మూర్తీభవించిన జాతీయవాద స్ఫూర్తి

ABN , First Publish Date - 2021-02-18T06:16:59+05:30 IST

తెలుగు ప్రజల నాయకుడు ఎన్టీఆర్. అదే సమయంలో తాను భారతీయుడిని అన్న వాస్తవాన్ని ఆయన విస్మరించలేదు. ప్రాంతీయ స్వతంత్ర ప్రతిపత్తి...

మూర్తీభవించిన జాతీయవాద స్ఫూర్తి

తెలుగు ప్రజల నాయకుడు ఎన్టీఆర్. అదే సమయంలో తాను భారతీయుడిని అన్న వాస్తవాన్ని ఆయన విస్మరించలేదు. ప్రాంతీయ స్వతంత్ర ప్రతిపత్తి, దేశాభిమానం మధ్య ఆయన సంపూర్ణ సమదృష్టిని పాటించారు. ‘జాతీయవాదం’ వివాదాస్పద భావన అయిన కాలంలో ఆయన ఈ సమతుల్య రాజనీతిజ్ఞతను ఎలా ఆచరించారో చూడడం ఆసక్తిదాయకం. మూర్తీభవించిన దేశభక్తే ఎన్టీఆర్. భారత్ సమైక్యత కోసం, సమగ్రత కోసం దృఢంగా నిలిచిన నాయకుడు. ఆయనలోని తెలుగు ఉప జాతీయవాదంలో, తొలినాటి డిఎంకెలో వలే సంకుచిత వేర్పాటువాద ధోరణులు ఏమాత్రం లేవు. ఎన్టీఆర్ తన ప్రసంగాలను సదా ‘జై తెలుగునాడు, జైహింద్’ అనే ఉద్ఘోషలతో ముగించేవారు. తెలుగు అస్తిత్వంపై ఆయన ఆత్మ ప్రత్యయంలో తెలుగేతరుల పట్ల ఎలాంటి ప్రాతికూల్యం లేదు. ఎన్టీఆర్ ఒక విభిన్న నాయకుడు అని ఎడిటర్ గిరిలాల్ జైన్ (టైమ్స్ ఆఫ్ ఇండియా) 1983 మే నాటికే గుర్తించారు. ‘ఉత్తర భారతావనిలోని ప్రతిపక్షాలతో సంబంధాలు నిర్మించుకోవడానికి దక్షిణాది ముఖ్యమంత్రులలో చొరవచూపినది ఆయన ఒక్కరే. ఇదే, రామారావు నాయకత్వ విశిష్టత’ అని జైన్ పేర్కొన్నారు. ‘తెలుగుల ఆత్మగౌరవ పరిరక్షకుడు అయిన ఎన్టీఆర్ నిలువెల్లా దేశభక్తుడు, భారతీయత మూర్తీభవించినవాడు. న్యాయబద్ధమైన ప్రాంతీయ ఆకాంక్షలను, సుదృఢమైన, అచంచల జాతీయ వాద నిబద్ధతతో సమ్మిళితం చేయడంలో ఒక ఉత్కృష్ట ఉదాహరణను ఆయన నెలకొల్పారు’ అని లాల్ కృష్ణ ఆడ్వాణీ అన్నారు. 


