పేదలకు ‘కనెక్షన్ల’పై సర్కారు శీతకన్ను

ABN , First Publish Date - 2022-05-15T08:44:52+05:30 IST

‘‘జగనన్న కాలనీల పేరుతో నిర్మిస్తున్న పేదల ఇళ్లకు కరెంటు కనెక్షన్లు ఇవ్వడంలో వైసీపీ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. 14 లక్షల ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వడానికి రూ.4,500 కోట్లు కావాలని మూడు విద్యుత్‌ సంస్థలు అడిగాయి. రూపాయి కూడా ఇవ్వలేమని, బయట అప్పులు

పేదలకు ‘కనెక్షన్ల’పై సర్కారు శీతకన్ను

అప్పు తెచ్చుకోవాలని విద్యుత్‌ సంస్థలకు సీఎం ఉచిత సలహా

మళ్లీ 4500 కోట్లు అప్పు చేసి బిల్లులు బాదుతారా?: టీడీపీ 


అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): ‘‘జగనన్న కాలనీల పేరుతో నిర్మిస్తున్న పేదల ఇళ్లకు కరెంటు కనెక్షన్లు ఇవ్వడంలో వైసీపీ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. 14 లక్షల ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వడానికి రూ.4,500 కోట్లు కావాలని మూడు విద్యుత్‌ సంస్థలు అడిగాయి. రూపాయి కూడా ఇవ్వలేమని, బయట అప్పులు తెచ్చుకోవాలని ముఖ్యమంత్రి వాటికి ఉచిత సలహా ఇచ్చారు. ఈ మాత్రం సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రే కావాలా? ఆ సంస్థలకు తెలియదా? విద్యుత్‌ సంస్థలు ఇప్పటి వరకు తెచ్చిన అప్పులకే కరెంటు బిల్లులు పేలుతున్నాయి. మళ్లీ 4500 కోట్లు అప్పులు తెస్తే వాటిని ఎవరు కట్టాలి? మళ్లీ కరెంటు బిల్లులు పెంచుతారా? ఈ ఖర్చును ప్రభుత్వం ఎందుకు భరించదు?’’ అని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ప్రశ్నించారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ,  బీసీలకు ఇళ్లు కట్టించడానికే మొత్తం ప్రభుత్వ ఆదాయమంతా ఖర్చు పెడుతున్నట్లు బహిరంగ సభల్లో చెబుతున్న ముఖ్యమంత్రి ఆచరణలో  మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జగన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలోని విద్యుత్‌ సంస్థలు రూ.30 వేల కోట్ల అప్పులు తెచ్చాయన్నారు. ఈ డబ్బును ప్రభుత్వం ఇతర ఖర్చులకు వాడేసిందని, వాటి అవసరాలకు పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. దీంతో విద్యుత్‌ సంస్థలు ఇష్టానుసారం కరెంటు బిల్లులు పెంచేసి జనాన్ని బాదుతున్నాయన్నారు. ప్రభుత్వం ఆదాయం నుంచి పైసా కూడా ఇవ్వకుండా, అప్పు తెచ్చుకోవాలని ప్రభుత్వ సంస్థలను బ్యాంకులపైకి తోలడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, తెస్తున్న అప్పులన్నీ ఏం చేస్తున్నారని నిలదీశారు. కేంద్ర విద్యుత్‌ శాఖ వెబ్‌సైట్‌ ప్రకారం అత్యధికంగా బకాయిలు పడిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. ఏపీ సుమారుగా రూ.10 వేల కోట్ల బకాయిలను ఏడాది కాలంగా చెల్లించలేదన్నారు. బకాయిలు చెల్లించకుండా, రూ.30 వేల కోట్ల అప్పును ఏం చేశారో ప్రభుత్వం లెక్కలు చూపాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-05-15T08:44:52+05:30 IST