భావశూన్య స్థితియే అత్యుత్తమ భక్తి

ABN , First Publish Date - 2020-02-18T10:53:18+05:30 IST

భగవాన్‌ రమణ మహర్షి రచించిన 30 శ్లోకాల ‘ఉపదేశ సారం’లోని తొమ్మిదో శ్లోకమిది. ‘‘నేను వేరు, పరమాత్మ వేరు అనే భేదభావంతో చేసే చింతనం కన్నా ‘ఆ పరమాత్మ నేనే’ అనే అభేద భావంతో చేసే

భావశూన్య స్థితియే అత్యుత్తమ భక్తి

భావశూన్య సద్‌ భావసుస్థితి:

భావనా బలాత్‌ భక్తిరుత్తమా

భగవాన్‌ రమణ మహర్షి రచించిన 30 శ్లోకాల ‘ఉపదేశ సారం’లోని తొమ్మిదో శ్లోకమిది. ‘‘నేను వేరు, పరమాత్మ వేరు అనే భేదభావంతో చేసే చింతనం కన్నా ‘ఆ పరమాత్మ నేనే’ అనే అభేద భావంతో చేసే చింతనం ఎంతో పవిత్రమైనది’’ అని చెప్పిన రమణులు.. ఆ భావన(సోహం) చేయగా చేయగా భావాతీత పరమాత్మ స్థితిలో స్థిరంగా నిలిచిపోతారని, ఇదే ఉత్తమ భక్తి అని ఈ శ్లోకంలో చెప్పారు. భక్తిని పెంపొందించే సాధనాలు పూజ, జపం, చింతనం. ఇవన్నీ భేదభావనలో కాక అభేద భావనతో చేస్తేనే పవిత్ర సాధనాలవుతాయి. చివరి సాధన అయిన సరళ చింతనం వల్ల సాధకుడు తన స్వరూపంలో నిలిచిపోతాడు. ‘స్వరూపం’, ‘స్వస్థితి’ అంటే ఏమిటి? అది.. ‘భావశూన్య సద్భావ స్థితియే’.. ఎట్టి సంకల్పాలూ లేని ఆత్మస్థితియే. నిస్సంకల్ప, నిర్వికల్ప సమాధియే.


ఒకసారి సరళచింతనం పరిపూర్ణమైతే అఖండాకార వృత్తి లేదా బ్రహ్మస్వరూపం లేదా స్థితప్రజ్ఞత్వం స్థిరంగా నిలిచిపోతాయి. దీన్నే ‘అమనస్కము’ లేదా ‘మనో నాశనము’ అని అంటారు. అయితే ఈ స్థితి అద్వైత భావనాబలంతోనే వస్తుంది. అందుకే బ్రహ్మసూత్రాల్లో ‘‘పౌనఃపున్యేన శ్రవణం కుర్యాత్‌’’ అనే సూత్రం ద్వారా.. మళ్లీమళ్లీ శ్రవణాదులు చేసిన వారికి తప్ప ఈ భావశూన్య సద్భావ స్థితి కలగదని స్పష్టం చేశారు. ఈ ఆత్మనిష్ఠయే ఉత్తమ భక్తి అంటున్నారు మహర్షి. అంటే ఈ స్థితిలో భక్తి, జ్ఞానం ఏకమైపోతున్నాయి. భక్తిజ్ఞానాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు.. భగవంతుని గొప్పదనం, మహిమ తెలిస్తే(జ్ఞానం).. ఆయనపై ప్రేమ కలిగి దగ్గరవుతాం(భక్తి). ఇక్కడ భక్తి జ్ఞానంగానైనా.. జ్ఞానం భక్తిగానైనా మారుతుంది. ఈ రెండూ విడదీయరానివి. కనుక.. సోహం(ఆ పరమాత్మను నేను అనే జ్ఞానం) అనే భావన.. దాసోహం(నేను పరమాత్మకు దాసుడను అనే భక్తి)పై ఆధారపడి ఉంటుంది.


అయితే.. ‘సోహం’ కూడా ఒక భావనే. అది ఎప్పుడైనా మారొచ్చు. కాబట్టి అది కూడా పోవాలి. అదే భావశూన్య సద్భావ స్థితి. మరి సోహం భావన ఎలా పోతుంది? అంటే.. నిరంతరం ఆ భావన చేయడం వల్లనే పోతుంది. అర్థమయ్యేలా చెప్పాలంటే.. ‘నేను నిద్రపోతున్నాను’ అని ఒక వ్యక్తి చెప్పాడంటే నిజంగా నిద్రపోతున్నట్టు కాదు. నిద్రపోబోతున్నాడు అని అర్థం. సోహం ఆ స్థితే. నిద్ర వస్తోందనే భావన రాగానే క్రమంగా ఇతర ఆలోచనలు, భావాలు ఆగిపోయి నిద్రలోకి జారుకున్నట్లే.. సోహం నుంచి భావశూన్య స్థితికి చేరాలి. ‘నేను పరమాత్మను’ అనుకున్నంతవరకూ పరమాత్మ స్థితిలో ఉన్నట్టు కాదు. పరమాత్మ స్థితిలో నిలిచిపోతే ఆ భావనతో సహా అన్ని భావాలూ అంతమైపోతాయి. భావనలన్నీ అంతమైనప్పుడు సద్రూప చైతన్యమే అక్కడ ఉంటుంది. అలాంటి భావ శూన్య స్థితినే అత్యుత్తమమైన భక్తిగా రమణ మహర్షి అభివర్ణిస్తున్నారు.


దేవిశెట్టి చలపతిరావు, care@srichalapathirao.com

Updated Date - 2020-02-18T10:53:18+05:30 IST