మరిచిపోలేని పాత్రలు..

తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్టీఆర్‌ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సాంఘిక, పౌరాణిక, చారిత్రక, జానపద చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ఎప్పటికీ మరిచిపోలేనివి. ‘అడవి రాముడు’, ‘యమగోల’, ‘సర్దార్‌ పాపారాయుడు’, ‘వేటగాడు’, ‘జస్టిస్‌ చౌదరి’, ‘బొబ్బిలి పులి’ వంటి సోషల్‌ హిట్స్‌, ‘లవకుశ’, ‘మాయాబజార్‌’, ‘శ్రీకృష్ణపాండవీయం’, ‘దానవీర శూరకర్ణ’ వంటి ఫోక్‌లోర్‌ హిట్స్‌, ‘మహామంత్రి తిమ్మరుసు’, ‘బొబ్బిలి యుద్ధం’ వంటి హిస్టారికల్‌ హిట్స్‌, ‘పాతాళభైరవి’. ‘చిక్కడు దొరకడు’, ‘అగ్గిపిడుగు’ వంటి ఫోక్‌లోర్‌ హిట్స్‌.. ఇలా అన్ని రకాల చిత్రాల్లో నటించి ఎదురులేని కథానాయకుడు అనిపించుకున్నారు ఎన్టీఆర్‌. ఆయన రాముడు వేషం వేశారు, రావణుడిగానూ నటించారు. శ్రీకృష్ణుడి వేషం వేశారు, దుర్యోధనుడిగానూ మెప్పించారు. ‘ప్రతినాయకుడు’ అనే పదం కనిపెట్టింది ఎన్టీఆరే. కాకపోతే పౌరాణిక పాత్రల మీద మక్కువతో ఎన్టీఆర్‌ పురాణాలకు కాస్త పక్కకు వెళ్లారనే విమర్శ కూడా లేకపోలేదు. అయితే, ఆయా పాత్రల మానసిక సంచలనాన్ని ఆవిష్కరించాలంటే ఆ మాత్రం చొరవ తీసుకోక తప్పదని అనేవారు ఎన్టీఆర్‌.


పారితోషికం ఎంతంటే..

తొలి చిత్రం ‘మనదేశం’లో ఎన్టీఆర్‌ తీసుకున్న పారితోషికం రెండు వందల రూపాయలు. ఆ తర్వాత నటుడిగా డిమాండ్‌ పెరగడంతో పారితోషికం కూడా పెరిగింది. అగ్ర కథానాయకుడిగా ఎదిగినా కూడా 22 ఏళ్ల పాటు ఆయన పారితోషికం వేలల్లోనే ఉండేది. నిర్మాతలకు నిర్మాణ వ్యయం తగ్గించడానికి ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ పారితోషికాలు పెంచేవారు కాదు. 1972 నుంచి సినిమాకు లక్ష రూపాయలు తీసుకోవడం ప్రారంభించారు ఎన్టీఆర్‌. ‘మేజర్‌ చంద్రకాంత్‌’ చిత్రంలో కోటి  రూపాయల పారితోషికం తీసుకుని అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా రికార్డ్‌ నెలకొల్పారు. 300 చిత్రాల్లో దాదాపు 700 పాత్రలను పోషించారు ఎన్టీఆర్‌. ఆ పాత్రలన్నీ తనని ప్రజల దగ్గరకు తీసుకెళ్లడంతో  ప్రతి పాత్రా తనకు ప్రత్యేకం అనేవారు ఎన్టీఆర్‌. - చిత్రజ్యోతి డెస్క్‌


రజనీకాంత్‌ జీవితాన్ని మార్చిన సలహా..

