‘ఎమ్మా’య చేశావె!

ABN , First Publish Date - 2021-09-13T06:46:41+05:30 IST

యూఎస్‌ ఓపెన్‌లో అనామకురాలిగా బరిలోకి దిగిన ఎమ్మా రదుకాను అద్భుతమే చేసింది. ప్రిలిమినరీ రౌండ్లలోనే కథ ముగుస్తుందని భావించి, ముందుగానే విమాన టిక్కెట్లు సిద్ధం చేసుకున్న ఈ బ్రిటన్‌ టీనేజర్‌.. టోర్నీ సాగుతున్న కొద్దీ ఔరా అనిపించే ప్రదర్శనతో అదరగొట్టింది...

‘ఎమ్మా’య చేశావె!

  • యూఎస్‌ ఓపెన్‌తో బ్రిటన్‌ టీనేజర్‌ రదుకాను సంచలనం
  • గ్రాండ్‌స్లామ్‌ నెగ్గిన క్వాలిఫయర్‌గా రికార్డు
  • ఫైనల్లో లేలాకు నిరాశ

యూఎస్‌ ఓపెన్‌లో అనామకురాలిగా బరిలోకి దిగిన ఎమ్మా రదుకాను  అద్భుతమే చేసింది. ప్రిలిమినరీ రౌండ్లలోనే కథ ముగుస్తుందని భావించి, ముందుగానే విమాన టిక్కెట్లు సిద్ధం చేసుకున్న ఈ బ్రిటన్‌ టీనేజర్‌.. టోర్నీ సాగుతున్న కొద్దీ ఔరా అనిపించే  ప్రదర్శనతో అదరగొట్టింది. సీడెడ్‌లకు షాకిస్తూ ఫైనల్‌ చేరిన ఎమ్మా.. టైటిల్‌ ఫైట్‌లోనూ అంతే దీటుగా విజృంభించింది. కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను  ముద్దాడి.. క్వాలిఫయర్‌ నుంచి చాంపియన్‌గా అవతరించింది.


న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌లో బ్రిటన్‌ యువ కెరటం ఎమ్మా రదుకాను పెను సంచలనం సృష్టించింది. ప్రొఫెషనల్‌ ఎరాలో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగి.. ఏకంగా టైటిల్‌ నెగ్గిన తొలి ప్లేయర్‌గా 18 ఏళ్ల రదుకాను చరిత్ర సృష్టించింది. తుది సమరంలో కెనడాకు చెందిన 19 ఏళ్ల లేలా అన్నె ఫెర్నాండెజ్‌ను ఓడించి తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ను ముద్దాడింది. క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో మూడు మ్యాచ్‌లతో కలిపి.. టోర్నీలో 10 మ్యాచ్‌లు ఆడిన రదుకాను ఒక్కసెట్‌ కూడా కోల్పోకుండా విజేతగా నిలవడం విశేషం. 