చాలామంది జాతీయనాయకుల కంటే ఎన్టీఆర్ స్వతస్సిద్ధంగా మరింత సమున్నత జాతీయవాది. తుంగభద్ర నదీ జలాల విషయమై నాటి కర్ణాటక ముఖ్యమంత్రి దేవెగౌడ చేసిన ఒక ప్రకటనపై ఒక తీవ్ర ప్రతి ప్రకటన చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కోరినప్పుడు వారిని ఎన్టీఆర్ ఎలా చివాట్లు పెట్టారో జయప్రకాశ్ నారాయణ్ (మాజీ ఐఏఎస్ అధికారి, పౌర సమాజ క్రియాశీలి) గుర్తు చేసుకున్నారు. ‘దేవెగౌడ రెచ్చగొట్టే ప్రకటన చేసినంత మాత్రాన నేను ప్రతిస్పందించను. కర్ణాటక కూడా భారతదేశంలోనే ఉంది. కన్నడిగులు కూడా మన ప్రజలే. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామంటూ తన సొంత పార్టీ నాయకులను ఎన్టీఆర్ మందలించారు’ అని జయప్రకాశ్ తెలిపారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఆయన తావిచ్చేవారు కాదు. సమకాలిక నేతల వలే సంకుచిత దృష్టితో ఆయన ఎప్పుడూ వ్యవహరించలేదు. తదనంతర కాలంలో ప్రభవించి, వర్ధిల్లుతున్న నాయకులలో ప్రస్ఫుటంగా కన్పించే స్వప్రయోజన దృష్టి కూడా ఆయనలో ఏ కోశాన లేదు. ఈ విశాల దృక్పథమే, జాతీయస్థాయిలో నిర్మాణాత్మక పాత్ర వహించేందుకు ఎన్టీఆర్‌ను పురిగొల్పింది. 


భారత్ ఒక పటిష్ఠ సమాఖ్యరాజ్యంగా వర్ధిల్లాలని ఎన్టీఆర్ ప్రగాఢంగా ఆకాంక్షించారు. దానికోసం అకుంఠితంగా పోరాడారు. ఆర్థిక వనరులను కేంద్రం, రాష్ట్రాల మధ్య మరింత సమానస్థాయిలో పంపకం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఒక పరిపూర్ణ జాతీయవాదిగానే రాష్ట్రాల హక్కుల కోసం ఆయన పోరాడారు. ఎన్టీఆర్ జాతీయ వాద దృక్పథం సుస్థిరమైనది. ‘బలమైన రాష్ట్రాలతో మాత్రమే సుదృఢ కేంద్రం సుసాధ్యమవుతుంది. దేశంలోని ఏ ప్రాంతం లోనైనా వేర్పాటువాదశక్తులు తలెత్తితే వాటికి వ్యతిరేకంగా నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతాను’ అని కలకత్తాలో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో ఆయన విస్పష్టంగా ప్రకటించారు. ఇటువంటి నిజమైన జాతీయవాద స్ఫూర్తి ఉన్నందునే విదేశాలలో పర్యటించేటప్పుడు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క పొల్లు మాట కూడా ఆయన మాట్లాడేవారు కాదు. 1984లో అమెరికాలో పర్యటిస్తున్నప్పుడు ఎన్టీఆర్‌ను మధు ట్రెహాన్ (ఇండియా టుడే) ఒక ప్రశ్న అడిగారు. అప్పటికే ఇందిరాగాంధీ ప్రభుత్వంతో ఎన్టీఆర్ సంబంధాలు బెడిసిన వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్న ప్రవాస భారతీయులకు కేంద్రం అడ్డుపడే అవకాశముందా? అని ఇండియా టుడే ప్రతినిధి ఆయనకు ప్రశ్నించారు. దానికి ఆయన విస్పష్టంగా ప్రతిస్పందిస్తూ, ‘నేను ఇప్పుడు న్యూయార్క్‌లో ఉన్నాను. ఇక్కడి విలేకర్లతో మాట్లాడుతున్నాను. ఈ విషయాన్ని నేను మరచిపోలేను. కనుక మేమంతా గౌరవించే భారతదేశపు కేంద్రప్రభుత్వంపై నేను ఎలాంటి వ్యాఖ్య చేయను, చేయబోను’ అన్నారు. 


