ఇంత నిర్లక్ష్యమా..!?

ABN , First Publish Date - 2022-07-31T06:17:59+05:30 IST

ఇంత నిర్లక్ష్యమా..!?

ఇంత నిర్లక్ష్యమా..!?
మహబూబాబాద్‌ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల హాస్టల్‌లో పడవేసిన కిచిడి, గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల హాస్టల్‌లో మరుగుదొడ్ల వద్ద అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలు

విద్యార్థినులు అస్వస్థతకు గురైనా మారని సిబ్బంది తీరు

మానుకోట గిరిజన బాలికల ఆశ్రమ హాస్టల్‌లో అంతా అపరిశుభ్రం

ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం 

ఈగలు, దోమల  స్వైరవిహారం  

అధ్వానంగా మరుగుదొడ్లు 

కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ


మహబూబాబాద్‌ టౌన్‌, జూలై 30 : గురుకుల పాఠశాల లు, కళాశాలు, హాస్టళ్లల్లో నిత్యం ఏదో ఓ చోట విద్యార్థులు కలు షిత ఆహారం తిని అస్వస్థతకు గురవుతున్నారు. అపరిశుభ్రత,  పర్యవేక్షణ లేక, ఉన్నతాధికారుల నిర్లక్షం వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ ఘటనలు ఏదో ఒక్కచోట జరుగుతున్నా.. పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ క్రమంలోనే మానుకోట జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల హాస్టల్‌లో విద్యార్థులు కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురైన ఘటన వెలుగు చూసినా అధికారులు, సిబ్బంది తీరులో మార్పు కన్పించడం లేదు. 


ఐదు రోజుల వ్యవధిలోనే మహబూబాబాద్‌ జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 16 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఐనప్పటికి మానుకోట జిల్లా కేంద్రంలో గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల హాస్టల్‌లో ఎక్కడా పడితే అక్కడ చెత్త దర్శనమిస్తూ ఈగలు వ్యాప్తి చెందుతూ తినుబండరాలపై వాలుతున్నాయి. ఈనెల 27న గూడూరు మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని ఏడుగురు విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా, ఆ సంఘటనకు వార్డెన్‌ ఈసం స్వామిని బాధ్యుడిని చేస్తూ సస్పెన్షన్‌ వేటు వేశారు. 


తాజాగా మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 10 మంది విద్యార్థినులు  అస్వస్థతకు గురయ్యారు. గురువారం మధ్యాహ్నం అందించే మెనూలో భాగంగా పప్పు, పాలకుర వంటచేయగా పాలకూర ఆకులో వానపాములు ఉన్న విషయాన్ని గమనించని సంక్షేమ హాస్టల్‌ సిబ్బంది వండిన వంటను విద్యార్థినులకు వడ్డించారు. అదే రాత్రి ముగ్గురు విద్యార్థినులు, శుక్రవారం ఉదయం మరో ఏడుగురు విద్యార్థినులు వెరసీ 10 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని జిల్లా ఆస్పత్రికి తరలించి, చికిత్సనందించారు. అదేరోజు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సదరు పాఠశాలలను సందర్శించి ఘటనపై ఆరాతీసి ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా చూడాలని సూచించారు. మరోపక్క రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ ఘటనపై ఆరాతీసి ప్రత్యేక అధికారిని నియమించి విచారణకు ఆదేశాలిచ్చారు. అయినా శనివారం యథారాజా తదాప్రజా అన్న చందంగా పాఠశాల ఆవరణలోని హాస్టల్‌ ప్రాంగణమంతా అపరిశుభ్రంగానే కన్పించిది. 


అపరిశుభ్రంగా హాస్టల్‌..

మహబూబాబాద్‌ పట్టణంలో ఉన్న గిరిజన బాలికల ఆశ్రమ హాస్టల్‌లో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. శనివారం మెనూలో భాగంగా ఉదయం టిఫిన్‌లో కిచిడి (పబ్బియ్యం) చేశారు. విద్యార్థినులకు వడ్డించిన తర్వాత మిగిలిన దానిని మరుగుదొడ్ల సమీపంలో పడవేయడంతో దానిపై ఈగలు వాలుతున్నాయి. ఇక మరుగుదొడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. చెత్తాచెదారంతో అక్కడ ఈగలు, దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. వంటగది, డైనింగ్‌ హాల్‌లో కూడ పరిశుభ్రత కొరవడింది. సంక్షేమ హాస్టల్‌ ఆవరణలో చెత్తాచెదారం, మురికినీరు నిలిచి, అపరిశుభ్రంగా ఉంది. 


రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌, జిల్లా కలెక్టర్‌ శశాంక సందర్శనకు ముందు శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో హాస్టల్‌ ఆవరణను శుభ్రం చేస్తున్నారంటే అధికారులు, సిబ్బంది పనితీరు ఏవిధంగా ఉందో అర్థమవుతోంది. తాము చెప్పినా సిబ్బంది, అధికారులు పట్టించుకోకుండా పెడచెవిన పెడుతున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయన్న వాదనలు వినవస్తున్నాయి. నిత్యం సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలను సందర్శిస్తే కొంత మేరకు కిందిస్థాయి సిబ్బంది నిబద్ధతో పనిచేసే అవకాశాలుంటాయని పలువురు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, హాస్టల్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Updated Date - 2022-07-31T06:17:59+05:30 IST