ఈఎంఐలు మరింత భారం

ABN , First Publish Date - 2022-08-06T06:28:05+05:30 IST

రుణాలు మరింత ప్రియం కానున్నాయి. గృహ, వాహన, వ్యక్తిగత రుణగ్రహీతలపై ఈఎంఐ చెల్లింపుల భారం మరింత పెరగనుంది. ఎందుకంటే, రుణాలకు ప్రామాణికమైన రెపో రేటును భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మరో 0.50 శాతం పెంచింది.

ఈఎంఐలు మరింత భారం

5.40 శాతానికి కీలక వడ్డీ రేటు 

ఆర్‌బీఐ రెపో రేటు మరో 0.50 శాతం పెంపు

ధరల కట్టడికి వరుసగా మూడో వడ్డింపు

2019 తర్వాత ఇదే అత్యధిక పెంపు


ముంబై: రుణాలు మరింత ప్రియం కానున్నాయి. గృహ, వాహన, వ్యక్తిగత రుణగ్రహీతలపై ఈఎంఐ చెల్లింపుల భారం మరింత పెరగనుంది. ఎందుకంటే, రుణాలకు ప్రామాణికమైన రెపో రేటును  భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మరో 0.50 శాతం పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో నాలుగో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో భాగంగా ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు 5.40 శాతానికి చేరుకుంది. కరోనా సంక్షోభ పూర్వ స్థాయి 5.15 శాతం కంటే 0.25 శాతం అధికమిది. అదుపు తప్పిన ధరలను కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ రెపో రేటును పెంచడం వరుసగా ఇది మూడోసారి. నాలుగు నెలల్లో (మే నుంచి ఇప్పటివరకు) రెపో 1.40 శాతం పెరిగింది. 2019 తర్వాత ఇదే అత్యధిక పెంపు. అంతేకాదు, అర శాతం వడ్డించడం వరుసగా రెండోసారి. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఆర్‌బీఐ ఈ ఏడాది మే నెలలో తొలిసారిగా రెపో రేటును 0.40 శాతం పెంచింది.

 

మున్ముందు మరిన్ని వడ్డింపులు: వృద్ధికి మద్దతిస్తూనే ధరలను నియంత్రించేందుకు వడ్డీ రేట్లపై సానుకూల వైఖరిని క్రమంగా ఉపసంహరించుకోవడంపైనే దృష్టి సారించాలని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయించింది. వడ్డీ రేట్లపై కఠిన వైఖరి ఇంతటితో ముగియలేదని, మున్ముందు మరిన్ని వడ్డింపులుంటాయని దాస్‌ సంకేతాలిచ్చారు. 


అయితే, ఈ ఆర్థిక సంవత్సరానికి 7.2 శాతం జీడీపీ వృద్ధి రేటు, 6.7 శాతం రిటైల్‌ ద్రవ్యోల్బణం అంచనాలను మాత్రం ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగించింది. ద్రవ్యోల్బణాన్ని 2 నుంచి 6 శాతం శ్రేణిలో కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆర్‌బీఐకి లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ, ఈ ఏడాది జనవరి నుంచి సూచీ 6 శాతం ఎగువనే నమోదవుతూ వస్తోంది. జూన్‌లోనూ 7.01 శాతంగా నమోదైంది. ధరలిప్పటికే పతాక స్థాయిని తాకాయని, క్రమంగా తగ్గుముఖం పట్టనున్నాయని దాస్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ, ఇప్పటికీ ఆందోళనకర స్థాయిలోనే ఉన్నాయన్నారు. కరెంట్‌ ఖాతా లోటును కట్టడి చేయవచ్చని, ఆర్‌బీఐకి ఆ సామర్థ్యం ఉందన్నారు. భారత్‌ ఆర్థిక స్థిరత్వ ద్వీపం అల్లకల్లోల, అనిశ్చితి సంద్రంలో భారత్‌ ఆర్థిక స్థిరత్వ ద్వీపం లాంటిది. ఒక దాని తర్వాత ఒకటిగా ప్రపంచాన్ని కుదిపేసిన రెండు హఠాత్పరిణామాల (కరోనా సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం)తోపాటు పలు అఘాతాలు ఎదురైనప్పటికీ దేశం ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోగలిగింది. వృద్ధి కూడా తిరిగి పుంజుకుంది.   