ఈ జాతీయవాద అంతఃప్రవృత్తే, 1980 దశకంలో ఆనాటి పాలకపక్షం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల సమావేశాలను సంచలనాత్మకంగా నిర్వహించేందుకు, ఎన్టీఆర్‌ను ప్రోద్బలించింది. జనతాపార్టీ ప్రయోగం విఫలమైన అనంతరం జాతీయస్థాయిలో సంకీర్ణ రాజకీయాల రూపశిల్పి ఎన్టీఆరే. ‘నేను ఒక జాతీయ పార్టీ ప్రాంతీయ నాయకుడిని అయితే ఎన్టీఆర్ ఒక ప్రాంతీయపార్టీ జాతీయ నాయకుడు ’అని అప్పట్లో జనతాపార్టీలో ఉన్న ఎస్. జైపాల్‌రెడ్డి తరచు ప్రశంసాపూర్వకంగా అంటుండేవారు. 


ఆసేతు హిమాచలం పలు రాష్ట్రాలలో విస్తృతస్థాయిలో ఎన్నికల ప్రచారం చేసిన ఏకైక ప్రాంతీయ నాయకుడు ఎన్టీఆర్. కాంగ్రెస్‌పార్టీకి జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయాన్ని నిర్మించే ప్రయత్నాలలో భాగంగా ఆయన దేశవ్యాప్తంగా పర్యటించారు. ఉత్తర భారతావనిలో తన బహిరంగసభలకు అశేష జనబాహుళ్యాన్ని ఆకర్షించిన ఏకైక ప్రాంతీయపార్టీ నాయకుడు సైతం ఎన్టీఆరే. నేషనల్ ఫ్రంట్‌కు మద్దతుగా జమ్మూ-కశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, ఒడిషా, పశ్చిమబెంగాల్, అసోం, నాగాలాండ్ సహా 16 రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎల్లెడలా ఆయన తన చైతన్యరథంపై పర్యటించారు. అన్ని చోట్లా స్థానిక నేతల తోడ్పాటు లేకుండానే ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. 


ఎన్టీఆర్ కారణంగానే 1980 దశకంలో న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌భవన్ కాంగ్రెసేతర సంకీర్ణ కూటమి కార్యకలాపాలకే కేంద్ర బిందువు అయింది. విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్ నేతృత్వంలో కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటులో ఎన్టీఆర్ కృషి గణనీయమైనది. అవిస్మరణీయమైనది. ప్రతిపక్ష ఫ్రంట్‌ను పటిష్ఠపరిచేందుకు మరే ముఖ్యమంత్రి లేదా మరే ప్రాంతీయపార్టీ అధినేత ఎన్టీఆర్‌లా తన సమయాన్ని, శక్తినీ వెచ్చించలేదు. కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటు లక్ష్య సాధనకు గాను పరస్పర వ్యతిరేకులయిన వామపక్షాలు, భారతీయ జనతాపార్టీని ఒకే వేదిక మీదకు తీసుకు వచ్చిన ఏకైక నాయకుడిగా ఎన్టీఆర్ ప్రసిద్ధికెక్కారు. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులోనూ, దాన్ని అధికారానికి తీసుకునిరావడంలోనూ ఆయన నిర్వహించిన కీలకపాత్రకు సరైన గుర్తింపు లభించలేదు. ఇది ఎంతైనా దురదృష్టకరం. 1989 ఎన్నికలలో కేంద్రంలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వం పరాజయం చెందడంలో ఎన్టీఆర్ పార్టీ అద్వితీయమైనది. అయినా ఆయన నిర్ణయాత్మక కృషికి సముచిత గుర్తింపు కొరవడిందని ప్రముఖ రాజకీయ పాత్రికేయురాలు కల్యాణి శంకర్ వ్యాఖ్యానించారు. 


