Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 18 Jan 2022 11:28:38 IST

ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి..!

twitter-iconwatsapp-iconfb-icon
ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి..!

ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల నియంత్రణ,

ఇంగ్లిష్‌ మీడియంలో బోధనపై కొత్త చట్టం

అధ్యయనానికి సబిత అధ్యక్షతన సబ్‌కమిటీ

వచ్చే శాసనసభ సమావేశాల్లోనే బిల్లు

7,289 కోట్లతో ‘మన ఊరు-మన బడి’ 

రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు

ధాన్యం కొనుగోలు కేంద్రాల కొనసాగింపు

అటవీ యూనివర్సిటీ, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు

జలవనరుల శాఖలో వివిధ పనులకు నిధులు

సంగమేశ్వర, బసవేశ్వర నిధులకు కార్పొరేషన్‌

మంత్రిమండలి సమావేశంలో నిర్ణయాలు 

రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులోనే ఉంది

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం: హరీశ్‌

వ్యాక్సినేషన్‌ను త్వరగా పూర్తి చేయాలి: సీఎం


హైదరాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాబోధనతోపాటు ప్రైవేటు స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకుగాను కొత్త చట్టాన్ని తీసుకురావాలని తీర్మానించింది. ఈ రెండు అంశాలపై పూర్తి అధ్యయనం చేసి, విధివిధానాలు రూపొందించేందుకు క్యాబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, నిరంజన్‌రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, జగదీశ్‌రెడ్డి, హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కేటీఆర్‌లు సభ్యులుగా ఉంటారు. రానున్న శాసనసభ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందనున్నారు.


ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమావేశమైన మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమై రాత్రి 11.30 వరకు తొమ్మిది గంటలపాటు సుదీర్ఘంగా సాగిన క్యాబినెట్‌ భేటీలో.. కరోనా వ్యాప్తి, సాగునీరు, విద్య, అకాల వర్షాలతో పంటనష్టం, ధాన్యం కొనుగోళ్లు, అటవీ శాఖలో ఉద్యోగాల రిజర్వేషన్లు, మహిళా యూనివర్సిటీ ఏర్పాటు, సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు నిధుల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలంటూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన ప్రతిపాదనను కేబినెట్‌ ఆమోదించింది. తదుపరి క్యాబినెట్‌ భేటీ నాటికి పూర్తి స్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

ఇంగ్లిషు మీడియంకు డిమాండ్‌ పెరుగుతున్నందునే..

ఇప్పటికే తెలంగాణ గురుకులాలు అద్భుతమైన ఫలితాలు అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచాయని, గ్రామ స్థాయి నుంచి విద్యార్థులు గురుకులాల్లో చేరుతున్నారని క్యాబినెట్‌ అభిప్రాయపడింది. రాష్ట్రంలో వ్యవసాయం తదితర అనుబంధ రంగాలు బలోపేతం కావడం, తద్వారా గ్రామీణ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడంతో పల్లెల్లోని తల్లిదండ్రుల్లో తమ పిల్లల విద్య, భవిష్యత్తు పట్ల ఆలోచన పెరిగిందని గుర్తించింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఇంగ్లిషు విద్యా బోధనకు డిమాండ్‌ పెరుగుతోందని, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం అనివార్యత ఏర్పడిందని మంత్రివర్గం భావించింది. గ్రామాల్లో ప్రభుత్వమే ఇంగ్లిషు మీడియంలో విద్యా బోధన చేపడితే స్థానిక పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు సంసిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఇంగ్లిషు మీడియంలో విద్యా బోధన చేపట్టాలని, అందుకోసం అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించింది.


విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో ఇంగ్లిషు మీడియంలో బోధన కోసం టీచర్లకు తర్ఫీదునివ్వడం, విద్యాలయాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం, విద్యార్థుల్లో ఉత్సాహం కలిగించేలా క్రీడామైదానాలు తదితర వసతులు ఏర్పాటు చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, మధ్యాహ్న భోజన వసతులను మరింతగా మెరుగుపరచడంపై కార్యాచరణ చేపట్టాలని తీర్మానించింది. నాణ్యమైన ఇంగ్లిషు విద్యను అందించడం ద్వారా ప్రైవేటు కార్పొరేట్‌ విద్యకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టాలని, అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖను క్యాబినెట్‌ ఆదేశించింది. 
ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి..!

‘మన ఊరు - మన బడి’ ప్రణాళిక..

ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధి, పటిష్ఠమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం విద్యా శాఖలో ‘మన ఊరు - మన బడి’ అనే వినూత్న కార్యక్రమానికి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 19,84,167 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య, నమోదు, హాజరు, కొనసాగింపుతో పాటు దశలవారీగా డిజిటల్‌ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రభుత్వం ‘మన ఊరు - మన బడి’ ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన, పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ.7,289 కోట్లతో ‘మన ఊరు - మన బడి’ ప్రణాళికకు ఆమోదం తెలిపింది.


సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించిన విధంగా రెండేళ్ల వ్యవధిలో రూ.4 వేల కోట్లతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందించే దిశగా కార్యక్రమాలు చేపడతారు. ఇందులో భాగంగా సాంకేతికత విజ్ఞాన ఆధారిత విద్యను అందించడానికి డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు, అదనపు తరగతి గదుల ఏర్పాటు, మరమ్మతులు, అవసరమైన మేరకు ఫర్నిచర్‌, మరుగుదొడ్లు, ఇతర వసతుల కల్పన ఈ ప్రణాళిక ఉద్దేశం. ఈ కార్యక్రమ అమలు, విధివిధానాల రూపకల్పన కోసం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కూడిన మంత్రుల బృందం గత ఏడాది మార్చి 23న, ఏప్రిల్‌ 8న, జూన్‌ 17న సమావేశమైంది.

మంత్రుల బృందం రూపొందించిన విధివిధానాలు..


‘మన ఊరు - మన బడి’ అమలు కోసం మంత్రుల బృందం పలు అంశాలను పరిశీలించి విధి విధానాలు రూపొందించింది. అవి.. ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్‌ ప్రోగ్రామ్‌గా చేపట్టి, మూడు దశల్లో మూడేళ్ల వ్యవధిలో విద్యా శాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలి.

2021-22 విద్యా సంవత్సరం మొదటి దశలో మండల కేంద్రాన్ని యూనిట్‌గా తీసుకుని అన్ని రకాల(ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత) పాఠశాలల్లో అత్యధికంగా ఎన్‌రోల్‌ అయిన  9,123 (35% స్కూళ్లలో 65% విద్యార్థులను) ప్రభుత్వ, స్థానిక సంస్థలకు చెందిన పాఠశాలల్లో ముందుగా కార్యక్రమాన్ని అమలు చేయాలి. 

ప్రభుత్వ, స్థానిక సంస్థలకు చెందిన పాఠశాలల్లో ముందుగా కార్యక్రమాన్ని అమలు చేయాలి. ఈ కార్యక్రమం కింద 12 రకాల విభాగాలను పటిష్ఠపరచాలి. నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లు, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి సరిపడే ఫర్నిచర్‌, పాఠశాల మొత్తం పెయింటింగ్‌ వేయడం, పెద్ద, చిన్న మరమ్మతులు, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, ప్రహరీ గోడలు, కిచెన్‌ షెడ్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్‌ రూంలు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్‌ హాల్స్‌, డిజిటల్‌ విద్య అమలు. 


12 విభాగాల అనుబంధ అంచనాల ఆధారంగా మొత్తం బడ్జెట్‌ రూ.7,289.54 కోట్లు అవసరమవుతాయి. ఇందులో భాగంగా మొదటి దశలో 9,123 పాఠశాలలకు(35%) అంచనా బడ్జెట్‌ రూ.3,497.62 కోట్లుగా ఉంది. ఎంపిక చేసిన ప్రతి పాఠశాలలో చేపట్టే కార్యక్రమ అమలు కోసం అన్ని పనులకు పరిపాలనా అనుమతిని జిల్లా కలెక్టర్లు ఇస్తారు. ‘ఒక మండలంలో కార్యక్రమాన్ని అమలు చేసే ఏజెన్సీ ఒకటే ఉండేలా తమ జిల్లాల్లో ఏజెన్సీని ఎంచుకోవచ్చు. 

