Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 02 May 2022 00:40:59 IST

ఎందరో సీతారామారావులు...

twitter-iconwatsapp-iconfb-icon

ప్రముఖ నాస్తికవాది, హేతువాది త్రిపురనేని రామస్వామిచౌదరి కుమారుడు గోపీచంద్‌ 1945-46 మధ్య ఈ నవల రాశాడు. ఇది ‘అసమర్థుడు’, ‘అసమర్థుని భార్య’, ‘అసమర్థుని మేనమామ’, ‘అసమర్థుని ప్రతాపం’, ‘అసమర్థుని అంతం’ అనే అయిదు ఉపశీర్షికలతో రాయబడిన మనో వైజ్ఞానిక నవల. 


ప్రతి మనిషికి తనదైన ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఈ నవలలో కథా నాయకుడు సీతారామారావు పాత్ర ఆదర్శాలకు, వాస్తవ జీవితానికి మధ్య సమతుల్యత కోల్పోయి, పరిస్థితులకు తగిన సర్దుబాటు చేసుకోలేక తననుతాను అంతం చేసుకునే విచిత్రమైన వ్యక్తిత్వానికి ప్రతీకగా చిత్రితమైంది. ప్రతి మనిషిలోనూ ఇలాంటి సీతారామారావులు ఉంటారు. ఆ విషయాన్ని ఈ నవల చాలా బలంగా చెప్పింది. 


‘‘సీతారామారావు జీవితం విచిత్రమైనది. ఉన్నత శిఖరాగ్రం నుండి స్వచ్ఛమైన జలంతో భూమిమీద పడి మలినాన్ని కలుపుకొని మురికి కూపంలోకి ప్రవహించే సెలయేటిని జ్ఞప్తికి తెస్తుంది’’ అనే మాటతో ప్రారంభమయ్యే ఈ నవల అచ్చం నాటక లక్షణమైన ‘నాంది’ని గుర్తుకు తెస్తుంది. కావ్యాలూ నాటకాల్లో సంప్రదాయమైన ఈ నాందిలో భావి కథార్థ సూచన ఉంటుంది. నవల ప్రారంభంలో సీతారామారావు గురించి చేసిన పై పరిచయ వాక్యాల్లో భావికథ గర్భితమై ఉంది. కథానాయకుడు కులీనుడు, జమీందారు బిడ్డ. బాగా చదువుకున్నవాడు. కాని పరిచయ వాక్యాలలో చెప్పినట్టు ఉన్నతమైన శిఖరాగ్రం నుంచి మురికి కూపంలోకి చేరిన సెలయేరులా అతని ఆలోచనలు, అతని స్వభావం అతని అధఃపతనానికి కారణమయ్యాయి. 


అతని తాతముత్తాతలు వంశ పేరుప్రతిష్టలకోసం చుట్టుపక్కలవారికి ఎన్నో దానాలు త్యాగాలు చేశారు. ఆ ఊరి చెరువు, సత్రం ముత్తాత కట్టించాడు. అతని తాత దేవా లయం కట్టించాడు. దేవుని పెళ్లికి పీటలపై కూచొని కల్యాణం జరిపే హక్కును అతని తండ్రి ముప్పై వేలు ఖర్చు పెట్టి కోర్టుకు వెళ్లి సాధించాడు. వాళ్ల కమతాలలోకి పనికి రావాలని ఊళ్లో అందరూ ఉవ్విళ్లూరుతుంటారు. సరైన అజమాయిషీ లేకపోవడం వల్ల వీలైనంత కాజేయవచ్చు అని కొందరు బాహాటంగా అంటుంటారు. 


సీతారామారావు తాత తండ్రుల వంశప్రతిష్ట నిలబెట్టాలని భావిస్తాడు. ఉదార స్వభావంతో అడిగిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేస్తాడు. ‘‘వాళ్ల వంశంలోనే ఆ గొప్పతనముంది. ఎముకలేని చెయ్యి’’ అని ముఖస్తుతి చేసి చాలామంది అతని ద్వారా లబ్ధి పొందుతారు. అతని తండ్రి దగ్గర అప్పులు తీసుకున్న చాలామంది ఆయన చని పోయాక అప్పులు ఎగ్గొట్టారు. సీతారామారావు కూడా వారి దగ్గర డబ్బు వసూలు చెయ్యడు. ‘‘పోనీలే వాళ్ళుకూడా బతకాలి కదా’’ అని డాబు చూపిస్తాడు. మేనమామ, అత్త కూడా అతన్ని పొగడ్తలతో ఉబ్బించి లౌక్యంచూపి ఇవ్వాల్సిన డబ్బు ఎగ్గొడతారు. డబ్బు నష్టపోయినా ‘‘నువ్వెంత మంచివాడివి బాబూ’’ అనే మాటకు పొంగిపోతాడు. ‘‘బతికినన్నినాళ్లు ఇలా బతికితే చాలదా, పదిమందితో మంచివాడనిపించుకొని పొమ్మన్నారు పెద్దలు’’ అని ఠీవిగా చెప్తాడు. 