తమిళ చిత్రరంగ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమాల్లోకి రాకముందు ఎన్టీఆర్‌కు వీరాభిమాని. కండెక్టర్‌గా పనిచేసే రోజుల్లో ఒకసారి స్టాఫ్‌ అంతా కలసి ఒక పౌరాణిక నాటకం ప్రదర్శించారు. అందులో దుర్యోధనుడి వేషం రజనీది. ఇందుకోసం ఎన్టీఆర్‌ ‘శ్రీకృష్ణ పాండవీయం’ చిత్రం చూసి అందులో ఎన్టీఆర్‌ ఎలా నటించారో తను అలాగే చేయడానికి రజనీ ప్రయత్నించారు. ఆ నాటక ప్రదర్శన విజయవంతం కావడంతో సినిమాల్లో ప్రయత్నించమని అందరూ సలహా ఇచ్చారు. అలా రజనీ సినీరంగ ప్రవేశం జరిగింది. తన అభిమాన నటుడు ఎన్టీఆర్‌తో కలసి ‘టైగర్‌’ అనే చిత్రంలో నటించారు రజనీకాంత్‌. ఆ సమయంలో ఆయన తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉండేవారు. అటు సినిమాలు, ఇటు తన అలవాట్లు.. రెండింటినీ బ్యాలెన్స్‌ చేయలేక తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యేవారు రజనీకాంత్‌. ఎన్టీఆర్‌ ఇది గమనించి, ‘బ్రదర్‌.. తెల్లారి మూడున్నర గంటల నుంచి నాలుగు గంటల మధ్య సమయాన్ని బ్రహ్మకాలం అంటారు. ఆ సమయంలో నువ్వు ప్రాణాయామం చేస్తే పూర్తిగా కోలుకుంటావు’ అని సలహా ఇచ్చారు. కొంతకాలం ఆయన చెప్పినట్లే చేయడంతో రజనీకాంత్‌ మామూలు మనిషి అయ్యారు. 


అద్భుత జ్ఞాపకశక్తి..

ఎన్టీఆర్‌కు అద్భుత జ్ఞాపక శక్తి ఉండేది. ఒకటికి నాలుగు సార్లు చదివితే ఎంత పెద్ద డైలాగ్‌ అయినా ఆయనకు కంఠతా వచ్చేది. హీరోలకు సొంత కుర్చీలు, పర్సనల్‌ అసిస్టెంట్స్‌ అనే సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది ఎన్టీఆరే. ఆయనకంటే ముందు ఆయన కుర్చీ సెట్‌లోకి వచ్చేది. దాని మీద ఎన్టీఆర్‌ పేరు అందంగా డిజైన్‌ చేసి ఉండేది.  


అన్నదమ్ముల అనుబంధం..

ఆ రామలక్ష్మణులు ఎలా ఉండేవారో జనం ఎరుగరు కానీ, ఎంతో అన్యోన్యంగా మెలిగిన నందమూరి సోదరులు రామారావు, త్రివిక్రమరావులను చూసి అందరూ మురిసిపోయేవారు. ఆ రామలక్ష్మణులు వీరేనని నమ్మేవారు. రామారావు కంటే త్రివిక్రమరావు మూడేళ్లు చిన్న. తమ్ముడంటే ఎన్టీఆర్‌కు ప్రాణం. అలాగే అన్నయ్య అంటే త్రివిక్రమరావుకు అంతులేని అభిమానం. ఆలోచన ఒకరిది, ఆచరణ మరొకరిది అన్నట్లుగా మెలిగేవారు. ఎన్టీఆర్‌ బీఏ చదివారు. కానీ, త్రివిక్రమరావుకు చదువు అబ్బలేదు. చదువును అశ్రద్ధ చేయవద్దని, బాగా చదువుకుంటేనే మంచి భవిష్యత్‌ ఉంటుందని తమ్ముడితో రామారావు తరచూ చెబుతుండేవారు. అయినాసరే చదువు తప్ప మిగిలిన అన్ని విషయాల్లో త్రివిక్రమరావు ముందుండేవారు. అన్నగారికి సినిమాల్లో ఛాన్స్‌ వచ్చినప్పుడు వెళ్లాలా, వద్దా అనే మీమాంసలో ఉన్నప్పుడు వెళ్లమని ప్రోత్సహించింది త్రివిక్రమరావే. అంతేకాదు పరిశ్రమకు వచ్చిన తొలి రోజుల్లో ఎన్టీఆర్‌కు వేషాల వేటలో నిరుత్సాహం కలిగినప్పుడు ఆయనకు నైతిక బలం ఇచ్చింది కూడా తమ్ముడే! సంపాదన లేని త్రివిక్రమరావుకు పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకురాని తరుణంలో ఆస్తిలో తన వంతు వాటాను కూడా తమ్ముడికే రాసిచ్చిన ఎన్టీఆర్‌ ఔన్నత్యాన్ని ఆ రోజుల్లో గొప్పగా చెప్పుకొనేవారు. అంతేకాదు తను సంపాదనాపరుడైన తర్వాత తన కుటుంబానికి ఎంత ఖర్చు పెట్టేవారో, తమ్ముడి కుటుంబానికి కూడా అంతే ఖర్చు పెట్టేవారు ఎన్టీఆర్‌. తన 73వ ఏటా 1996లో కన్ను మూశారు. త్రివిక్రమరావు కూడా తన 73 వ ఏట 1998 సెప్టెంబర్‌ 13న మరణించారు.

Updated Date - 2022-05-28T08:24:44+05:30 IST