ప్రమోట్‌ అయినా పరీక్షలే!

ABN , First Publish Date - 2020-09-25T09:09:07+05:30 IST

పై తరగతికి వెళ్లిపోయాం.. సెమిస్టర్‌ పరీక్షలుండవని ఆనందంతో ఉన్న ఇంజనీరింగ్‌, బీఫార్మసీ విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమయింది. విద్యార్థులు రాయని సెమిస్టర్‌ పరీక్షలను అక్టోబరులో నిర్వహించేందుకు జేఎన్‌టీయూహెచ్‌ అధికారులు సన్నద్ధమవుతున్నారు...

ప్రమోట్‌ అయినా పరీక్షలే!

  • ఇంజనీరింగ్‌, ఫార్మసీ కాలేజీలకు ఆదేశాలు
  • అక్టోబరులో నిర్వహించనున్న జేఎన్‌టీయూ
  • కసరత్తు చేస్తున్న అధికారులు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): పై తరగతికి వెళ్లిపోయాం.. సెమిస్టర్‌ పరీక్షలుండవని ఆనందంతో ఉన్న ఇంజనీరింగ్‌, బీఫార్మసీ విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమయింది. విద్యార్థులు రాయని సెమిస్టర్‌ పరీక్షలను అక్టోబరులో నిర్వహించేందుకు జేఎన్‌టీయూహెచ్‌ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఒక సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల విద్యార్థులకు భవిష్యత్తులో నష్టం జరిగే అవకాశాలుండటంతో యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా  కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంజనీరింగ్‌, ఫార్మసీ, ఎంబీఏ చివరి సెమిస్టర్‌ పరీక్షలు సజావుగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రమోట్‌ అయిన విద్యార్థులకు సైతం పరీక్షలు నిర్వహించాలని జేఎన్‌టీయూహెచ్‌ అధికారులు నిర్ణయించారు.  ఆరు నెలల క్రితం లాక్‌డౌన్‌ విధించడంతో ఇంజనీరింగ్‌, బీఫార్మసీ, ఎంబీఏ పరీక్షలు వాయిదా పడ్డాయి.


ఇంజనీరింగ్‌, బీఫార్మసీ మొదటి, రెండో, మూడో సంవత్సర విద్యార్థులను, ఎంబీఏ మొదటి సంవత్సర విద్యార్థులను ఆ పై తరగతులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే ప్రమోట్‌ చేస్తూ జేఎన్‌టీయూహెచ్‌ నిర్ణయం తీసుకుంది. కాగా,   విద్యార్థులకు భవిష్యత్తులో విద్య, ఉపాధి అవకాశాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే, ముఖ్యంగా విదేశాల్లో ఎంఎ్‌సకు వెళితే 42 సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత తప్పనిసరి అనే నిబంధనలు ఉండటంతో పరీక్షల నిర్వహణకే అధికారులు నిర్ణయించారు. చివరి సెమిస్టర్‌ పరీక్షలు   నిర్వహించడంతోపాటు ప్రమోట్‌ అయిన విద్యార్థులకు సంబంధిత సెమిస్టర్‌ పరీక్షలను పరిస్థితులు చక్కబడిన తర్వాత నిర్వహించాలని యూజీసీ వర్సిటీలను ఆదేశించినట్లు సమాచారం. కాగా, సొంత కాలేజీలోనే విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అధికారులు అవకాశం కల్పించనున్నారు.  పరీక్ష సమయాన్ని  కూడా కుదించే అవకాశాలున్నాయి. ప్రశ్న పత్రాన్ని సైతం అందుకనుగుణంగానే రూపొందించేలా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే  ఇంజనీరింగ్‌, బీఫార్మసీ, ఎంబీఏ కాలేజీలకు జేఎన్‌టీయూహెచ్‌  పలు సూచనలు చేసినట్లు తెలిసింది.


Updated Date - 2020-09-25T09:09:07+05:30 IST