అతని స్వభావాన్ని గమనించిన రామయ్య తాత చెప్పిన మాటలు అతని తలకెక్కవు. ఇప్పటికీ సమాజంలో మనల్ని పొగిడి ఉబ్బించి పబ్బం గడుపుకునే వాళ్ళున్నారు. ఎవరు ఎందుకు మాటాడుతున్నారో, ఎలా నటిస్తారో తెలుసుకోక పోవడం అసమర్థుల లక్షణమే. లక్షలు లక్షలు దానాలు చేసిన అతడు చివరకు వంద రూపాయలులేక తల్లడిల్లడం అతని దుర్భర దారిద్ర్యానికి, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల కలిగే నష్టానికి నిద ర్శనంగా నిలుస్తుంది. పెళ్ళి పట్ల కూడా అతనికి ఆదర్శ భావాలున్నాయి. పెళ్ళి చేసుకోను అని చెప్తుంటాడు. చివరకు చేసుకోక తప్పనిసరైనపుడు ‘‘పెళ్లికి ఒక మహత్తర అర్థం కల్పిస్తాను’’ అంటాడు. నిజానికి అతడు కాలేజీలో చదువుతున్న పుడు ఇందిర అనే అమ్మాయిని ప్రేమించాడు. పెళ్ళి చేసుకోకపోతే ఆమె అతన్ని దగ్గరకు రానివ్వదు. అందుకే పెళ్లి కొడుకయ్యాడు. తన ఊహల ఊబిలో ఇరికి ఇబ్బందుల పాల య్యాడు. ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయాయి. ఉద్యోగం చేయక తప్పలేదు. ‘‘ఉన్నన్ని రోజులు కన్నూమిన్నూ కానక ఖర్చుపెట్టాడు. ఇపుడు అనుభవిస్తున్నాడు. అయినా మనకోసం అతడు ఏమైనా చేశాడా, మంచివాడు అనిపించుకోవడానికి చేశాడు’’ అని చుట్టు పక్కలవాళ్ళు ఈసడించుకున్నారు. చులకనగా నవ్వారు. లోకం తీరు ఇంతే. ఉన్నప్పుడు పొగిడి పొందడం, లేనపుడు ఎగతాళిచేయడం. ఇది తెలుసుకోనివారే అసమర్థులు. 


‘‘ఈ ప్రపంచంలో జ్ఞానం ఉన్నవాడు సుఖపడలేడు. అజ్ఞాని మాత్రమే సుఖపడ తాడు. అజ్ఞానిని ఆలోచనలు వేధించవు. అందని ఆదర్శాల కోసం హైరానా పడడు’’ అని చుట్టూ ఉన్నవారికి చెప్పడం మొదలుపెడతాడు. అతని తల ఆలోచనల పుట్ట అయింది. అతడు ఏ పనీపాటాలేని అసమర్థుడయ్యాడు. ‘‘అన్నంకోసమే ఈ జీవితం. ఇంతమంది దేశాధినేతలున్నారు. అందరికీ అన్నందొరికే మార్గం కనుక్కోలేకపోయారు’’ అని తను సంపాదించడం చాతకాక తన వైఫల్యాన్ని ఇతరుల మీదకు నెట్టేసాడు. తను మంచివాడని, ఇతరులు దుర్మార్గులు మోసగాళ్ళని నిందిస్తాడు. మనం కూడా ఇతరులే మన కష్టాలకు కారకులని పలాయనవాదం చూపిస్తాం. ఈ సన్నివేశాలు చదివినపుడు మనసు బరువెక్కుతుంది. ఏదో ఒక సందర్భంలో ఎవరయినా ఇలాంటి భావజాలం కలిగి ఉంటే వారి హృదయం విచిలితం అవుతుంది. 


నలభై వేల రూపాయల అప్పు ఎగ్గొట్టిన మేనమామకు ఒక వంద రూపాయలు సాయం చేయమని ఉత్తరం రాస్తాడు. మేనమామ పట్టించుకోడు. ‘‘నీకు సహాయం చేసిన డబ్బుతో వంద కుక్కలు కొనుక్కుంటే అవి విశ్వాసం చూపేవి’’ అని మరొక ఉత్తరం రాస్తాడు. ‘‘బాబూ మీరు కీర్తి మనుషులు, డబ్బులేకపోయినా బతగ్గలరు, మేము అలా కాదు డబ్బు లేకపోతే బతకలేము, అందుకే నీకు వంద రూపాయలు ఇవ్వలేను’’ అని మేనమామ ఘాటుగా జవాబు ఇస్తాడు. దానికి ఇతని హృదయం గాయపడుతుంది. ‘‘ఎవరి అజ్ఞానానికి వారే బాధపడాలి. ఎవరి చర్యల ఫలితం వారే అనుభవించాలి. ఇతరులను నిందించి ప్రయోజనం లేదు. జీవిత ప్రవాహం మహా వేగంతో వెళ్లిపోతోంది. ఇదొక మహా సంగ్రామం. ఇందులో పిరికివాళ్లకు చోటులేదు’’ అనే అతని మేనమామ మాటలకు సీతారామారావే కాదు, మనం కూడా విలవిల్లాడుతాం. 