దూకుడే మంత్రంగా..: టోర్నీ ఆసాంతం కోర్టులో పాదరసంలా కదులుతూ.. దూకుడైన ఆటతో ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయిస్తున్న రదుకాను గంటా 51 నిమిషాలపాటు సాగిన ఫైనల్లోనూ అదే తీరును ప్రదర్శించింది. అన్‌సీడెడ్‌ ప్లేయర్ల మధ్య జరిగిన ఈ టైటిల్‌ ఫైట్‌లో రదుకాను 6-4, 6-3తో లేలా ఫెర్నాండెజ్‌ను చిత్తు చేసింది. మొదటి సెట్‌ రెండో గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీ్‌సను బ్రేక్‌ చేసిన రదుకాను 2-0తో పైచేయి సాధించింది. అయితే, తర్వాతి గేమ్‌లోనే ఎమ్మా సర్వీ్‌సను బ్రేక్‌ చేసిన లేలా 1-2తో నిలిచింది. ఆ తర్వాత ఇద్దరూ సర్వీ్‌స నిలబెట్టుకుంటూ సాగడంతో మ్యాచ్‌ ఆసక్తిగా మారింది. కానీ, 10వ గేమ్‌లో 40-40తో స్కోర్లు సమం కాగా.. బ్రేక్‌ పాయింట్‌తో రదుకాను 6-4తో తొలి సెట్‌ నెగ్గింది. రెండో సెట్‌లో లేలా సర్వీస్‌ను బ్రేక్‌ చేసి ఎమ్మా 4-2తో ముందంజ వేసింది. తర్వాతి గేమ్‌ నెగ్గి 5-2తో ఆధిక్యాన్ని పెంచుకొంది. 8వ గేమ్‌లో రెండుసార్లు మ్యాచ్‌ పాయింట్‌పై నిలిచినా ఒత్తిడికి లోనైన రదుకాను ఆ గేమ్‌ను ఫెర్నాండెజ్‌కు అప్పగించింది. కాగా, 5-3తో ఎమ్మా సర్వీస్‌ చేస్తున్నప్పుడు జారిపడడంతో ఎడమ మోకాలికి దెబ్బతగిలింది. ట్రైనర్‌ వచ్చి బ్యాండెయిడ్‌ వేసిన తర్వాత మళ్లీ ఆటను కొనసాగించిన రదుకాను.. రెండు బ్రేక్‌ పాయింట్లను కాపాడుకొని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పవర్‌ఫుల్‌ ఏస్‌తో మ్యాచ్‌ను ముగించింది.



రికార్డుల హోరు..


  1. క్వాలిఫయర్‌ హోదాలో గ్రాండ్‌స్లామ్‌ నెగ్గిన తొలి క్రీడాకారిణి ఎమ్మా రదుకాను.
  2. 1968లో వర్జీనియా వేడ్‌ తర్వాత యూఎస్‌ ఓపెన్‌ గెలిచిన తొలి బ్రిటన్‌ క్రీడాకారిణి ఎమ్మా. ఇంగ్లండ్‌ తరఫున చివరిగా 1977లో వేడ్‌ వింబుల్డన్‌ విజేతగా నిలవగా, ఆ తర్వాత ఆ దేశానికి మహిళల సింగిల్స్‌లో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ దక్కడం ఇదే మొదటిసారి. 
  3. 150వ ర్యాంక్‌తో యూఎస్‌ ఓపెన్‌లో అడుగుపెట్టిన ఎమ్మా.. తాజా విజయంతో ఏకంగా 24వ ర్యాంక్‌కు చేరుకోనుంది. దీంతో.. బ్రిటన్‌ తరఫున మహిళల సింగిల్స్‌లో టాప్‌ ర్యాంకర్‌గా ఆమె నిలవనుంది. 
  4. 2014లో సెరెనా తర్వాత ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా యూఎస్‌ ఓపెన్‌ నెగ్గిన క్రీడాకారిణి ఎమ్మా.  
  5. ప్రొఫెషనల్‌ ఎరా (1968 నుంచి)లో ఇద్దరు అన్‌సీడెడ్‌ ప్లేయర్ల మధ్య గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ జరగడం ఇదే తొలిసారి. 
  6. 2004లో షరపోవా (17 ఏళ్లు) తర్వాత గ్రాండ్‌స్లామ్‌ నెగ్గిన పిన్న వయసు ప్లేయర్‌ రదుకాను. 


ప్రైజ్‌ మనీ..

ఎమ్మా రదుకానుకు రూ. 18.38 కోట్లు

లేలా ఫెర్నాండెజ్‌కు  రూ. 9.19 కోట్లు 




క్వీన్‌ ఎలిజబెత్‌ ప్రశంసలు

యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ రదుకానుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘బ్రిటన్‌ స్పోర్టింగ్‌ క్వీన్‌’ అంటూ ఆ దేశ మీడియా కీర్తించింది. ఇక.. బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌.. రదుకానుకు శుభాకాంక్షలు చెబుతూ లేఖ పంపారు. మ్యాచ్‌ అనంతరం అధికారులు ఆ లేఖను ఎమ్మాకు అందించారు. ‘పిన్న వయసులోనే గొప్ప విజయాన్ని అందుకొన్నావ’ని తన సందేశంలో రాణి ప్రశంసించారు. 

Updated Date - 2021-09-13T06:46:41+05:30 IST