ఇంగ్లండ్‌ స్పిన్నర్లకు కష్టమే!

ABN , First Publish Date - 2021-01-24T10:19:37+05:30 IST

భారత ఉపఖండంలో పిచ్‌లు స్పిన్‌కు స్వర్గధామంగా ఉంటాయని అంతా భావిస్తుంటారు.

ఇంగ్లండ్‌ స్పిన్నర్లకు  కష్టమే!

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం): భారత ఉపఖండంలో పిచ్‌లు స్పిన్‌కు స్వర్గధామంగా ఉంటాయని అంతా భావిస్తుంటారు. దీనికి తగ్గట్టుగానే ఇక్కడ పర్యటించే జట్లు తమ బౌలింగ్‌ కూర్పులో స్పిన్నర్లకు ప్రాముఖ్యమిస్తుంటాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో ఇంగ్లండ్‌ జట్టు భారత్‌లో నాలుగు టెస్టుల సిరీ్‌సకు శ్రీకారం చుట్టనుంది. ప్రస్తుతం ఈ జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. టూర్‌కు ఎంపికైనా కరోనా సోకిన కారణంగా ఆడలేకపోతున్న మొయిన్‌ అలీని పక్కనపెడితే డొమినిక్‌ బెస్‌, జాక్‌ లీచ్‌, రూపంలో ఇద్దరు స్పెషలిస్ట్‌ స్పిన్నర్లు జట్టులో ఉన్నారు. ప్రస్తుతం గాలెలో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వీరిద్దరూ ఏమాత్రం ప్రభావం చూపకపోవడం ఇంగ్లండ్‌ను ఆందోళనపరుస్తోంది. వీరికి కనీసం ఒక్క వికెట్‌ కూడా దక్కలేదు. దీంతో భారత గడ్డపై వీరు ఏమేరకు రాణిస్తారనే చర్చ జరుగుతోంది. మరోవైపు తొలి టెస్టులో మాత్రం బెస్‌, లీచ్‌ విశేషంగా రాణించి 14 వికెట్లు తీశారు. అటు జట్టు కూడా ఘనవిజయం సాధించింది. కానీ రెండో టెస్టులో మాత్రం లంక బ్యాట్స్‌మెన్‌ ఈ జోడీని సులువుగా ఎదుర్కొని తొలి ఇన్నింగ్స్‌లో 381 పరుగులు సాధించగలిగారు. దీంతో ఒక్కసారిగా ఈ స్విన్‌ ద్వయం ప్రభావం కోల్పోవడం ఇంగ్లండ్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ను ఆందోళన పరుస్తోంది. మరోవైపు పేసర్లు అండర్సన్‌ ఆరు వికెట్లు, మార్క్‌ వుడ్‌ మూడు వికెట్లు తీయగలిగారు. క్రితంసారి భారత పర్యటనలో ఆడిన ఐదు టెస్టుల్లో 48.1 సగటుతో స్పిన్నర్లు 40 వికెట్లు  తీయగలిగారు. అటు భారత స్పిన్నర్లు మాత్రం 30.35 సగటుతో 68 వికెట్లు తీసి 4-0తో సిరీస్‌ గెలిచేలా తోడ్పడ్డారు.


వేడి వాతావరణంలో..:

ఇంగ్లండ్‌ జట్టులో ఉన్న ముగ్గురు (మొయిన్‌ అలీ, బెస్‌, లీచ్‌) స్పిన్నర్లలో మొయిన్‌ అలీకి మాత్రమే గతంలో భారత్‌లో పర్యటించిన అనుభవముంది. కానీ అలీ కూడా ఇంగ్లండ్‌ గడ్డపైనే భారత్‌పై రాణించాడు. 2016-17లో ఇంగ్లిష్‌ టీమ్‌ ఇక్కడికి వచ్చినప్పుడు ఆడిన ఐదు టెస్టుల్లో అతను తీసింది 10 వికెట్లు మాత్రమే. అందుకే ఈసారి కూడా ఇంగ్లండ్‌ స్పిన్నర్లు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత పిచ్‌లపై వారికి పట్టు దొరకడం కష్టమని చెబుతున్నారు. ఈ రెండు జట్ల మధ్య తొలి రెండు టెస్టులు చెన్నైలో.. మిగిలిన రెండు మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లో జరుగబోతున్నాయి. ఈ మ్యాచ్‌లు జరిగే సమయంలో వాతావరణం వేడిగా ఉండబోతోంది. దీంతో వికెట్లు కూడా పొడిగా మారతాయి. అదే ఇంగ్లండ్‌లో దీనికి పూర్తి భిన్న వాతావరణం ఉండడంతో సహజంగానే బంతిని చక్కటి లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో వేయగలుగుతారు. లెఫ్టామ్‌ స్పిన్నర్‌ చక్కటి వికెట్‌పై ఆఫ్‌ స్టంప్‌ లైన్‌గా బంతిని వేస్తుంటాడు. అదే టర్నింగ్‌ వికెట్‌పై ఇది లెగ్‌ స్టంప్‌గా ఉంటుంది. ఇప్పుడు భారత్‌లాంటి  దేశాల్లో స్పిన్నర్లు తమ బౌలింగ్‌లో మార్పులు చేసుకోవాలి. బెస్‌, లీచ్‌ 12 టెస్టుల చొప్పున ఆడగా వరుసగా 40, 27 వికెట్లు తీశారు. శ్రీలంకలో అడుగుపెట్టగానే కరోనా పాజిటివ్‌గా తేలిన మొయిన్‌ అలీ క్వారంటైన్‌లో ఉండడంతో తొలి టెస్టులో ఆడలేదు. అలాగే విన్నింగ్‌ కాంబినేషన్‌లో మార్పులు చేయకపోవడంతో ప్రస్తుత రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు. అయితే భారత్‌తో సిరీ్‌సలో మాత్రం అనుభవలేమి స్పిన్నర్లతో కాకుండా 60 టెస్టులాడిన అలీ వైపే ఇంగ్లండ్‌ మొగ్గు చూపే అవకాశం ఉంది.

Updated Date - 2021-01-24T10:19:37+05:30 IST