పాలసీ ముఖ్యాంశాలు

  • రెపో రేటు 0.50 శాతం పెంపు. 5.40 శాతానికి చేరిన రెపో 
  • వరుసగా మూడు సమీక్షల్లో 1.40 శాతం పెరిగిన రెపో రేటు 
  • ఈ ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7.2 శాతంగా అంచనా 
  • వచ్చే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.7 శాతంగా అంచనా 
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనా 6.7 శాతం
  • ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 3వరకు స్టాక్‌ మార్కెట్‌ నుంచి 1,330 కోట్ల డాలర్ల విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు వెనక్కి 
  • మన ఆర్థిక సేవల రంగం పటిష్ఠం. మూలధన నిధులూ పుష్కలం
  • విదేశీ మారక నిల్వలతో అంతర్జాతీయ పరిణామాల నుంచి రక్షణ
  • ధరల నియంత్రణకు వడ్డీ రేట్లపై సానుకూల వైఖరిని క్రమంగా ఉపసంహరించుకోవడంపైనే దృష్టి సారించాలని ఎంపీసీ నిర్ణయం 
  • డాలర్‌ బలపడటంతో రూపాయి విలువ తగ్గిందే తప్ప.. మన దేశ ఆర్థిక మూలాలు బలహీనపడలేదు 
  • సెప్టెంబరు 28-30 తేదీల్లో తదుపరి ద్రవ్య పరపతి విధాన సమీక్ష 


ఇక సీఐసీల్లోనూ అంబుడ్స్‌మన్‌ 

అంతర్గత అంబుడ్స్‌మన్‌ వ్యవస్థ పరిధిని మరింత విస్తరించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ఈ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ బలోపేతానికి క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీలను (సీఐసీ) సైతం ఈ పరిధిలోకి తెస్తున్నట్లు తెలిపింది. ఇకపై సీఐసీలూ అంతర్గత అంబుడ్స్‌మన్‌ వ్యవస్థను కలిగి ఉండటం తప్పనిసరిగా మారనుంది. 


6 శాతం దాటనున్న రెపో 

ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రెపో రేటును 6-6.5 శాతానికి పెంచే అవకాశాలున్నాయని ఆర్థికవేత్తలు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మున్ముందు సమీక్షల్లో మరో అర వడ్డింపు అవకాశాల్లేకపోలేవని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ప్రధాన ఆర్థికవేత్త మదన్‌ సబ్నవిస్‌ అన్నారు. ఈ డిసెంబరు నాటికల్లా మరో అర శాతం పెంచవచ్చని బార్‌క్లేస్‌ ఇండియా చీఫ్‌ ఎకనామిస్ట్‌ రాహుల్‌ బజోరియా అభిప్రాయపడ్డారు. 


నిధుల కోసం నిత్యం ఆర్‌బీఐ పైనే ఆధారపడవద్దు.. 

రుణ వితరణకు అవసరమైన నిధుల కోసం బ్యాంక్‌లు నిత్యం ఆర్‌బీఐ పైనే ఆధారపడవద్దని దాస్‌ సూచించారు. బ్యాంక్‌లు సొంత వనరులు, నిధులు సమకూర్చుకోవాలని.. ఇందుకోసం మరింతగా డిపాజిట్లు సమీకరించాల్సిన అవసరం ఉందన్నారు. రెపో పెంపునకు అనుగుణంగా బ్యాంకులు ఇప్పటికే డిపాజిట్‌ రేట్లను పెంచడం ప్రారంభించాయన్న గవర్నర్‌.. మున్ముందూ ఈ ట్రెండ్‌  కొనసాగనుందన్నారు. 


ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ 


ఈఎంఐ భారం పెంపు ఎంతంటే !  

ఊహించినట్టే ఆర్‌బీఐ రెపో రేటు మరో అర శాతం పెంచింది. దీంతో బ్యాంకులు తమ గృహ, వాహన, వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లను మరింత పెంచనున్నాయి. ఈ పెంపు కూడా ఆర్‌బీఐ రెపో రేటు పెంచిన అర శాతం మేర ఉంటుం దని మార్కెట్‌ వర్గాల అంచనా. దాంతో ఈ రుణాలపై చెల్లించే ఈఎంఐల భారం ఇలా పెరగనుంది.


గృహ రుణాలు: మంచి క్రెడిట్‌ స్కోరు ఉన్న వ్యక్తులకు బ్యాంకులు, గృహ ఫైనాన్స్‌ కంపెనీలు ప్రస్తుతం 7.5ు వడ్డీకి గృహ రుణాలు ఇస్తున్నాయి. ఈ లెక్కన ఇరవై ఏళ్ల కాలానికి తీసుకున్న రూ.30 లక్షల గృహ రుణంపై.. ప్రస్తుతం రూ.25,093 ఈఎంఐ చెల్లించాల్సి వస్తోంది. కనీస వడ్డీ రేటుని అర శాతం (0.5ు) పెంచితే ఈఎంఐ భారం రూ.26,034కు చేరుతుంది. అంటే ప్రతి రూ.లక్షకు ఈఎంఐ భారం రూ.31.37  చొప్పున పెరిగి రూ.941కు చేరనుంది.


వాహన రుణాలు: ప్రస్తుతం బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు మంచి పరపతి స్కోరు ఉన్న వ్యక్తులకు ఏడేళ్లలో చెల్లించేలా 10.5 శాతం వడ్డీతో రూ.8 లక్షల వరకు వాహన రుణాలు ఇస్తున్నాయి. ఈ వడ్డీ రేటుతో ప్రస్తుత ఈఎంఐ రూ.13,489. వడ్డీ రేటు 11 శాతానికి చేరితే ఈ భారం రూ.209 పెరిగి రూ.13,698కు చేరనుంది.


వ్యక్తిగత రుణాలు: పరపతి స్కోరును బట్టి బ్యాంకులు ఐదేళ్లలో చెల్లించే వ్యక్తిగత రుణాలపై  14.5 శాతం కనీస వడ్డీ రేటు వసూలు చేస్తున్నాయి. ఈ లెక్కన ఈ రుణాలపై ప్రస్తు తం చెల్లించే ఈఎంఐ రూ.11,764. రెపో రేటుకు అనుగుణంగా బ్యాంకులు ఈ రుణాల వడ్డీ రేటు మరో అర శాతం పెంచితే ఈ భారం మరో రూ.131 పెరిగి రూ.11,895కు చేరనుంది.


పెరగనున్న ఎఫ్‌డీ రేట్లు: రెపో రేటు పెంపు ప్రభావం ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పైనా పడనుంది. రెండు నుంచి ఐదేళ్ల కాల పరిమితి ఉండే ఎఫ్‌డీలపై ఎస్‌బీఐతో సహా అనేక బ్యాంకులు ప్రస్తుతం 5.35 శాతం నుంచి 5.5 శాతం వడ్డీ చెల్లిస్తున్నాయి. అంటే ఇంచుమించు ఇది ప్రస్తుత రెపో రేటుకు సమానం. పదేళ్ల కాలపరిమితి ఉండే ప్రభుత్వ రుణ పత్రాలపై వడ్డీ రేటు ఇప్పటికే 7 శాతం మించి పోయింది. ఆర్‌బీఐ ముందు ముందు రెపో రేటు మరింత పెంచబోతోంది. దీంతో ఎఫ్‌డీల వడ్డీ రేట్లూ త్వరలోనే 8 శాతానికి చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Updated Date - 2022-08-06T06:28:05+05:30 IST