‘మన ఊరు - మన బడి’ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా, అన్ని పనులను వేగంగా అమలు చేయడం కోసం పాఠశాల నిర్వహణ కమిటీ(ఎ్‌సఎంసీ)లకు బాధ్యతలు అప్పగిస్తారు.

వ్యాక్సినేషన్‌ను త్వరగా పూర్తి చేయాలి..

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై చర్చ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితిపై గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉందని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ సంసిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 5 కోట్ల వ్యాక్సినేషన్‌ డోసులు ఇవ్వడం పూర్తయిందని, అర్హులైన వారందరికీ అతి త్వరగా టీకాలు ఇస్తామని తెలిపారు. కాగా, మునిసిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖల అధికారుల సహకారంతో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌.. మంత్రి హరీశ్‌రావును, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అన్ని జిల్లాల మంత్రులు... కలెక్టర్లతో సమీక్షా సమావేశాలు నిర్వహించాలన్నారు. ఇక వానాకాలం ధాన్యం కొనుగోళ్లపైనా క్యాబినెట్‌ చర్చించింది. ఇప్పటికే ధాన్యం కొనుగోలు పూర్తి కావొచ్చిందని, అకాల వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వస్తోందని అభిప్రాయపడింది. దీనిని దృష్ణిలో పెట్టుకుని ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేంత వరకు కేంద్రాలను కొనసాగించాలని, ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని అధికారులను మంత్రిమండలి ఆదేశించింది.

బీఎస్సీ ఫారెస్ట్రీ విద్యార్థులకు అటవీ శాఖ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు

సిద్దిపేట జిల్లా ములుగులోని ‘ఫారెస్ట్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎ్‌ఫసీఆర్‌ఐ)’లో బీఎస్సీ ఫారెస్ర్టీ(హానర్స్‌) నాలుగేళ్ల డిగ్రీ కోర్సును అభ్యసించిన విద్యార్థులకు అటవీశాఖ ఉద్యోగాల భర్తీలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కోటా కింద రిజర్వేషన్లు కల్పించాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారె్‌స్ట(ఏసీఎఫ్‌) ఉద్యోగాల్లో 25 శాతం, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌(ఎ్‌ఫఆర్‌వో) ఉద్యోగాల్లో 50 శాతం, ఫారెస్టర్‌ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్‌ సర్వీస్‌ రూల్స్‌-1997, తెలంగాణ స్టేట్‌ ఫారెస్ట్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌-2000లో సవరణలు చేపట్టాలని తీర్మానించింది. దీంతోపాటు తెలంగాణలో ‘ఫారెస్ట్‌ యూనివర్సిటీ’ ఏర్పాటుకు అంగీకరించింది. ఇందుకు సంబంధించి అటవీశాఖ అధికారులు ప్రాథమిక నివేదికను క్యాబినెట్‌కు సమర్పించారు. అయితే.. వచ్చే సమావేశం నాటికి పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేయాలని మంత్రిమండలి ఆదేశించింది.


జలవనరుల శాఖలో నిర్మాణ పనులకు ఆమోదం..

జలవనరుల శాఖలోని పలు అంశాలపై మంత్రిమండలి సుదీర్ఘంగా చర్చించింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్‌ జలాశయం నుంచి తపా్‌సపల్లి జలాశయం వరకు లింక్‌ కాలువ తవ్వకానికి రూ.388.20 కోట్లకు ఆమోదం తెలిపింది. తపా్‌సపల్లి జలాశయం కింద సిద్దిపేట జిల్లాలో 1,29,630 ఎకరాలకు నికరమైన సాగునీరు అందనుంది.

