మోక్ష గుండంకు ప్రవాస భారత, ఎమిరాటి ఇంజనీర్ల నివాళులు..

ABN , First Publish Date - 2020-09-18T14:13:06+05:30 IST

గొప్ప భారతీయ ఇంజనీర్, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి(సెప్టెంబర్ 15) సందర్భంగా ఎమిరాటి, యూఏఈలోని భారత నిపుణులు మరియు ఇంజనీర్లు ఒక వర్చువల్ కార్యక్రమం ద్వారా కలిసి నివాళి అర్పించారు.

మోక్ష గుండంకు ప్రవాస భారత, ఎమిరాటి ఇంజనీర్ల నివాళులు..

దుబాయ్: గొప్ప భారతీయ ఇంజనీర్, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి(సెప్టెంబర్ 15) సందర్భంగా ఎమిరాటి, యూఏఈలోని భారత నిపుణులు మరియు ఇంజనీర్లు ఒక వర్చువల్ కార్యక్రమం ద్వారా కలిసి నివాళి అర్పించారు. ఈ వెబ్‌నార్‌ను సైన్స్ ఇండియా ఫోరం-యూఏఈ నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన దుబాయ్ విశ్వవిద్యాలయ అధ్యక్షుడు డాక్టర్ ఈసా మొహమ్మద్ బస్తాకి... "శ్రీ విశ్వేశ్వరయ్య 102 ఏళ్లు జీవించారు. 1962లో నాకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు బాంబే వెళ్లాను. నేను బాంబే వెళ్లడానికి నాలుగు నెలల ముందు ఆయన కన్నుమూశారు. ఆయన భారతదేశానికి, ఇంజనీరింగ్ ప్రపంచానికి ఎంతో కృషి చేశారు. మొత్తం సమాజ ప్రయోజనాల కోసం ఇంజనీరింగ్‌ను ఉపయోగించుకోవడంలో ఆయనకు మంచి అవగాహన ఉండేది. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరించింది" అని బస్తాకి చెప్పారు. 


న్యూఢిల్లీ నుంచి మాట్లాడిన జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జగదేశ్ కుమార్... విశ్వేశ్వరయ్య వరద రక్షణ వ్యవస్థను, అనేక ఇతర ఇంజనీరింగ్ అద్భుతాలను ఎలా రూపొందించారో గుర్తు చేసుకున్నారు. "అతను 1883లో డిగ్రీ పొందిన కొద్దిమంది ఇంజనీర్లలో ఒకరు. దేశవ్యాప్తంగా అనేక నీటి సరఫరా, నీటిపారుదల వ్యవస్థల రూపకల్పనకు సహకరించారు. దేశ పారిశ్రామికీకరణపై ఆయన పాత్ర చాలా ఉంది. అతను ఎప్పుడూ వైఫల్యాలకు భయపడలేదు" అని అన్నారు. 


గ్రామీణ భారతదేశం, మొత్తం భారత ఇంజనీరింగ్ పరిశ్రమ అభివృద్ధిలో విశ్వేశ్వరయ కీలక వ్యక్తి అని దుబాయ్‌లోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి నొక్కిచెప్పారు. "భరత మాత ముద్దు బిడ్డ మోక్షగుండం. అతను కృష్ణ రాజా సాగర్ ఆనకట్ట నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. దేశం పట్ల ఆయనకున్న అభిమానాన్ని వివరించడానికి మాటలు సరిపోవు" అని పూరి చెప్పుకొచ్చారు.


అలాగే యూఏఈ అభివృద్ధికి కీలక కృషి చేసిన వారిలో నేటి భారతీయ ఇంజనీర్లు ఉన్నారని పూరి ఈ సందర్భంగా గుర్తు చేశారు. "రాబోయే దుబాయ్ ఎక్స్‌పోలో భారతీయ సహకారం, భాగస్వామ్యం గణనీయంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు సహకరించిన అనేక మంది భారతీయ ఇంజనీర్లకు ధన్యవాదాలు" అని పూరి అన్నారు. కాగా, భారతదేశంలో ప్రతి యేటా మోక్షగుండం జయంతిని 'ఇంజనీర్స్ డే'గా జరుపుకుంటారు అనేది తెలిసిందే. 

 

Updated Date - 2020-09-18T14:13:06+05:30 IST