ఏడుగురు పిల్లలున్న ఎలాన్ మస్క్ వైరల్ ట్వీట్! అలా జరుగుతుందనుకుంటే.. ఇలా అయిందంటూ..

ABN , First Publish Date - 2022-04-04T00:08:53+05:30 IST

ఈ విషయమై గతంలో అనేక మార్లు ఆందోళన వ్యక్తం చేసిన టెస్లా అధినేత మస్క్.. ఆదివారం మరో కీలక ట్వీట్ చేశారు.

ఏడుగురు పిల్లలున్న ఎలాన్ మస్క్ వైరల్ ట్వీట్! అలా జరుగుతుందనుకుంటే.. ఇలా అయిందంటూ..

ఎన్నారై డెస్క్: నానాటికీ పడిపోతున్న జననాల రేటు..  ఇదీ ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. వివిధ కారణాలతో ప్రజలు పిల్లల్ని కనేందుకు విముఖత ప్రదర్శిస్తుండటంతో అనేక దేశాల్లో జననాల రేటు క్రమంగా పడిపోతోంది. ఈ విషయమై గతంలో అనేక మార్లు ఆందోళన వ్యక్తం చేసిన టెస్లా అధినేత మస్క్..  ఆదివారం మరో కీలక ట్వీట్ చేశారు. పడిపోతున్న జననాల రేటుపై సైంటిఫిక్ అమెరికన్ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఓ వ్యాసాన్ని మస్క్ షేర్ చేశారు.  కరోనా సంక్షోభం కారణంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైన సమయంలో.. సంతానోత్పత్తి రేటు పెరుగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేయగా.. అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందని ఈ అధ్యయనంలో తేలింది.  


ఈ నేపథ్యంలో..  ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య  తగ్గుతున్న జననాల రేటేనని మస్క్ పేర్కొన్నారు. పుట్టనివారి కోసం మానవులు బాధపడాల్సిన దుస్థితి రాకూడదని వ్యాఖ్యానించారు. ఇక గతంలో జరిగిన అనేక అధ్యయనాలు సంతానోత్పత్తి తగ్గుతున్న విషయాన్ని పేర్కొన్నాయి. 2016 నుంచి 2021 మధ్య కాలంలో..అత్యధిక వార్షిక ఆదాయం ఉన్న 22 దేశాల్లో జననాల రేటు చెప్పుకోదగ్గ స్థాయిలోనే తగ్గింది. హంగరీలో అత్యధికంగా 9.1 శాతం, స్పెయిన్‌లో 8.4 శాతం, పోర్చుగల్‌లో 6.6 శాతం మేర జననాల రేటు తగ్గినట్టు తేలింది. ఇక చైనాలో సంతానోత్పత్తి రేటు ఏకంగా 15 శాతం మేర పడిపోయినట్టు 2021లో నేషనల్ జాగ్రఫిక్ ఛానల్‌లో ప్రచురితమైన మరో అధ్యయనం తేల్చింది. కాగా.. ఇప్పటికే ఆరుగురు పిల్లలు ఉన్న మస్క్.. కొద్ది రోజుల క్రితమే మరోసారి తండ్రయ్యారు. మస్క్ తొలి సంతానం.. పుట్టిన పది వారాలకే కన్నుమూశాడు. 

Updated Date - 2022-04-04T00:08:53+05:30 IST