ఎవరి మీదో కోపాన్ని ఇంకెవరి మీదో చూపినట్టు నిష్కారణంగా తన కోపాన్ని కూతురుపై చూపిస్తాడు. ఎన్నో తిప్పలు పడి ఏదోలా సంపాదించి భార్య వండిన అన్నాన్ని తిట్టుకుంటూ తిని భార్యను కొట్టి బయటకు వెళ్లిపోతాడు. అత్త మీద కోపం దుత్త మీద చూపిన సామెత చందంగా మనలో ఈ అసమర్థ లక్షణం ఉంటుంది. మానవ వ్యక్తిత్వంలో ఈ స్వభావాన్ని సహజసిద్ధంగా చిత్రించిన గోపీచంద్‌ మనల్ని ఆలోచనల్లో పడేస్తాడు. 


ప్రేమించి పెళ్లాడిన భార్య అతని ద్వారా నరకం చూస్తుంది. అతని కోపం అతని నవ్వు అతని మాట అతని ఉద్రేకం ఇవేవీ ఆమెకు రుచించవు. యాంత్రికంగా బతుకు తుంది. ఇప్పటికీ ఎందరో దంపతులు ఇలాగే యాంత్రికంగా బతుకుతున్నారు అనిపించి ఇలాంటి సందర్భంలో మనం ఎలా ప్రవర్తిస్తామో, ఇంట్లోని సమస్యలకు ఎలా స్పందిస్తున్నామో తెలిసి ఆలోచనలో పడతాం. 


అసమర్థుని చివరి భాగం- అసమర్థుని అంతం. తన ఊహలకు వాస్తవానికి మధ్య వైరుధ్యం ఎక్కువై, ఎలా ఉండాలో అర్థంకాక, అర్థం అయినా అలా ఉండలేక, ఎడతెగని పాముల్లా కాటేస్తున్న ఆలోచనల నుంచి తప్పించుకోలేక, అద్దం ముందు నిలబడి తన గుండెను తాను బాదుకుంటూ, ‘‘లోకం మంచిదారిని వదిలేసి తనలాంటి మంచివాళ్ళతో ఆడుకుంటోంది’’ అని తీవ్ర వ్యాకులతకు గురై పలాయనవాదియైుపోతాడు. తను ఎలా ఉండాలని కలలు కన్నాడో, వేటిని గొప్ప ఆదర్శాలుగా భావించి బతకాలనుకున్నాడో అలా బతకలేక, సంఘంతో సర్దుబాటు చేసుకోలేక ఉన్మత్త స్థితి ఆవరించి, తన గొంతు తానే నులుముకొని, తన శరీరాన్ని తానే హింసించుకొని మరణిస్తాడు. నవల పూర్తయ్యే సరికి ప్రతి పాఠకునికీ తన లోనూ సీతారామారావు ఉన్నాడని, తనదీ అసమర్థుని జీవయాత్రేననీ అనిపిస్తుంది. 


వ్యక్తికి వ్యక్తికి మధ్య, వ్యక్తికి సమాజానికి మధ్య సమన్వయం కొన్నిసార్లు లోపి స్తుంది. దీని సర్దుబాటుకు మానసికంగా సిద్ధం కాకపోతే, ముందుచూపు లేకపోతే మనంకూడా సీతారామారావులా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌కు గురై కుంగిపోతాము. పరిస్థితులతో తగిన సర్దుబాటుచేసుకొంటూ స్వభావాన్ని ఆదర్శాలను వదలకపోవడం సమర్థుల లక్షణం. ఈ నవల డెబ్బైఐదేళ్ళ కిందట రాసినది. అయినా ఇప్పటికీ ఇందు లోని పలు అంశాలు, ముఖ్యంగా సీతారామారావు ఆలోచనలు మనల్ని వెంటాడతాయి. 


సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తూ భావి కాలానికి కూడా మార్గ నిర్దేశం చేసే ఈ నవల, తెలుగు నవలా సాహిత్యంలో ఒక క్లాసికల్‌ నవలగా పేరు పొందింది. కావ్య ప్రయోజనాలుగా చెప్పబడిన లక్షణాలలో ఒకటైన వ్యవహార దక్షత (జ్ఞానం) మనలో నిండాలని చెప్పిన గోపీచంద్‌ ఉత్తమ రచయితగా పేరు పొందడానికి ఎంచుకున్న కథ, రచనా విధానమే కారణం.

శివలెంక ప్రసాదరావు

91829 41028

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.