క్యాబినెట్‌ భేటీలో తీసుకున్న ఇతర నిర్ణయాలు..

వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్దారం గ్రామంలోని పెద్ద చెరువు పునరుద్ధరణ పనులకు రూ.44.71 కోట్లకు మంత్రివర్గం ఆమోదం.


మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించతలపెట్టిన ఘన్‌పూర్‌ బ్రాంచి కాలువ పనుల కోసం రూ.144.43 కోట్లకు ఆమోదం. ఈ కాలువ ద్వారా ఘన్‌పూర్‌, అడ్డాకుల మండలాల్లో 25 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. 

ఆదిలాబాద్‌ జిల్లాలో పెన్‌గంగా నదిపై నిర్మిస్తున్న చనాకా-కొరాటా బ్యారేజీకి సంబంధించి రూ.795.94 కోట్ల అంచనా వ్యయాన్ని సవరించడానికి ఆమోదం. ప్రాజెక్టులో ఇప్పటికే బ్యారేజీ నిర్మాణం పూర్తి కాగా, పంప్‌హౌజ్‌ నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్‌ జిల్లాలో భీమ్‌పూర్‌, జైనథ్‌, భేలా, ఆదిలాబాద్‌ మండలాల్లో 50 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. 


మెదక్‌ జిల్లాలో నిజాం కాలంలో నిర్మించిన ఘన్‌పూర్‌ ఆనకట్ట కాలువల వ్యవస్థను గతంలో ఆధునికీకరించగా.. మిగిలిపోయిన మరికొన్ని పనులు చేపట్టడానికి రూ.50.32 కోట్లతో పరిపాలనా అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కింద మెదక్‌ జిల్లాలో సుమారు 25 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. వనపర్తి జిల్లాలో పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలోని గోపాలసముద్రం చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనుల కోసం రూ.10.01 కోట్లు మంజూరు చేస్తూ మంత్రివర్గం ఆమోదం. 

గద్వాల జిల్లాలో ప్రతిపాదించిన నలసోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకానికి సవరించిన అంచనా వ్యయం రూ.669 కోట్లకు అనుమతి, ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలవడానికి ఆమోదం. 

సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు నిధుల సేకరణ కోసం కంపెనీస్‌ యాక్ట్‌-2013 కింద మంజీరా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఏర్పాటును మంత్రివర్గం ఆమోదించింది. ఈ కార్పొరేషన్‌కు ఇరిగేషన్‌ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ లేదా ప్రిన్సిపల్‌ సెక్రెటరీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. 

దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా ఎత్తయిన ప్రాంతాలకు సాగునీటిని అందించడానికి గండి రామారం చెరువు నుంచి కన్నారం చెరువు వరకు పంప్‌హౌజ్‌, కాలువ పనులకు, గుండ్లసాగర్‌ నుంచి లౌక్యతండా వరకు పైప్‌లైన్‌ పనులకు, నశ్కల్‌ జలాశయం వద్ద పంప్‌హౌజ్‌ నిర్మాణానికి మొత్తం రూ.104.92 కోట్లకు మంత్రివర్గం ఆమోదం.

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వెల్లటూరు గ్రామం వద్ద ముక్త్యాల బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకానికి, పాల్కేడ్‌ మండలం గుండెబోయినగూడెం గ్రామం వద్ద జాన్‌పహాడ్‌ బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి నిర్మించతలపెట్టిన ఎత్తిపోతల పథకాలకు సంబంధించి రూ.16.23 కోట్లకు మంత్రివర్గం ఆమోదం.వనపర్తి, గద్వాల జిల్లాల్లో 11 చెక్‌ డ్యాంల నిర్మాణానికి రూ.27.36 కోట్లతో పరిపాలనా అనుమతులకు మంత్రి వర్గం ఆమోదం. 
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

జాతీయం Latest News in Teluguమరిన్ని...

క్రీడాజ్యోతిLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.