భావోద్వేగమే గ్రేటర్‌!

ABN , First Publish Date - 2020-11-28T08:07:09+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో భావోద్వేగ అంశాలే కీలకంగా మారాయి. నగర ప్రజలకు సంబంధించిన సమస్యలు కానీ, నగర అభివృద్ధికి తీసుకోవాల్సిన

భావోద్వేగమే గ్రేటర్‌!

అన్ని పార్టీల ప్రచారం దాని చుట్టూనే

నగరాభివృద్ధి, సమస్యలపై చర్చ వెనక్కి

మేనిఫెస్టోల్లోనూ ఉచిత వరాలు, హామీలు

వాటికయ్యే నిధులు.. ఆదాయంపై మౌనం

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో భావోద్వేగ అంశాలే కీలకంగా మారాయి. నగర ప్రజలకు సంబంధించిన సమస్యలు కానీ, నగర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కానీ ప్రస్తుతం పెద్దగా చర్చ జరగడం లేదు. పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న కొద్దీ.. వివాదాస్పద భావోద్వేగ అంశాలు మరింత విస్తృతంగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. చివరకు పోలింగ్‌ సరళి కూడా ఈ అంశాలపైనే ఆధారపడి ఉంటుందా? అనే అనుమానం వ్యక్తమవుతోంది.


ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన మొదట్లో వరద సాయంపై చర్చ జరిగింది. సాయం ఆపాలని బీజేపీ లేఖ రాసినట్టుగా టీఆర్‌ఎస్‌ ప్రచారం చేసింది. ఈ అంశం సవాళ్లు, ప్రతి సవాళ్ల నుంచి ప్రమాణాల వరకూ వెళ్లింది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లడంతో అక్కడి నుంచి రోహింగ్యాలు, పాతబస్తీలో పాకిస్థానీల అంశం తెరపైకి వచ్చింది. సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసి వారిని తరిమేస్తామని సంజయ్‌ వ్యాఖ్యానించారు. దానికి బదులుగా టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ పార్టీల నేతలు కౌంటర్లను ఇవ్వడం ప్రారంభించారు.

దాంతో, ‘విద్వేష రాజకీయం’ తారస్థాయికి చేరింది. తర్వాత, పీవీ ఘాట్‌, ఎన్టీయార్‌ ఘాట్‌లను కూల్చేయాలని మజ్లిస్‌ నేత అక్బరుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యల పట్ల అధికార పార్టీ కూడా కొంత ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. అక్బర్‌ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్‌ ఖండించారు కూడా.




ఈ నేపథ్యంలోనే, మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి కొన్ని అరాచక శక్తులు కుట్ర పన్నాయని, వాటిని ఉక్కుపాదంతో అణచివేయాలని పోలీసులకు సీఎం కేసీఆర్‌ సూచించారు. దాంతో, టీఆర్‌ఎ్‌సకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఇలాంటి అంశాలను తెరపైకి తీసుకొస్తోందని బీజేపీ నేతలు విమర్శలకు దిగారు. తద్వారా, భావోద్వేగ అంశాలతోనే ప్రధాన రాజకీయ పక్షాలు ఈ ఎన్నికలను ఎదుర్కొవాలని భావిస్తున్నట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


ఇక, ఆయా పార్టీల మేనిఫెస్టోల్లోనూ వరాలు, హామీలకే పెద్దపీట వేశాయి. ఉచిత పథకాలను గుప్పించాయి. తప్పితే, జీహెచ్‌ఎంసీ ఆదాయం ఎంత? తాము మేనిఫెస్టోల్లో పెట్టిన పథకాలకు ఎన్ని నిధులు అవసరం? వంటి ప్రధాన అంశాలపై చర్చ జరగడం లేదు. ఆయా పార్టీలు కూడా హామీల అమలుకు సంబంధించిన ప్రణాళికను వివరించడం లేదు. అంతేనా, కొన్ని పార్టీలు అయితే, జీహెచ్‌ఎంసీకి సంబంధం లేని హామీలను కూడా మేనిఫెస్టోల్లో గుప్పించాయి. ప్రభుత్వం మాత్రమే చేయాల్సిన పనులను ప్రతిపక్షాలు తమ మేనిఫెస్టోల్లో పేర్కొనడం విశేషం.


గుండెకాయలో పాగాకు..

హైదరాబాద్‌ ప్రజల అవసరాలేమిటి? వాటిని తీర్చడానికి తీసుకోబోయే చర్యలేమిటి? ముఖ్యంగా నగరాభివృద్ధికి ఏమేం చేయనున్నారు? వంటి అంశాలపై పార్టీలు, వాటి ప్రచారాల్లో పెద్దగా చర్చ జరగడం లేదు. జనాభాలోనే కాకుండా ఆదాయం వంటి విషయాల్లోనూ రాజధాని కీలకం. జీహెచ్‌ఎంసీ, దాని చుట్టుపక్కల సుమారు 1.60 కోట్ల జనాభా ఉంది. అసెంబ్లీ స్థానాల్లో సుమారు 30 శాతం ఇక్కడే ఉన్నాయి.


రాష్ట్ర సొంత ఆదాయం ఏడాదికి సుమారు రూ.80 వేల కోట్లు ఉంటే.. అందులో సుమారు 35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల వరకూ కేవలం హైదరాబాద్‌ కేంద్రంగానే వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి సుమారు రూ.2.5 లక్షల కోట్ల విలువైన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరిగితే.. ఇందులో సుమారు రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారం హైదరాబాద్‌, దాని చుట్టూనే జరుగుతోందని అంచనా. రాష్ట్రం ఏర్పడక ముందు ఉద్యమ సమయంలో కూడా హైదరాబాద్‌ చుట్టే రాజకీయాలు జరిగాయి. ప్రత్యేక తెలంగాణ ఇచ్చే సమయంలోనూ హైదరాబాద్‌పై కీలక చర్చ జరిగింది. తెలంగాణకు హైదరాబాద్‌ కేవలం తల కాదని, గుండెకాయనే విషయం పదే పదే స్పష్టమవుతోంది.


Updated Date - 2020-11-28T08:07:09+05:30 IST