సరిగ్గా 1996 లోక్‌సభ ఎన్నికలు ఆసన్నమయిన తరుణంలో ఎన్టీఆర్ మరణించారు. ఇది చాలా దురదృష్టకరమని ఆయన అభిమానులు ఇప్పటికీ విచారపడుతుంటారు. 1996 జూన్‌లో ప్రధానమంత్రి పదవికి హెచ్‌డి దేవెగౌడ స్థానంలో ఎన్టీఆర్ తప్పకుండా అందరికీ ఆమోదయోగ్యుడైన అభ్యర్థి అయి ఉండేవారని విశ్వసించే వారు ఎందరో ఉన్నారు. ఇది పూర్తిగా నిరాధారమైన ఊహ కాదని నిశ్చితంగా చెప్పవచ్చు. 1989లో సైతం, తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలవ్వకుండా ఉన్నట్టయితే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చౌధరి దేవీలాల్‌తో పాటు ఎన్టీఆర్ ప్రధాన పోటీదారు అయివుండే వారనడంలో సందేహం లేదు. 


ఎన్టీఆర్ రాజకీయ జీవితం నిండా పద్నాలుగు సంవత్సరాలు కూడా సాగలేదు. అయినా ఈ స్వల్పకాలంలోనే చరిత్రపై ఆయన వేసిన ముద్ర అసాధారణమైనది. కాలం తాకిడికి చెరిగిపోనిది. చాలామంది నాయకుల వలే ఆయన కూడా స్థానిక సమస్యలు, ఆకాంక్షలకు సమాధానంగా ప్రభవించారు. ఆయన రాజకీయభావాలు, ఆలోచనలు పేదలలో నిరుపేదల ప్రాథమిక అవసరాలను తీర్చేందుకే ప్రాధాన్యమిచ్చాయి. దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలకు కాకుండా పేదలకు కూడు గూడు గుడ్డ సమకూర్చేందుకే ఆయన సదా అత్యధిక ప్రాధాన్యమిచ్చేవారు. 


నరసింహారావు ప్రభుత్వం ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలను ఎన్టీఆర్ వ్యతిరేకించారు. ‘ప్రభుత్వం తన వద్ద ఉన్న ధనాన్ని పూర్తిగా పేదల శ్రేయస్సుకే వినియోగించాలని’ ప్రముఖ పాత్రికేయుడు శేఖర్ గుప్తాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన నొక్కి చెప్పారు. ‘దేశ ప్రజలకు మేలు చేయని, విదేశీయులకు లబ్ధినిచ్చే సంస్కరణలను తాను అంగీకరించబోనని’ ఆయన ఖండితంగా చెప్పారు. సంక్షేమేతర రంగాలలో ప్రభుత్వం మదుపు చేయడాన్ని ఎన్టీఆర్ వ్యతిరేకించారు. ‘స్వరాజ్ అంటే సంపన్నుల నుంచి సంపదను తీసుకుని పేదలకు ఇవ్వడమే గానీ, పేదల నుంచి తీసుకుని విదేశీయులకు ఇవ్వడం కానేకాదని’ శేఖర్ గుప్తాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ స్పష్టం చేశారు. తన సొంత రాజకీయ దృక్పథాన్ని తానే అభివృద్ధి చేసుకోవడం ఎన్టీఆర్ విలక్షణతల్లో ఒకటి. అనుకూల పరిస్థితులలోనూ, ప్రతికూల పరిస్థితులలోనూ ఆయన పూర్తిగా దానికే కట్టుబడి ఉన్నారు. 

కందుల రమేశ్‌

సీనియర్ పాత్రికేయుడు


పాత్రికేయుడు కందుల రమేష్ రచించిన ‘మావెరిక్ మెసయ్య:

ఎ పొలిటికల్ బయోగ్రఫీ ఆఫ్ ఎన్.టి.రామారావు’ పుస్తకంలోని  ఒక భాగం స్వేచ్ఛానువాదం ఇది. దీని ఆవిష్కరణ సభ నేడు సాయంత్రం 5 గంటలకు హోటల్ దసపల్లాలో జరగనున్నది. ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. రాజకీయ వ్యాఖ్యాత సంజయ్ బారు ప్రసంగిస్తారు.

Updated Date - 2021-02-18T06:16:59+05:30 IST